Editorials

శార్వరీ అంటే రాత్రి అని అర్థం-TNI Ugadi Special

Sarvari Nama Ugadi 2020 Special Telugu News

ఉగాది వచ్చేసింది కదా… ఈ కొత్త ఏడాదిని వికారి నామ సంవత్సరం అంటున్నారు… ఇలాంటి తెలుగు సంవత్సరాలు మొత్తం అరవై… అవేంటో, వాటి అర్థాలేంటో ఈ రోజు చూసేద్దాం… అయితే ఆ అర్థాలు ఆ ఏడాది ఫలితాల్ని ప్రతిబింబిస్తాయని కాదు.
1. ప్రభవ
పుట్టుక
2. విభవ
వైభవంగా ఉండేది
3. శుక్ల
అంటే తెల్లనిది. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక
4. ప్రమోదూత
ఆనందం. ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత
5. ప్రజోత్పత్తి
ప్రజ అంటే సంతానం. సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి
6. అంగీరస
అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి. ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది
7. శ్రీముఖ
శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్థం
8. భావ
భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు.
9. యువ
యువ అనేది బలానికి ప్రతీక
10. ధాత
అంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు
11. ఈశ్వర
పరమేశ్వరుడు
12. బహుధాన్య
సుభిక్షంగా ఉండటం
13. ప్రమాది
ప్రమాదమున్నవాడు అని అర్థమున్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడాల్సిన అవసరం లేదు
14. విక్రమ
విక్రమం కలిగిన వాడు
15. వృష
ధర్మం
16. చిత్రభాను
భానుడంటే సూర్యుడు. సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించటం. చిత్రమైన ప్రకాశమంటే మంచి గుర్తింపు పొందడమని అర్థం
17. స్వభాను
స్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం
18. తారణ
తరింపచేయడం అంటే దాటించడం. కష్టాలు దాటించడం, గట్టెక్కించడం అని దీనర్థాలు
19. పార్థివ
పృథ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికున్నంత సహనం, గుర్రానిదైన అశ్విక శక్తితో పనిచేసేవాడని అర్థం
20. వ్యయ
ఖర్చు కావటం. ఈ ఖర్చు శుభాల కోసం చేసే ఖర్చై ఉంటుందని ఈ సంవత్సరం గురించి చెప్పుకొన్న అర్థం
21. సర్వజిత్‌
సర్వాన్ని జయించినది
22. సర్వధారి
సర్వాన్ని ధరించేది
23. విరోధి
విరోధం కలిగినటువంటిది
24. వికృతి
వికృతమైనటువంటిది
25. ఖర
గాడిద, కాకి, ఒక రాక్షసుడు, వాడి, వేడి, ఎండిన పోక అనే అర్థాలున్నాయి
26. నందన
కూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలుగజేసేది
27. విజయ
విశేషమైన జయం కలిగినది
28. జయ
జయాన్ని కలిగించేది
29. మన్మథ
మనస్సును మధించేది
30. దుర్ముఖి
చెడ్డ ముఖం కలది
31. హేవిలంబి
సమ్మోహన పూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం
32. విలంబి
సాగదీయడం
33. వికారి
వికారం కలిగినది
34. శార్వరి
రాత్రి
35. ప్లవ
తెప్ప, కప్ప, జువ్వి
36. శుభకృత్‌
శుభాన్ని చేసిపెట్టేది
37. శోభకృత్‌
శోభను కలిగించేది
38. క్రోధి
క్రోధాన్ని కలిగినది
39. విశ్వావసు
విశ్వానికి సంబంధించినది.
40. పరాభవ
అవమానం
41. ప్లవంగ
కోతి, కప్ప..
42. కీలక
పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య
43. సౌమ్య
మృదుత్వం
44. సాధారణ
సామాన్యం
45. విరోధికృత్‌
విరోధాలను కలిగించేది
46. పరీధావి
భయకారకం
47. ప్రమాదీచ
ప్రమాద కారకం
48. ఆనంద
ఆనందమయం
49. రాక్షస
రాక్షసత్వాన్ని కలిగినది
50. నల
నల్ల అనే పదానికి రూపాంతరం
51. పింగళ
ఒక నాడి, కోతి, పాము, ముంగిస.
