Editorials

దిశా ఘటనతో నిర్భయకు న్యాయం-TNI Special Focus

How Disha Helped Nirbhaya Culprits Get Hanged With Justice - Nirbhaya And Disha India

2012 డిసెంబరు 6వ తేదీన హత్యాచారానికి గురైన “నిర్భయ”కు భారతదేశంలో న్యాయం దొరకడానికి 7ఏళ్లు పట్టిందంటే సగటు భారతీయుడుకి ఒకింత గర్వంగా ఉంటుంది. న్యాయాలయాల్లో కొండలు కొండలుగా పేరుకుపోయిన తగాదాలు, కేసులు, వాయిదాలు, న్యాయమూర్తుల కొరత, వ్యవస్థలోని లొసుగులను సరిగ్గా సవరించకపోవడం వంటి ఎన్నో అవాంతరాల మధ్య దశాబ్దాలు నడవాల్సిన అగత్స్యం పట్టకుండా ఈ కేసు ఇంత త్వరగా కొలిక్కిరావడం ముదావహం. “నిర్భయ” నిందితుల చావును ఇంత త్వరగా రాసింది మాత్రం “దిశా” అనడంలో సందేహమే లేదు. అదెలాగంటే…

2019 నవంబరు 27. హైదరాబాద్‌కు చెందిన డా.ప్రియాంకా రెడ్డి(దిశా)ను అతి కిరాతకంగా అత్యాచారం చేసి, పెట్రోల్ పోసి నలుగురు నిందితులు తగలబెట్టారని వార్త ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్తు దేశాన్ని విస్మయపరిచింది. ఇది మరో తరహా నిర్భయ అని పౌరదళం ఆక్రోశం మిన్నంటగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలోని తెలంగాణా పోలీసులు వారిని డిసెంబరు 6 2019న (సరిగ్గా నిర్భయ మరణించి ఏడేళ్లు) చట్రాన్‌పల్లి వద్ద ఎన్‌కౌంటర్ చేశారు. ఈ నలుగురికి న్యాయం ఇంత త్వరగా చట్టాన్ని కాపాడే రక్షకదళం నుండి రావడం హర్షాతిరేకాలను మూటగట్టుకుంది. నిర్భయ నిందితులను కూడా ఇదే తరహాలో చంపాలని మళ్లీ ఆందోళనలు మిన్నంటాయి. అప్పటివరకు జైలులో జల్సాగా గడుపుతున్న నిర్భయ నిందితుల వ్యవహారం మళ్లీ తెరమీదకి వచ్చింది. ఈ క్రమంలో జాతీయ మీడియా, న్యాయ వ్యవస్థ, ప్రభుత్వాలు నిర్భయ నిందితులను జైలులో సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా ఉరి తీయకుండా ఎందుకు తిండి పెట్టి మేపుతున్నారనే ప్రశ్నకు సమాధానం – ఉరి తీసే తలారీ దొరకలేదని! 121కోట్ల భారతీయుల్లో ఏడేళ్ల కాలవ్యవధిలో ఒక్క తలారీ దొరకలేదనే కారణంతో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను అపహాస్యం చేస్తూ దేశాన్ని వణికించిన ఓ భయంకర నేర నిందితులను ఉపేక్షించడం హాస్యాస్పదం. కేవలం తలారీ కారణం ప్రభుత్వానిది అయితే, క్షమాభిక్ష, ఆరోగ్య అంశాలు, న్యాయ లొసుగులను అడ్డుపెట్టుకుని నిర్భయ నిందితులు ఆడిన మరణ చదరంగం వారిని కాపాడకపోగా ఉరికంబం మీదా ఎట్టకేలకు విగతజీవులుగా వేలాడదీసింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థలు మేల్కొని నిర్భయ నిందితుల నుండి పాఠాలు నేర్చుకుని లొసుగులను సవరించాల్సిన అవసరం ఉంది.