Agriculture

గుంటూరు మిర్చి యార్డ్‌లో రైతులకు కుళ్లిన అన్నం

Farmers Protest At Guntur Yard Over Spoiled Meals

గుంటూరు మిర్చి యార్డ్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. మార్కెట్‌లో కుళ్లిపోయిన అన్నం పెడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న రాజ్యంలో రైతులకు పెట్టె అన్నం ఇదేనా అని ప్రభుత్వాన్ని, అధికారులని రైతులు ప్రశ్నించారు. మిర్చి యార్డు ప్రారంభమైన నాటి నుంచి ఇలాంటి ఆహారం ఏనాడు పెట్టలేదని మండిపడ్డారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు ఇలాంటి భోజనం పెట్టేందుకు ప్రభుత్వానికి, అధికారులకు, నాయకులకు మనసు ఎలా వచ్చిందంటూ నిలదీశారు. కుళ్లిన భోజనం ప్లేట్లతో రోడ్డుపై రైతులు ధర్నా నిర్వహించారు. రైతులు ఆరుగాలం శ్రమించి పంటను పండిస్తారు. ఆ పంటను అమ్ముకునేందుకు మార్కెట్‌కు వచ్చి.. గిట్టుబాటు ధరలు లేక ఎంతో కొంత మొత్తానికి అమ్ముకుంటారు. పంటను అమ్ముకునేందుకు మార్కెట్‌కు వచ్చే రైతులకు వైసీపీ ప్రభుత్వం భోజన సౌకర్యం కల్పించింది. అయితే తాజాగా గుంటూరులోమి మిర్చి యార్డులో రైతులకు కల్పించిన భోజన సౌకర్యంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించారు. రైతులకు కుళ్లిపోయిన ఆహారం పెట్టారు. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అన్నం ఎలా తినాలంటూ రోడ్లపైకి వచ్చారు. తమ బాధను ప్రభుత్వానికి తెలియజెప్పేందుకు రోడ్డుపై కూర్చొని ధర్మా చేపట్టారు. మళ్లీ రాజన్న రాజ్యం తీసుకొస్తానన్న.. సీఎం వైఎస్ జగన్‌ను ప్రశ్నించారు. రైతును రారాజు అంటారు.. అయితే ఇక్కడ పరిస్థితి తిరగబడింది. నిరంతరం శ్రమించి పంట పండించి మనకు రెండు పూటల భోజనం పెట్ట రైతుకు.. ప్రభుత్వం కనీసం ఒకపూట మంచి భోజనం కూడా పెట్టలేకపోతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. రైతులకు మార్కెట్‌ యార్డుల్లో సరైన భోజన సౌకర్యం కల్పించాలి. రైతు దేశానికి వెన్నముక.