DailyDose

రైల్వే రాయితీలు రద్దు-వాణిజ్యం

Indian railway bans all concessions-Telugu Business news roundup today

* కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ప్రయాణికులకు అందించే రాయితీని రద్దు చేసింది. అనవసర ప్రయాణాలను నిలుపుదల చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని కేటగిరీలు మినహా సీనియర్‌ సిటిజన్లకు కూడా రాయితీని రద్దు చేసింది. మార్చి 20 అర్ధరాత్రి నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. కొవిడ్‌-19 దృష్యా అనవసర ప్రయాణాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. విద్యార్థులు, నాలుగు కేటగిరీలకు చెందిన దివ్యాంగులు, 11 కేటగిరీలకు చెందిన రోగులకు మాత్రం మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది. రిజర్వేషన్‌, రిజర్వేషన్‌ లేని ప్రయాణానికి ఇది వర్తిస్తుంది. వృద్ధుల్లో ఈ ప్రమాదం అధికంగా ఉన్న రీత్యా వారిని ప్రయాణాలకు దూరంగా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మొత్తం 53 కేటగిరీలకు టికెట్‌పై రాయితీ ఇస్తుండగా.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు 15 కేటగిరీల వారికి మాత్రమే రాయితీని పరిమితం చేసింది. ఒకవేళ టికెట్‌ రద్దు చేసుకుంటే ఎలాంటి ఛార్జీలు విధించబోమని ప్రకటించింది. ప్రయాణించాలంటే మాత్రం పూర్తి రుసుము వసూలు చేస్తామని స్పష్టంచేసింది. ఇప్పటికే తక్కువ ఆక్యుపెన్సీ కారణంగా మార్చి 31 వరకు భారతీయ రైల్వే 155 జతల రైళ్లను రద్దు చేసింది.

* యెస్‌బ్యాంకు కేసులో సమన్లు అందుకున్న అడాగ్‌ గ్రూపు చైర్మన్‌ అనిల్‌ అంబానీ ఈరోజు ముంబయిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. యెస్‌బ్యాంకు నుంచి తీసుకున్న రుణాల విషయంలో అనిల్‌ అంబానీ వాంగ్మూలాన్ని రికార్డు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా అడాగ్‌ గ్రూపునకు చెందిన మరికొందరిని కూడా ఈడీ త్వరలోనే విచారించనున్నట్లు సమాచారం.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ప్రీమార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను మొదలు పెట్టిన మార్కెట్లు ఆ తర్వాత కూడా నష్టాలను కొనసాగించాయి. ఉదయం 9.16 సమయంలో సెన్సెక్స్‌ 1,555 పాయింట్లు నష్టపోయి 27,314 వద్ద, నిఫ్టీ 493 పాయింట్లు నష్టపోయి 7,975వద్ద ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. నిన్న రాత్రి అంతర్జాతీయ మార్కెట్లో భారీగా చమురు ధరలు పడిపోవడం, అమెరికా మార్కెట్లో నష్టాలు కొనసాగడంతో దేశీయ మార్కెట్లలో కూడా అమ్మకాల జోరు కొనసాగుతోంది. రిలయన్స్‌ 4శాతం విలువ కోల్పోగా..ఎస్బీఐ 5శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 7శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటి షేర్లు భారీగా విలువ కోల్పోవడంతోమ సూచీలు కూడా నేల చూపులు చూస్తున్నాయి. మరోపక్క చమురు ధరల పతనం ప్రభావం మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది.