Fashion

పూజగది అలంకరణ సామాగ్రి

Telugu Spiritual Fashion News-Prayer Room Fashion

బంగారం లాంటి మెరుపు… చక్కని ఆకృతి… ఒద్దికగా పొదిగిన రాళ్లు… చూడగానే ఆకర్షించేలా ఉన్న వీటిని చూసి అమ్మాయి మెడలో హారం చివర అందంగా వేలాడే పతకాలేమో అనుకుంటే పొరపాటే! ఆరాధనకు శోభ చేకూర్చేలా అందానికి చిరునామాలా ఉన్న ఇవన్నీ డిజైనర్‌ అగరుబత్తీ స్టాండ్లు!
***పూజ గదిని అందంగా అమర్చుకోవడం ఆడవారికి ఎంతిష్టమో! అక్కడుండే ప్రతి వస్తువూ ఆకర్షణీయంగా కనిపించాలనుకుంటారు. అందుకే హారతిపళ్లేలూ కుంకుమ భరిణెల వంటివి ఇప్పటికే వివిధ డిజైన్లలో వచ్చేశాయి. దేవుని ప్రతిమలు నిలిపే పీటలూ దీపపు కుందులూ ఎప్పటికప్పుడు కొత్తగా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడీ జాబితాలోకి అగరుబత్తీ స్టాండ్లు కూడా చేరిపోయాయి! అగరొత్తులు వెలిగించాక… ఏ అరటిపండుకో గుచ్చేసే రోజులు పోయి చాలా కాలమైంది. స్టీలుతో చేసిన గుండ్రటి అగరుబత్తీ స్టాండ్లు వాడటం మనకు బాగా తెలుసు. ఆ తర్వాత చిన్నపాటి ప్లేట్ల మాదిరిగానూ నిలువుగా గొట్టంలాగానూ పువ్వుల ఆకారంలోనూ పట్టుకోవడానికి హోల్డర్‌ ఉన్నవీ దీపం కుందుల్లా కనిపించేవీ… ఇలా రకరకాల డిజైన్లలో అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటన్నింటికీ భిన్నంగా… చూడటానికి అమ్మాయి మెడలోని పెండెంటుల్లా, భగవంతుని ప్రతిమల్లా కనిపించే మాట్‌ ఫినిషింగ్‌ అగరబత్తీ స్టాండ్లు దొరుకుతున్నాయిప్పుడు.
**ఆకృతే అందం!
మామూలు స్టాండ్లలో డిజైన్‌కు పెద్దగా ప్రాధాన్యం ఉండదు, సాదాగానే ఉంటుంటాయి. కానీ ఈ కొత్తరకం స్టాండ్లు సంప్రదాయానికి ప్రాముఖ్యతనిస్తూనే ఆధునిక డిజైన్లలో ఆకట్టుకుంటున్నాయి. ముందువైపు చిన్నపాటి విగ్రహంలాగానూ అందమైన ప్రతిమ ఉన్నట్టుగానూ కనిపించే వీటికి, వెనుకవైపు అగరొత్తులు గుచ్చేందుకు గొట్టాలుంటాయి. ఎక్కువగా లక్ష్మీదేవి, వినాయకుడు, వేంకటేశ్వరస్వామి వంటి దేవుని రూపాల్లో లభిస్తున్నాయి. ఏనుగు, నెమలి వంటి ఆకృతుల్లో విభిన్నంగానూ కనిపిస్తున్నాయి. అచ్చంగా లోహంతో చేసినవి కొన్నయితే… ఎరుపూ పచ్చా రాళ్లు పొదిగినవి మరికొన్ని. అక్కడక్కడా ముత్యాలు కూడా జతచేస్తున్నారు. మాట్‌ ఫినిషింగ్‌ వల్ల వచ్చే యాంటిక్‌ లుక్‌ వీటికి మరింత హుందాతనం తీసుకొస్తోంది. గోల్డ్‌ కవరింగ్‌తో దొరికే ఇలాంటి స్టాండ్‌ ఒకటి తెచ్చుకుంటే సువాసన కోసం అగరొత్తులు వెలిగించి హాల్లో టీపాయ్‌ మీద ఆర్ట్‌ పీస్‌లా కూడా పెట్టుకోవచ్చు. అగరొత్తుల పరిమళాలు మనసుకు హాయినిస్తే.., అందమైన ఈ స్టాండ్లు కంటికి విందు చేస్తూ ఇంటికి అందాన్నిస్తాయి… కాదంటారా!