Business

చమురు గిరాకీ భయంకరంగా పడిపోయింది

Oil Demand Drops To Less Than 30 Percent

దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న లాక్‌డౌన్‌తో వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. 130కోట్ల పైచిలుకు జనాభా ఉన్న దేశంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లన్నీ ఖాళీగా మారాయి. విమాన, రైల్వే, రోడ్డు రవాణా వ్యవస్థ మూగబోయింది. దీంతో భారీగా చమురు వినియోగించే దేశంలో ఒక్కసారిగా వీటి డిమాండ్‌ పతనమయ్యింది. దీంతో చమురుశుద్ధి సంస్థలతోపాటు ఉత్పత్తి సంస్థలపై కూడా దీని ప్రభావం భారీగా పడింది. లాక్‌డౌన్‌ కాలంలో దాదాపు 70శాతం డిమాండ్‌ కోల్పోయినట్లు చమురుసంస్థలు అంచనా వేస్తున్నాయి.

ముడిచమురు వినియోగంలో భారత్‌ ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉంది. చైనా, అమెరికా తరువాత అత్యధిక స్థాయిలో భారత్‌ చమురు వినియోగిస్తోంది. ప్రపంచంలోని మొత్తం చమురులో కేవలం ఈ మూడు దేశాల వినియోగమే దాదాపు 40శాతం ఉంటుంది. ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రభావంతో భారత్‌లో లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో చమురు సంస్థలు నేలచూపులు చూస్తున్నాయి. ఈ నెల మొత్తం వినియోగం గత సంవత్సరం ఇదే సమయంతో పోల్చితే దాదాపు 50శాతం కన్నా తక్కువకు పడిపోయినట్లు ఆయిల్‌ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఇలా దేశవ్యాప్తంగా ప్రజా రవాణా, వస్తుసేవలు నిలిచిపోవడంతో దాదాపు 60శాతం పెట్రోల్‌, నలభై శాతం డీజిల్‌కు డిమాండ్‌ తగ్గిపోయింది. కేవలం ఎల్‌పీజీ మాత్రమే డిమాండ్‌కు సరిపడా స్థాయిలో సరఫరా అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌ అంచనా ప్రకారం ఇలా ప్రతిరోజు దాదాపు కొన్నిలక్షల బ్యారెల్స్‌ ఆయిల్‌ డిమాండ్‌ను కోల్పోతున్నాయి. కాగా ఒక్క భారత్‌లోనే ముప్పై లక్షల బ్యారెళ్ల ఆయిల్‌ డిమాండ్‌ తగ్గిన్నట్లు అంచనా. 2019 లెక్కల ప్రకారం భారత్‌లో ప్రతిరోజు 44లక్షల బ్యారెళ్ల చమురును వినియోగిస్తోంది. దీనిలో దాదాపు 7లక్షల బ్యారెళ్ల పెట్రోల్‌, 18లక్షల బ్యారెళ్ల డీజిల్‌ను వినియోగిస్తుంది. దీంతో అంతర్జాతీయ చమురుఉత్పత్తి సంస్థలు, చమురుశుద్ధి సంస్థల మధ్య సందిగ్ధత ఏర్పడింది.

ఇలాంటి విపత్కర పరిస్థితి తన జీవితంలో చూడలేదని దేశంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి సంస్థల్లో ఒకటైన ఓఎన్‌జీసీ మాజీ చైర్మన్‌ ఆర్‌.ఎస్‌.శర్మ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రానున్న రోజుల్లో మరింత సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాధారణం కన్నా 30నుంచి 40శాతం మాత్రమే డిమాండ్‌ ఉందని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసే వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందన్నారు. అయితే ఇలా ఒక్కసారిగా డిమాండ్‌ తగ్గిపోవడంతో చమురు శుద్ధి సంస్థలు ఆయా ఉత్పత్తి సంస్థలతో దిగుమతుల ఒప్పందాలపై పున:సమీక్ష జరపాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆయా కంపెనీలు ఉత్పత్తి తగ్గించేందుకు అతిపెద్ద చమురు ఉత్పత్తి సంస్థలతో చర్చలు జరుపుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గతవారమే వెల్లడించారు. భారత్‌ తీసుకున్న 21 రోజుల లాక్‌డౌన్‌ నిర్ణయంతో చమురు సంస్థలు సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా చైనాలో కరోనా తీవ్రత తగ్గిన కారణంగా అక్కడి వినియోగం పెరుగుతుండడం కాస్త ఊరటనిచ్చే విషయం.