52. కాలయుక్తి
కాలానికి తగిన యుక్తి
53. సిద్దార్థి
కోర్కెలు సిద్ధించినది
54. రౌద్రి
రౌద్రంగా ఉండేది
55. దుర్మతి
దుష్ట బుద్ధి
56. దుందుభి
వరుణుడు
57. రుధిరోద్గారి
రక్తాన్ని స్రవింప చేసేది
58. రక్తాక్షి
ఎర్రని కన్నులు కలది
59. క్రోధన
కోప స్వభావం కలది
60. అక్షయ
నశించనిది

###

మనం చైత్రశుద్ధపాడ్యమిని ఉగాదిగా భావించినట్టు.. ఒక్కో రాష్ట్రానిదీ ఒక్కో సంప్రదాయం. సూర్యమానం, చాంద్రమానం, వాటిల్లోనూ పలు సంప్రదాయాల వల్ల ఈ సంవత్సరాదిని జరుపుకునే కాలాల్లోనూ ఎన్నో వైవిధ్యాలున్నాయి. ఓ రకంగా జనవరి నుంచి డిసెంబర్‌దాకా ఏడాదిలో ఏదో ఒక రాష్ట్రం తమ సంప్రదాయ ఉగాదిని పాటిస్తూనే ఉంటాయని చెప్పొచ్చు. ఆ విభిన్న ఉగాదుల సమాచార సమాహారం ఇది..

*గుడీపడ్వా

మహారాష్ట్రలో జరుపుకునే ఉగాది ఇది. వాళ్లూ మనలాగే చైత్రశుద్ధ పాడ్యమినాడు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. పాడ్యమినే మరాఠీలో పడ్వా అంటారు. ఇక ‘గుడీ’ అంటే ధ్వజం. వెదురుపుల్లకు పట్టువస్త్రం చుట్టి, పూలతో అలంకరిస్తారు. పైన వెండి లేదా కంచు పాత్ర బోర్లిస్తారు. ఈ జెండాలాంటి ఆకారాన్ని బ్రహ్మధ్వజానికి ప్రతీకలా భావించి కొలుస్తారు. మన తెలుగువాళ్లలాగే బ్రహ్మ ఈ ఉగాది రోజే సృష్టి ఆరంభించాడని వాళ్లూ నమ్మతారు కాబట్టే ఈ పూజ! మరాఠీలూ షడ్రుచులతో ఉగాది పచ్చడి చేస్తారు. కాకపోతే దానికి వాము అదనంగా చేరుస్తారు. మనలాగే ఉగాదినాడు పండితుల పంచాంగ పఠనం కూడా వింటారు!

*విశూ

మలయాళీల సంవత్సరాది ఇది. సౌరమానం ప్రకారం లెక్కగడతారు కాబట్టి.. సూర్యుడు మేషంలో ప్రవేశించే తొలి రోజుని సంవత్సరాదిగా భావిస్తారు. ఈ తొలి నెలని వాళ్లు మేడం(మేషం) అనే పిలుస్తారు. ఏటా ఏప్రిల్‌ 14న వస్తుందీ వేడుక. పండగకి ముందు సాయంత్రం కుటుంబంలోని అందరికన్నా పెద్ద వయస్కురాలు ఓ పళ్లెంలో పచ్చిబియ్యం, కొత్తబట్టలు, బంగారు-పసుపు రంగుతేలిన దోసకాయలూ, అరటిపళ్లూ, తమలపాకులూ, అద్దం తీసుకుంటుంది. ఆ పళ్లాన్ని ఉరళి అంటారు. విశూ రోజు ఆమే ముందుగా లేచి ఉరళిని తీసుకెళ్లి నిద్రపోతున్నవాళ్లని మేల్కొలుపుతుంది. నిద్రలేచినవాళ్లు ఈ పాత్రనే మొదట చూడాలన్నమాట! ఇలా చూడటాన్నే ‘విశూ కని’ అంటారు. మలయాళంలో కని అంటే చూడటమని. ఇలా చేయడం వల్ల సర్వశుభాలు కలుగుతాయని వాళ్ల నమ్మకం.

*బైశాఖి

ఇది సౌరమానం ప్రకారం వస్తుంది. వాళ్ల తొలి నెల వైశాఖం. దీన్నే బైశాఖీ అని పిలుస్తారు. పంజాబీలు ఈ సంవత్సరాదిని.. మన సంక్రాంతిలా చేస్తారు. పంట చేతికొచ్చే సమయంలో కోలాహలంగా నిర్వహిస్తారు. పొలాల్లోనే ఆటాపాటలుంటాయి. కొత్తగా పండిన గోధుమలను పిండి పట్టించి, ఆ పిండితో రొట్టెలు చేసి బెల్లం, నెయ్యి కలిపి ఆరగిస్తారు. సాయంత్రాల్లో పంట కొట్టిన తుప్పతో పెద్ద మంటలు వేసి, వాటి చుట్టూ స్త్రీ, పురుషులు భాంగ్రా, గిద్దా నృత్యాలు చేస్తారు.

