Agriculture

మా మొక్కజొన్నలు కొనండి

Corn Farmers Request Govt To Buy Their Crop

రైతులు పండించిన మొక్కజొన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కామేపల్లి జడ్పీటీసీ సభ్యుడు బానోత్‌ వెంకట ప్రవీణ్ ‌కుమార్‌నాయక్‌ డిమాండ్‌ చేశారు. పొన్నెకల్‌ గ్రామంలోని పంట చేలల్లో రైతులు కోసి నిల్వ చేసిన మొక్కజొన్న ధాన్యాన్ని శనివారం క్షేత్ర స్థాయిలో తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 20 రోజుల క్రితం మండలంలోని పలు గ్రామాల్లో పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని తెలిపారు. కానీ రైతులు ధాన్యాన్ని కేంద్రాల వద్దకు తీసుకువెళ్లేందుకు వ్యవసాయ, పీఏసీఎస్‌ అధికారులను సంప్రదించగా ఆన్‌లైన్‌లో రైతుల పేర్లు రావడంలేదని కొనుగోలు నిలిపివేశారని అన్నారు. దీంతో రైతులు పంటలను అమ్ముకోలేని దుస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులు పండించిన మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని, లేకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు నరసింహరెడ్డి, సర్పంచి కోటయ్య, ఎంపీటీసీ సభ్యుడు శంకర్‌నాయక్‌ పాల్గొన్నారు.