ScienceAndTech

టెక్నాలజీతో కొరోనాపై చైనా విజయం

China Uses Bigdata And BlockChain To Beat Corona

చైనాలోని వుహాన్‌లో ప్రారంభమైన కరోనా వైరస్ (కోవిడ్‌-19) విజృంభణ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 150 దేశాలకు తాకింది. సుమారు 1లక్షా 80 వేల మంది వైరస్‌ బారిన పడగా 7 వేల మంది మృతి చెందారు. వైరస్‌ వ్యాప్తి నివారణలో మానవాళికి టెక్నాలజీ వెన్నుదన్నుగా నిలుస్తోంది. చైనాలో కరోనాను గుర్తించిన వెంటనే టెక్‌ దిగ్గజాలైన అలీబాబా, బైడూ, హువాయి సంస్థల సహకారాన్ని అక్కడి ప్రభుత్వం తీసుకుంది. వైరస్‌ను గుర్తించడానికి ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌(కృత్రిమ మేధ), డేటా సైన్స్‌, సాంకేతిక పరిజ్ఞానం వైపు ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులు, ప్రభుత్వ సంస్థలు కరోనా నివారణ టీకాపై పరిశోధనలు ప్రారంభించాయి. ఈ సందర్భంగా కరోనా నిర్మూలనకు చైనా టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగిస్తుందో తెలుసుకొందాం.

*** కృత్రిమ మేధ
వైరస్‌ నిర్మాణాన్ని అంచనా వేయడంలో కృత్రిమ మేధ పాత్ర కీలకమైంది. వ్యక్తుల శరీరాల్లో ఉష్ణోగ్రతలో మార్పును గుర్తిస్తుంది. ప్రయాణికుల ప్రవాహానికి అంతరాయం లేకుండా బీజింగ్‌లోని క్వింగ్‌ రైల్వేస్టేషన్‌లో నిమిషానికి 200 మందిని పరీక్షించగల సామర్థ్యంతో ఏర్పాట్లు చేసింది. వైరస్‌ వ్యాప్తికి సంబంధించిన వార్తా నివేదికలు, సోషల్‌ మీడియా, ప్రభుత్వ పత్రాలను విశ్లేషణ చేసింది. ఏఐ ద్వారా అంటు వ్యాధులను ట్రాక్‌ చేసే కెనడాకు చెందిన ఓ అంకుర సంస్థ కరోనా గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కంటే ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. వైరస్‌ను సెకన్లలో గుర్తించేందుకు చైనాకు చెందిన అలీబాబా సంస్థ సరికొత్త టెక్నాలజీని రూపొందించింది. దీని ద్వారా కేవలం కొద్ది సెకన్లలోనే 96 శాతం కచ్చితత్వంతో కరోనా వైరస్‌ను గుర్తించవచ్చు. ప్రపంచంలోని పలు క్లిష్ట వ్యాధులకు ఔషధాల అభివృద్ధిలోనూ కృత్రిమ మేధ ఉపయోగపడుతోంది. దీనిలోని అల్గారిథంతో మందుల పనితీరును తెలుసుకోవచ్చు.

*** డ్రోన్లు
కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో వైద్య పరికరాలు, మందులు, రోగుల నమూనాలను రవాణా చేసేందుకు డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. ఇవి సమయాన్ని ఆదా చేయడంతోపాటు డెలివరీ వేగం పెరిగి నమూనాలు కలుషితమయ్యే ప్రమాదాన్ని నివారిస్తుంది. ఆరోగ్య సమాచారాన్ని నమోదు చేయడానికి క్యూఆర్‌ కోడ్‌ ప్లకార్డులతో డ్రోన్‌లు ఎగురుతున్నాయి. ముఖ గుర్తింపు చేసే ప్రత్యేక డ్రోన్లు నిషేధ ప్రాంతాల్లో పౌరులు ఇళ్ల నుంచి బయటకు రావడాన్ని, మాస్క్‌లు లేకుండా తిరగడాన్ని గుర్తించి వారి సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందజేస్తున్నాయి. నిర్బంధంలో ఉన్న వ్యక్తులు బయటకు రాకుండా చూసేందుకు చాలా నగరాల్లో డ్రోన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

*** రోబోలు
రోబోలు వైరస్‌ ప్రభావానికి గురికావు. వాటిని మానవ శక్తి స్థానంలో ఉపయోగించడం ద్వారా కరోనాకు గురయ్యేవారి సంఖ్యను తగ్గించవచ్చు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారికి ఆహారం, మందులు అందజేయడానికి గదులు శుభ్రం చేయడానికి ఉపయోగిస్తున్నారు. కరోనా నిర్మూలకు అభివృద్ధి చేసిన రోబోలు ఆల్ట్రావైయెలెట్ కిరణాలను ప్రసరింపజేసి వైరస్‌ను చంపేస్తాయి. చైనాలో కరోనా ప్రభావిత 40 ఆస్పత్రుల్లో వంట వండేందుకు రోబోలను ఉపయోగిస్తున్నారు. అనేక ఆస్పత్రుల్లో రోగ నిర్ధారణ, థర్మల్‌ ఇమేజింగ్‌ సేవల్లో పాల్గొంటున్నాయి.