*బెస్తు వర్ష్‌

గుజరాతీలు మనలాకాకుండా కార్తికశుద్ధ పాడ్యమిరోజుని సంవత్సరాదిగా భావిస్తారు. అంటే.. దీపావళి మరుసటి రోజన్నమాట. దీన్ని బెస్తు వర్ష్‌ అంటారు. భాగవతంలో శ్రీకృష్ణుడు గోవర్థనగిరిని పైకెత్తే పర్వం గుర్తుందా? ఆ గోవర్థననానికున్న మరోపేరే అన్నకూట్‌. అప్పుడే పండిన ధాన్యాలతో ఆహారం, తీపి పదార్థాలు ఓ పళ్లెంలో దేవుని ముందు కొండలా పెట్టి గొంతెత్తి పాడి దాన్ని ప్రసాదంలో తీసుకోవడమే ఈ పర్వదినాన ప్రధాన క్రతువు.

###
కొత్త సంవత్సరాది రోజున లేత మామిడాకుల తోరణాలూ, శ్రావ్యమైన కోయిల గానాలూ, అందమైన ముగ్గులతో కళకళలాడే వీధివాకిళ్లూ ఇంటికి సంప్రదాయ కళను తెస్తే… షడ్రుచుల పచ్చడి జీవిత తత్వాన్ని బోధిస్తుంది. మరి రాబోయే శార్వరీ నామ సంవత్సరాది రోజున చేయాల్సిన పనులూ.. మనం తీసుకునే ఉగాది పచ్చడి వల్ల కలిగే ఉపయోగాలేంటో చూద్దామా.
****ఉగాది అంటే… సృష్టి ప్రారంభానికి సూచిక. ఉత్తరాయణం, దక్షిణాయనం కలిపి మొదలయ్యే సంవత్సరాది. ఈ రోజున ప్రత్యేక పూజలంటూ లేకపోయినా… కొత్తగా ఏ పనులు మొదలుపెట్టినా అవి మిగిలిన ఏడాదంతా దివ్యంగా సాగుతాయని విశ్వసిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజునే పాత లెక్కలు మూసేసి కొత్త లెక్కలు రాయడం మెదలుపెట్టే సంప్రదాయమూ ఉంది. కొత్త సంవత్సరాదిని ఆనందంగా, శుభప్రదంగా జరిపితే… మిగిలిన ఏడాదంతా బాగుంటుందని అంటారు. ఈ రోజున చేసుకునే షడ్రుచుల పచ్చడి జీవితతత్వాన్ని బోధించడమే కాదు, ఆరోగ్యాన్నీ అందిస్తుంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చేసుకునే ఈ పండగను తొలుత యుగాది అని పిలిచేవారు. దీనికి యుగస్య ఆదిః అని అర్థం. అంటే… ఉత్తర, దక్షిణ ఆయనాలు రెండూ కలిసి ఉండే సంవత్సరానికి చైత్రశుద్ధ పాడ్యమే ఆది కనుక అదే యుగాది అయింది. కాలక్రమంలో ఆ యుగాదే ఉగాదిగా మారింది. బ్రహ్మ సృష్టిని ప్రారంభించిన రోజు కూడాఇదే. సకల చరాచర జీవరాశికీ మూల కారకుడైన బ్రహ్మ ఈ మహత్కార్యాన్ని ఆరంభించిన రోజును అత్యంత వైభవంగా జరపాలనే ఆకాంక్ష కూడా ఉగాదికి నాంది అయింది.
****అరవై తెలుగు సంవత్సరాలు…
కాలం ఎప్పుడూ చక్రభ్రమణం చేస్తూ ఉంటుంది. ఎక్కడ అంతం అవుతుందో అక్కడినుంచే ప్రారంభం అవుతుందంటారు. వసంత రుతువులో వచ్చే చైత్రమాసం శుద్ధపాడ్యమితో కొత్త సంవత్సరాది మొదలై, ఫాల్గుణ మాసంతో పూర్తవుతుంది. ఆ తరవాతే మళ్లీ చైత్రమాసం వస్తుంది. ఇలా ప్రతిఏటా వచ్చే కొత్త సంవత్సరాదిని మనం ఒక్కో పేరుతో పిల్చుకుంటాం. వాటికి ఆ పేర్లు రావడం వెనుకా ఓ కథ ఉంది. ఓసారి నారద మహర్షి విష్ణుమాయ వల్ల స్త్రీగా మారి ఓ రాజును పెళ్లాడతాడు. వారికి అరవైమంది పుత్రులు జన్మిస్తారు. కానీ ఓ యుద్ధంలో వాళ్లంతా మరణిస్తారు. అప్పుడు నారద మహర్షి నారాయణుడిని ప్రార్థిస్తే ‘నీ పిల్లలు అరవై సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు. అలా వారి పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయి’ అని వరమిస్తాడు. అవే ప్రస్తుతం తెలుగు సంవత్సరాలుగా వాడుకలో ఉన్నాయి. వీటిలో ఒక్కో పేరుకీ ఒక్కో ప్రత్యేకమైన అర్థం ఉంది. ఈ ఏడాదిని మనం శార్వరీ నామ సంవత్సరంతో జరుపుకోబోతున్నాం. అరవై సంవత్సరాల్లో ఇది 34వ సంవత్సరం. శార్వరీ అంటే సంస్కృతంలో రాత్రి అని అర్థం. ఈ పేరు లక్ష్మీ సహస్రనామంలో వస్తుంది. అమ్మవారిని మనం శార్వర్యై నమః అని కొలుస్తాం. లక్ష్మీ అంటే సంపదకు సంకేతం కాబట్టి ఈ ఏడాది అందరికీ ఐశ్వర్యఫలితాలు అందుతాయని చెప్పుకోవచ్చు. కిందటేడులానే తగినన్ని వర్షాలూ పడతాయి కాబట్టి రైతులకూ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ పండగను జరుపుకోవడానికీ పద్ధతుంది. ఆ రోజున బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి పెద్దవాళ్లతో తలకు నువ్వులనూనె పెట్టించుకుని, వాళ్ల ఆశీర్వాదం తీసుకుని అభ్యంగన స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఆకలి, దప్పిక, మలిన నిర్మూలనలు జరుగుతాయని అంటారు. కొత్త బట్టలు కట్టుకుని ఆత్మీయుల సాంగత్యంలో గడిపితే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని చెబుతారు. ఆ తరువాత ఇష్టదేవతను ప్రార్థించి పరగడుపున ఉగాది పచ్చడిని స్వీకరించాలి. అలాగే ఉగాది రోజున పంచాంగ శ్రవణం కూడా చేయాలనీ చెబుతారు పెద్దలు.
