Sports

కరోనా..కపిల్…క్రికెట్…కోపం

Kapil Dev Fires On Corona Special Cricket Matches Suggestions

కరోనావైరస్‌పై పోరాటం చేసేందుకు కావాల్సిన నిధులకోసం భారత్‌ పాక్‌తో క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడాల్సిన గత్యంతరం పట్టలేదని కపిల్‌ ఘాటుగా స్పందించారు.దాయాదిదేశాల్లో కరోనాపై పోరాడేందుకు అవసరమైన నిధులకోసం ప్రేక్షకులు స్టేడియానికి రాకుండా భారత్‌-పాక్‌ మధ్య మూడువన్డేల ద్వైపాక్షికసిరీస్‌ను ఏర్పాటు చేయాలని షోయబ్‌అక్తర్‌ బుధవారం తన అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మాజీ లెజండరీక్రికెటర్‌ గురువారం స్పందిస్తూ..ఈ విపత్తును ఎదుర్కొనేందుకు భారత్‌ వద్ద పెద్దమొత్తంలో నిధులున్నాయిని, క్రికెట్‌మ్యాచ్‌లు అవసరం లేదని పాక్‌ మాజీ క్రికెటర్‌ అక్తర్‌కు చురకలంటించాడు. అక్తర్‌ తన స్వంత అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడని, కానీ ఇప్పటిపరిస్థితుల్లో ఇది ఏమాత్రం సమంజసం కాదని కపిల్‌ అన్నారు. ప్రస్తుతం ఈ మహమ్మారిని ఎదుర్కొవడమనేది రెండుదేశాల ప్రభుత్వాలు పరస్పరం ఎలా సహకరించుకుంటున్నాయి.. అన్నదానిపై ఆధారపడిఉంటుందన్నారు. కానీ కొంతమంది ఇప్పటికీ వార్తా ఛానెళ్లలో కూర్చుని ఒకరినొకరు విమర్శించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాపై పోరులో ప్రభుత్వానికి అండగా ఉండేందకు ఇప్పటికే బీసీసీఐ పెద్దమొత్తంగా రూ.51 కోట్లరూపాయలను విరాళంగా ఇచ్చిందన్నారు. ఇంకా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు.ఈ విపత్కర పరిస్థితుల్లో క్రికెట్‌ ఆడించి తమ క్రికెటర్లను ఇబ్బందుల్లో పడేసే ఉద్దేశం తమకు లేదన్నారు. వచ్చే ఆరునెలల వరకు క్రికెట్‌మ్యాచ్‌ల గురించి ఆలోచించకుండా ఉంటేనే మంచిదన్నారు. ప్రపంచం సంక్షోభంలో ఉన్నప్పుడు ఇతర దేశాలకు సాయం చేసేందుకు భారత్‌ ఎప్పుడూ ముందుంటుందన్నారు.