*** బిగ్‌ డేటా
కరోనా వైరస్‌ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేందుకు డాష్‌బోర్డులు ఉపయోగపడతాయి. వ్యాధి వ్యాప్తి, ప్రాంతాల వారీగా సమాచారాన్ని ఇందులో చూడొచ్చు. ప్రజల కదలికలను గుర్తిస్తుంది. వైరస్‌ సోకిన వ్యక్తితో సంబంధాలున్నవారిని గుర్తించొచ్చు. వైరస్‌ బారిన పడిన వివరాలను ఫోన్లకు సందేశాల ద్వారా పంపి ఆయా ప్రాంతాల్లోని ప్రజలను చైనా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఆ సందేశాల్లో ఆయా వ్యక్తుల ప్రయాణ వివరాలు ఉన్నాయి. వైరస్‌ ప్రభావిత ప్రాంతాలు, వ్యక్తులతో ఎవరు ఎంత సమయం గడిపారో తెలుసుకోవచ్చు. వైరస్‌ను మోసే వ్యక్తులు గురించి ప్రజలకు తెలియజేయడం ద్వారా ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి అంచనా వేయడంతో బిగ్‌ డేటా కీలక పాత్ర పోషిస్తోంది. వైరస్‌ ఉన్నవారితో కలిసిన వారిని గుర్తించేందుకు మార్గం సులభమైంది.

*** కలర్‌ కోడింగ్‌
ప్రజా ప్రయోజనార్థం చైనా ప్రభుత్వం అలీబాబా, టెన్సెంట్‌ సంస్థలతో కలిసి కలర్‌ కోడెడ్‌ హెల్స్‌ రేటింగ్‌ సిస్టంను అభివృద్ధి చేసింది. వ్యక్తుల ప్రయాణ, వైద్య చరిత్రల ఆధారంగా ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగులను ప్రజలకు కేటాయిస్తుంది. ఒక వ్యక్తిని నిర్భందించాలా, బహిరంగ ప్రదేశాల్లోకి అనుమతించాలా అనేది ఈ కోడ్‌ ఆధారంగా నిర్ణయిస్తారు. అలీబాబా పే, యాంట్స్‌ పే వాలెట్ల ద్వారా ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా లాగిన్‌ కావాల్సి ఉంటుంది. మెట్రో స్టేషన్లు, కార్యాలయాలు, బస్టాండ్లలో ఏర్పాటు చేసిన క్యూఆర్‌ కోడ్‌ను ఉపయోగించిన తర్వాత గ్రీన్‌ కలర్‌ కోడ్‌ ఉన్న వారినే మాత్రమే ప్రజా రవాణాలో అనుమతిస్తారు. కోడ్‌, వ్యక్తి శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేసేందుకు చైనా దేశవ్యాప్తంగా చాలా చెక్‌పాయింట్లు ఉన్నాయి. చైనాలో 200పైగా నగరాల్లో ఈ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు.

*** చాట్‌బాట్స్‌
చైనాలో పాపులర్‌ మెసేజింగ్‌ యాప్‌ వుయ్‌చాట్‌ ద్వారా ఉచితంగా ఆరోగ్య సలహాలు, ఆస్పత్రుల వివరాలు అందజేస్తున్నారు. ఈ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఉచితంగా వైద్యుల సలహాలు పొందవచ్చు. రవాణా, పర్యటక రంగంలో సేవలు అందించే సంస్థలు ప్రత్యేకంగా చాట్‌బాట్స్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. పర్యాటకులకు తాజా ప్రయాణ వివరాలు, సేవల్లో అంతరాయాలు గురించి తెలియజేసేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

*** డ్రైవర్‌ రహిత వాహనాలు
కరోనా ప్రభావంతో ఆరోగ్య సంరక్షణ నిపుణల కొరత ఎదుర్కొంటున్న చైనాకు డ్రైవర్‌ రహిత వాహనాలు ఉపశమనం కలిగిస్తున్నాయి. ప్రజలను సంప్రదించే సమయంలో వైరస్‌ ప్రభావితమయ్యే అవకాశం అధికంగా ఉంటుంది. ఈ వాహనాల ద్వారా మందులు, ఆహార పదార్థాలు, ప్రజలకు అవసరమైన వస్తువులను పంపిణీ చేయడం సులభమైంది. ప్రధానంగా వీధులను శుభ్రపరిచేందుకు, ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలకు వీటిని వినియోగిస్తున్నారు.

*** బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ
కరోనా బాధితుల సంఖ్య పెరగడంతో వైద్య సిబ్బందితోపాటు ఆస్పత్రిలోని పరిపాలన సిబ్బందిపైనా పనిభారం పెరిగింది. దీనిని తగ్గించేందుకు బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. కరోనా రోగులకు సంబంధించిన ఆస్పత్రి బిల్లులు, ఆరోగ్య బీమా పాలసీల ప్రాసెస్‌ను వేగవంతం చేయడంలో నూతన టెక్నాలజీ ఉపయోగపడుతుంది. దీనిద్వారా ఆస్పత్రి సిబ్బంది, చికిత్స పొందుతున్న వారి మధ్య ముఖాముఖి చాలా వరకు తగ్గిపోయింది.