***(పంచాంగ శ్రవణం ఎందుకంటే…
పంచాంగం అంటే అయిదు విభాగాలని అర్థం. అవే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. తిథులు పదిహేనూ, వారాలు ఏడూ, అశ్వని మొదలు రేవతి వరకూ 27 నక్షత్రాలూ విష్కంభం మొదలు వైధృతి వరకూ 27 యోగాలూ బవ మొదలు కింస్తుఘ్నం వరకూ 11 కరణాలన్నింటి గురించి తెలియజేసేదే పంచాంగం. మనకు తెలిసిన ఖగోళ శాస్త్రం ఆధారంగా ఏ గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్నాయో లెక్కించి, ఆ ప్రకారం ఫలితాలను అంచనా వేయడమే పంచాంగం ప్రధాన ఉద్దేశం. తిథి విషయంలో జాగ్రత్త పడితే సంపద.. వారం వల్ల ఆయుష్షు, నక్షత్రం వల్ల పాపపరిహారం, యోగం వల్ల ఆరోగ్యం, కరణం వల్ల విజయం ప్రాప్తిస్తాయని అంటారు. పంచాంగం సిరిసంపదలను ప్రసాదిస్తుంది.దుస్స్వప్నాలను హరించడంతోపాటు గంగానదీ స్నాన ఫలితాన్నిస్తుంది. గోదానం చేసిన భాగ్యాన్నీ, ఆయురారోగ్యాలనూ, విద్యాబుద్ధులనూ, సత్సంతానాన్నీ ప్రసాదిస్తూ సకల విజయాలనూ సిద్ధింపజేస్తుంది. పంచాంగ శ్రవణ సమయంలో ఎన్నోసార్లు గ్రహాల పేర్లు పలుకుతారు. అందువల్ల ఆయా గ్రహాలు సంతోషిస్తాయట. ఫలితంగా పంచాంగ శ్రవణం చేసినవాళ్లకీ, విన్నవాళ్లకీ సూర్యుడి వల్ల తేజస్సూ, చంద్రుడి వల్ల వైభవం, కుజుడి వల్ల సర్వమంగళం, బుధుడి వల్ల బుద్ధివికాసం, గురుడి వల్ల జ్ఞానం, శుక్రుడి వల్ల సుఖం, శనివల్ల దుఃఖరాహిత్యం, రాహువు వల్ల ప్రాబల్యం, కేతువు వల్ల ప్రాధాన్యం కలుగుతాయనీ, దేవతలూ అనుగ్రహిస్తారనీ శాస్త్రాలు చెబుతున్నాయి.
****ఉగాది పచ్చడి – ఆరోగ్యప్రదాయిని
వసంతం అంటే ప్రారంభ రుతువు. ఈ సమయంలో చెట్లు చిగురిస్తాయి. పూలూ పూస్తాయి. ఈ మార్పుల ప్రభావం వ్యక్తిగత జీవితంపైనా పడుతుంది. దాంతో అనారోగ్యాలు దాడిచేయకుండా ఉండేందుకు ఈ సమయంలో ఏ ఔషధాలు మేళవిస్తే మంచిదో వాటితోనే ఉగాది పచ్చడిని తయారుచేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
ప్రధానంగా ఉగాది పచ్చడిలో వాడే బెల్లం, వేపపూత, మామిడి, చింతపండు, ఉప్పు, కారం… ఒక్కో రుచిని అందించడమే కాదు, తద్వారా వాత, పిత్త, కఫదోషాలను నిరోధిస్తాయి. అలాగే కొత్త ఏడాదిలో ఎదురయ్యే
ఆరు విధాలైన అనుభవాలను స్వీకరించేందుకు ఆ రోజునుంచీ సిద్ధంగా ఉండాలనీ ఈ పచ్చడి మనకు తెలియజేస్తుంది.
