Devotional

సీతాదేవి పేరిట ఓ ఉపనిషత్తే ఉంది

Who is sita? The upanishads on the name of sita.

జనకుడి కుమార్తె, శ్రీరామచంద్రుడి భార్య, మహాసాధ్వీమణి… సీతమ్మ తల్లి…

మనందరికీ తెలిసిన విషయాలివి…

కానీ సీత మహాశక్తి స్వరూపిణి… జనకుడికి నాగేటి చాలులో దొరక్కముందు, రామచంద్రుణ్ణి మనువాడకముందు కూడా ఆ శక్తి ఉంది.

అంతే కాదు ఆమె పేరుతో ఓ ఉపనిషత్తే ఉంది. అందులో ఆమె సిసలైన స్వరూపస్వభావాలు మనకు కనిపిస్తాయి.

సీతోపనిషత్తు అధర్వణ వేదంలో ఉంది. బ్రహ్మదేవుడు తన దగ్గరకు వచ్చిన దేవతలకు వివరించిన విషయాలు ఉపనిషత్తుగా మారాయి. అది సీతాదేవి మహత్వాన్ని వివరిస్తోంది.

సీతాదేవి అసామాన్యురాలు. ఆమె మూలప్రకృతి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రకృతి అంటే సీతాదేవే. అంతేకాదు.. ప్రణవనాదమైన ఓంకారంలో ఉంది కూడా ఆ తల్లే. సీత సత్వరజస్తమో గుణాత్మకమైంది. ఆమె మాయా స్వరూపిణి. సకార, ఇకార, తకారాల సంగమం సీత. స కారం ఆత్మతత్త్వానికి సంకేతం. త కారాన్ని తారా అని అంటారు. తరింపజేసేది అని దీనికి అర్థం. అంటే ఆత్మదర్శనం కలిగించి మనిషిని తరింపజేసేది ఆ మహాశక్తే అని బ్రహ్మ వివరించారు. సీతాదేవి మొదటి రూపం మహామాయ. దీన్నే శబ్దబ్రహ్మమయీ రూపం అని కూడా అంటారు. వేదాధ్యయనం చేసే చోట ఈ తల్లి ప్రసన్న రూపంతో ఉండి అత్యున్నత, అలౌకిక భావాలను కలగజేస్తుంది. రెండో రూపం జనకుడు భూమి దున్నుతున్నప్పుడు బయటపడిన రూపం. ఆమెను భూమిజ అని కూడా అంటారు. సీతమ్మ మూడో రూపం అవ్యక్తరూపం. ఇది జగత్తంతా నిండి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే జగదానందకారిణి సీతమ్మ. ఇచ్ఛ, క్రియ, సాక్షాత్‌ అనే మూడు శక్తుల రూపంగా ఈమెను సాధకులు దర్శించవచ్చని అని బ్రహ్మదేవుడు తన దగ్గరకు వచ్చిన దేవతలందరికీ తెలియజెప్పాడు.

మూల ప్రకృతి రూపత్వాత్‌

సా సీతా ‘ప్రకృతిః‘ స్మృతా!

ప్రణవ ప్రకృతి రూపత్వాత్‌

సా సీతా ‘ప్రకృతిః’ ఉచ్యతే!

‘సీతా’ ఇతి త్రివర్ణత్మా

సాక్షాత్‌ ‘మాయామయి’ భవేత్‌!