* వేపపూత:
ఇది చేదుగా ఉంటుంది. జీవితంలో బాధ కలిగించే సంఘటనలన్నీ చేదుగానే ఉంటాయి. వాటిని తట్టుకోవాలనేదే ఈ చేదు అంతరార్థం. ఆరోగ్యపరంగా చెప్పాలంటే ఈ చేదు కడుపులోని క్రిముల్ని నాశనం చేస్తుంది. రక్తశుద్ధికి తోడ్పడుతుంది. చర్మవ్యాధుల్ని నివారిస్తుంది. కంటిచూపునీ మెరుగుపరుస్తుంది.
* బెల్లం:
ప్రతి మనిషి జీవితంలో మధురానుభూతులు అన్నివేళలా ఉంటే, ఎప్పుడైనా ఏ చిన్న దుఃఖం ఎదురైనా తట్టుకునే శక్తి ఉండదు. అందుకే తీపి కూడా మితంగానే తీసుకోవాలని ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. అప్పుడే మనసూ ఆహ్లాదంగా ఉంటుంది. బెల్లం శరీరానికి కావాల్సిన విటమిన్లూ, ఖనిజాలను అందిస్తుంది. దగ్గూ, అజీర్తీ, మలబద్ధకం, అలర్జీ వంటి సమస్యలను నివారిస్తుంది.
* ఉప్పు:
ఏ పదార్థమైనా రుచిగా ఉండాలంటే అందులోని
ఉప్పే కీలకం. దీన్ని ఉత్సాహానికి ప్రతీకగా చెబుతారు. అయితే ఇది సరైన పాళ్లలోనే ఉండాలి లేదంటే జీవితంలో ఆందోళనే కాదు, ఆరోగ్యపరంగానూ ముప్పు తప్పదు.
* కారం:
ఇందుకోసం కొందరు నేరుగా కారం వాడితే, మరికొందరు మిరియాల పొడిని వేస్తారు. ఇలా ఏ పదార్థంలోనైనా కారం వాడినప్పుడు దాన్నుంచి వచ్చే మంటను తట్టుకోవాలి. అంటే జీవితంలో ఎదురయ్యే సందర్భాలను ధైర్యంగా తట్టుకునే శక్తిని సొంతంచేసుకోవాలి. కారం ఆకలిని పెంచుతుంది. కొవ్వునీ కరిగిస్తుంది.
* చింతపండు: చింతపండులోని పులుపు నేర్పుకు సంకేతం. నేర్పు లేకుండా జీవితంలో నెగ్గుకురాలేం. ఆరోగ్యపరంగా చెప్పాలంటే ఇది ఉష్ణాన్ని తగ్గిస్తుంది. వాత, పైత్య, శ్లేష్మ రోగాల్ని నివారిస్తుంది. జ్వరం రాకుండా చేస్తుంది. గుండెకు బలాన్ని కలిగిస్తుంది. జీర్ణశక్తిని పెంచడంతోపాటూ విరోచనకారిగానూ పనిచేస్తుంది.
* మామిడి:
ఇది పదార్థానికి వగరు రుచిని ఇస్తుంది. అంటే సవాళ్లను స్వీకరించేందుకు సదా సిద్ధంగా ఉండాలన్నదే దీని సారాంశం. ఆరోగ్యపరంగా మామిడిపిందెలు శరీరంలోని మలినాలనూ, పొట్టలో పేరుకున్న వాయువులనూ పోగొడతాయి. పెద్దపేగుకు బలాన్ని చేకూర్చడంతోపాటూ శరీరాన్ని చల్లబరిచి, వడదెబ్బ రాకుండా చేస్తాయి. ఇన్నివిధాలుగా మేలుచేసే ఉగాది పచ్చడిని ఈ ఒక్కరోజునే కాకుండా… చైత్రమాసం మొత్తం రోజూ కొద్దిగా తీసుకోగలిగితే అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
###
ఉగాదిపచ్చడి షడ్రుచుల సమ్మేళనం. సంవత్సర కాలపరిమితిలో ఆరు రుతువులకు సంకేతంగా, మానవజీవితంలో వచ్చే అన్నిరకాల అనుభవాలకూ ప్రతీకగా ఉగాది ప్రసాదాన్ని భావిస్తారు. చేదు, తీపి, ఉప్పు, పులుపు, కారం, వగరు అనే ఆరు రుచులూ ఈ పచ్చడిలో ఉంటాయి. వేపపువ్వు, కొత్తబెల్లం, ఉప్పు, చింతపండు, మిరియాలు, లేతమామిడిముక్కలు కలిపి చేసిన ఈ ఉగాది ప్రసాదం ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలకు సంకేతమని చెబుతారు.
య ద్వర్షాదౌ నింబ సుమం
శర్క రామ్ల ఘృతైర్యుతంః
భక్షితం పూర్వయామే స్యాత్‌
త ద్వర్షం సౌఖ్యదాయకంః
అని శాస్త్ర వచనం. ఏడాదిపొడవునా శరీరదారుఢ్యం కలిగించే లక్షణం, సంపూర్ణ ఆరోగ్య రక్షణం ఈ ప్రసాదానికి ఉన్నాయని పెద్దలమాట.
యోగశాస్త్రపరంగా ప్రతి మనిషిలో ఆరు చక్రాలు ఉంటాయి. వీటినే షట్చక్రాలు అంటారు. అవి మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రాలు. ఈ షట్చక్రాల్లోనే ప్రాణవాయువు సంచారం చేస్తుంటుంది. ఈ ఆరు చక్రాలు మనం తీసుకునే ఉగాది పచ్చడిలోని ఆరు రుచులకు ప్రతీకలుగా నిలుస్తాయి. మనం వివిధ రకాలైన ఆహారపదార్థాలు తీసుకున్నప్పుడు ఆయా రుచులకు అనుగుణంగా ఆయా చక్రాలు చైతన్యవంతం అవుతాయి.ప్రాణవాయువు మనలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే అయిదు రకాలుగా ఉంటుంది. ఇవన్నీ వివిధ రుచులతో అనుసంధానమై ఉంటాయి. మనం తీసుకునే ఆహారంలో ఏ రుచి ఎక్కువగా ఉందో అందుకు అనుగుణంగా ఆ రకమైన ప్రాణవాయువు ఉత్తేజితమవుతుంది. షట్చక్రాలు, పంచప్రాణాలను యోగశాస్త్ర పద్ధతుల ప్రకారం అదుపులో ఉంచుకోవడానికి కఠినమైన ఆహార నియమాలు పాటించాలి. అన్ని రకాల రుచుల మేళవింపుగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇలా రుచులన్నీ సమపాళ్లలో అందినప్పుడే శరీరం మనిషి స్వాధీనంలో ఉంటుంది. ఉగాది పచ్చడిలో ఆరు రుచులను కలిపి మేళవించడంలో ఉన్న మరో అర్థం ఇదే. మొత్తంగా ఉగాది పచ్చడి మనిషి పరిపూర్ణుడుగా మారేందుకు ప్రేరేపిస్తుంది.
ప్రాణ – వగరు,
అపాన – తీపి,
వ్యాన – పులుపు,
ఉదాన – కారం,
సమాన – చేదు
మూలాధారం – తీపి,
స్వాధిష్ఠానం – వగరు,
మణిపూరకం – చేదు,
అనాహతం- పులుపు,
విశుద్ధ- కారం,
**ఆజ్ఞ – ఉప్పు
ఈ చక్రాలు రుచులకు ఆలంబనగా ఉంటూ, మనిషి జీవక్రియల నిర్వహణలో తోడ్పడుతుంటాయి.
###
నవ చైతన్యానికీ విశ్వ సౌందర్యానికీ ప్రతీక ఉగాది. నిరాశల ఎండుటాకులను నిర్మూలించి, కొత్త ఆశల చిగుళ్లను ఆవిష్కరించే వసంతం ఉగాది. తెలుగువారి తొలి పండుగ ఉగాది. ఉగాదిపండుగనాడు మనం ఆచరించవలసిన విధివిధానాలను పెద్దలు నిర్దేశించారు.
ఒళ్లంతా నువ్వులనూనె రాసుకుని, కుంకుడురసంతో అభ్యంగన స్నానం చేయాలి.
*ఎందుకు?
సంవత్సరారంభంలో చేసే ఈ మంగళ స్నానం శరీరాన్నీ మనస్సునూ చైతన్యవంతం చేస్తుంది.
*ప్రతి ఇంటిలో తమ ఇష్టదైవానికి ప్రతీకగా ఒక ధ్వజాన్ని పూజించి, ఇంటి ముంగిట ఎగరవేయాలి.
?.ఎందుకు?
శుభారంభానికి ఇది సంకేతం. విజయశిఖరాలను అధిరోహించవలసిన లక్ష్యాన్ని ఈ ధ్వజం స్ఫురింపచేస్తుంది.
*ఉగాదినాడు కాలస్వరూపుడైన పరమాత్మను తమ ఇష్టదైవం రూపంలో ఆరాధించటం ఒక సంప్రదాయం.
?ఎందుకు?
దైవారాధన ధర్మాచరణకు స్ఫూర్తిని కలిగించి, సంవత్సరం పొడవునా మనం ధార్మిక జీవనం సాగించటానికి దోహదం చేస్తుంది.
****వసంత నవరాత్రులు ఉగాదినాడే ప్రారంభమవుతాయి.ఈ ఉత్సవాలను నిర్వహించటం, కనీసం పాల్గొనటం ఓ ముఖ్యవిధి.
?.ఎందుకు?
ఈ ఉత్సవాలు మనలో ధార్మిక చింతనను, పదిమందితో కలసి పనిచేసే ఒక మంచి అలవాటును మనకు ప్రబోధిస్తాయి.
**ఆ రోజు చలివేంద్రాలను ప్రారంభించాలి. రాబోయే వేసవి తీవ్రతను తట్టుకోవడానికి అనువుగా పరిసరాల ప్రజలకు చేసే సేవాకేంద్రం చలివేంద్రం.
?.ఎందుకు?
బాటసారులకు దప్పిక తీర్చటానికి ఉద్దేశించిన ఈ చలివేంద్రాలు మనలోని మానవత్వానికి, సామాజిక బాధ్యతకూ ప్రతీకలు.
###
కాలం అనంతమైనది. అనంతుడైన కృష్ణ పరమాత్మ తానే కాలస్వరూపుణ్ణని భగవద్గీతలో చెప్పాడు. ఈ అనంతమైన కాలం లెక్కకు అందదు. అందుకే దాన్ని ‘యుగం’ అన్నారు. ‘యుగం’ అంటే రెండు అని అర్థం. గణనలో కాలాన్ని రాత్రి, పగలు అని రెండుగా విభజించారు. అలా ఒక రోజు ఏర్పడింది. ఈ కాలాన్ని సూర్య, చంద్ర, నక్షత్ర గమనాన్ని అనుసరించి రోజులను వారాలు, పక్షాలు, మాసాలు, ఋతువులు, ఆయనాలుగా పూర్వ ఋషులు విభజించారు. దీనికోసం ఒక సంవత్సర కాలాన్ని ప్రమాణంగా తీసుకున్నారు. భూ భ్రమణం, చంద్ర భ్రమణం ఆధారంగా సూర్యుడి చుట్టూ తిరిగే కాలాన్ని ‘ఒక సంవత్సరం’ అని నిర్ధరించారు. రాశులు, ఋతువులు, ఆయనాలు… ఇవన్నీ ఒక ఆవృతంలో వస్తాయి. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. సూర్య గమనాన్ని బట్టి సౌరమానం, చంద్ర గమనాన్ని బట్టి చాంద్రమానం ఏర్పడ్డాయి. వీటి ఆధారంగానే జ్యోతిష శాస్త్రం ఆవిష్కృతమయింది. తద్వారా పంచాంగాలు రూపొందాయి.తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరిస్తారు. ఉగాది (యుగాది)ని సృష్టి ఆరంభానికి ఎంచుకున్నాడని కమలాకరభట్టు తన ‘నిర్ణయ సింధు’ గ్రంథంలో స్పష్టం చేశాడు. సృష్టితో పాటే కాల విభజన కూడా బ్రహ్మ చేసినట్టు ఈ కింది శ్లోకం చెబుతోంది:చైత్రే మాసి జగద్బ్రహ్మా ససర్జ ప్రథమేహని శుక్ల పక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతి
**‘ఉగ’ ఉంటే నక్షత్ర గమనం. ‘ఉగస్య ఆదిః ఉగాది’ అని పెద్దల వాక్కు. ఆ నక్షత్ర గమనం ఎంతో ప్రత్యేకమైనది. సంవత్సరారంభంలో ప్రథమ ఆయనమైన ఉత్తరాయణంలో ఋతువులకు రారాజైన వసంత ఋతువులో, మాసాలలో మహత్తరమైన మధుమాసం (చైత్రం)లో, పక్షాలలో వెలుగు ఏరోజుకారోజు విస్తరించే శుక్లపక్షంలో, తొలి నక్షత్రం అశ్విని నాడు, తొలి తిథి పాడ్యమి రోజున ఉగాదిని జరుపుకోవడం అనూచానంగా వస్తోంది. ఉగాదికి ఇంతటి ప్రత్యేకత ఉంది. చాంద్రమానంలో అరవై సంవత్సరాలు ఉన్నాయి. ఇవే పునరావృతం అవుతూ ఉంటాయి. కొత్త సంవత్సరం ప్రారంభమైన రోజును ఉగాదిగా వ్యవహరిస్తారు. కాగా, శాలివాహన చక్రవర్తి (క్రీస్తు శకం డెబ్భై తొమ్మిది) ఉగాది నాడే పట్టాభిషిక్తుడు అయ్యాడనీ, శాలివాహన శకం ఆరంభ దినాన్నే ఉగాదిగా జరుపుకొంటున్నామనీ కొందరు చరిత్రకారులు పేర్కొంటున్నారు. మహోన్నతమైన మానవ జన్మను భగవంతుడికి కైంకర్యం చేయాలి. ఆయనను పొందడానికి మనసా వాచా కర్మణా విధిని నిర్వర్తించాలి.ప్రతియేటా దానికి సంకల్పం చేసుకోవడానికి సదవకాశంగా అందివచ్చిన రోజు… ఉగాది!
***గాది నాడు ఏం చేయాలి?
ఉగాదిని అనుష్ఠించ డానికి కావలసిన శాస్త్ర విధిని మన పూర్వ ఋషులు నిర్ణయించారు. ఆ విధి విధానాలను కూడా స్పష్టంగా తెలియజేశారు.
****విధిగా ఆచరించవలసినవి:
అభ్యంగన స్నానం, నూతన వస్త్ర ధారణ, ఇష్టదేవతా పూజ, షడ్రుచుల ఉగాది పచ్చడి నివేదన, ఇంటి పెద్దల ఆశీస్సులు పొందడం, నింబ కుసుమ (వేప పువ్వు) భక్షణం, పంచాంగ శ్రవణం. ఉగాదికి ముందురోజునే ఇల్లు, వాకిళ్ళు కడగాలి. గుమ్మాలకు పసుపు, కుంకుమలు పెట్టాలి. ద్వారాలకు మామిడి ఆకులు, వేప మండలు తోరణాలుగా కట్టాలి. పూజామందిరాన్ని ఉగాది పూజకు సిద్ధం చేసుకోవాలి. ఉగాది నాడు బ్రహ్మీ ముహూర్తాన నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకొని, అభ్యంగన స్నానం చేయాలి. ఇంటిలో పెద్దల ఆశీస్సులు తీసుకొని, తలపై నువ్వుల నూనె పెట్టించుకొని, స్నానం ఆచరించడం శుభప్రదం. అనంతరం నూతన వస్త్రాలు ధరించాలి. పూజామందిరంలో ఇష్టదైవాన్నీ, గణపతినీ అర్చించి, షోడశోపచారాలతో పూజించి, ధూప, దీప, నివేదనలూ, హారతి సమర్పించాలి.
****పంచాంగ శ్రవణం దేని కోసం?
ఉగాది విధి విధానాలలో పంచాంగ శ్రవణం అతి ముఖ్యమైనది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చదవడమో లేక ఆలయాల్లో పండితులు చదివేది శ్రద్ధగా వినడమో చేయాలి. ‘పంచాంగం’ అంటే తిథి, వార, నక్షత్ర, కరణ, యోగాలనే అయిదు అంగాలతో కూడుకొని ఉన్నది. ప్రతి వ్యక్తి మీదా ఆయా గ్రహాలూ, నక్షత్రాలూ కలిగించే ఫలితాలు దీని ద్వారా తెలుస్తాయి. ఇవన్నీ భగవంతుడి ఆధీనంలో ఉంటాయి. కనుక ఈశ్వరానుగ్రహం కోరుతూ పంచాంగ శ్రవణం చేసిన వారికి శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి. ఆరోగ్యం, సంపద, ఆయువు, విజయం, పాప విముక్తి లాంటి విషయాలు పంచాంగం ద్వారా తెలుస్తాయి. ఒకవేళ ఏవైనా దుష్పరిణామాలు పొంచి ఉన్నాయని తెలిస్తే, వాటి నుంచి రక్షణ పొందడానికి పరమ శక్తి సంపన్నుడయిన పరమేశ్వరుణ్ణి సభక్తికంగా ఆశ్రయించాలి. తద్వారా వాటిని తొలగించుకోవచ్చు.
****ఉగాది పచ్చడే ఎందుకు?
చైత్ర శుద్ధ పాడ్యమి రోజున అంటే, సంవత్సరం తొలి రోజున దైవానికి చేసే నివేదనలో విధిగా షడ్రుచుల ఉగాది పచ్చడిని ఉంచాలి. ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో పూర్వులే వివరించారు:‘కించ యద్వర్షాదౌ నింబ కుసుమం – శర్కరామ్ల ఘృతైర్యుతంభక్షతం పూర్వ యేమేస్యాత్‌ – తద్‌వర్షం సౌఖ్యదాయకం’ అని. కొత్త సంవత్సరం తొలి రోజున వేప పూవు, బెల్లం, కొత్త చింతపండు పులుసు, మామిడికాయ ముక్కలు, అవు నెయ్యి, మిరియాల పొడి, రుచికోసం లవణం కలిపి తయారు చేసిన షడ్రుచుల పచ్చడిని ప్రసాదంగా పరగడుపున భుజించాలి. ఈ పచ్చడి ఆయుర్వేద శాస్త్రరీత్యా ఎంతో విలువైనది. సంవత్సరం పాటు వాత, పిత్త, కఫ రోగాలను నివారించడమే కాకుండా శరీర ఆరోగ్యాన్ని కుదుటపరుస్తుందని పెద్దలు చెప్పారు.