Editorials

కొత్త ఆవకాయ లేనిదే…ముద్ద దిగదాయే!

కొత్త ఆవకాయ లేనిదే...ముద్ద దిగదాయే!-Mango Aavakaya Pickle-History-Health-Recollection

శాఖాహార భోజనాల లో పప్పు, కూర, పులుసు …. ఎన్ని ఉన్నా పచ్చడి నాలిక్కి రాయనిదే జిహ్వ ఊరుకోదు…. వేసవి కాలం వేడికి ఆవకాయ ఘాటుకి అసలు ఎలా ముడిపెట్టారంటారు?.

పచ్చడి మెతుకులు తిని పెరిగాను అంటారు చాలా మంది .. కారం, ఉప్పు, పులుపు లేకుండా ఏ పచ్చడి తయారు అవుతుంది….?.

ఆవకాయ లాగానే వేసవి కాలాన్ని కూడా అమ్మా అబ్బా హుస్సు బుస్సూ అని చెమటలు కారుస్తూ తిట్టుకుంటూ గడిపేస్తాం. కానీ వేసవి లేకపోతే మామిడికాయలు వస్తాయా?. మామిడికాయలు లేకపోతే ఊరగాయ వస్తుందా..?.

మా నాన్నగారు, అమ్మ వేడి వేడి తెల్లని అన్నంలో ఎర్రని ఆవకాయ కలిపి దాన్ని వెన్నముద్ద తో కలిపి ఆ దక్ష యజ్ఞానికి తోడు మధ్య మధ్య చక్కని చిక్కని మీగడ నోటికి రాస్తూ ఉంటే ఆ రుచి దేనికి ఉంటుంది చెప్పండి?. అమెరికా వెళ్ళినా ఆవకాయ కోసం తహతహలాడాల్సిందే..

అసలు ఆవకాయ కి ఉన్నన్ని కాంబినేషన్లు దేనికి ఉన్నాయి…?. ముద్దపప్పు ఆవకాయ… ఆవకాయ మీగడ….. ఘాటయిన ఆవకాయ… ఆవకాయ పెరుగు పచ్చడి… ఆవకాయ మజ్జిగ పులుసు… పాపం దేనితో నంచినా .. ముంచినా తనదైన ప్రత్యేకతను పోగొట్టుకోకుండా ఆవకాయ ఎంత సహకరిస్తుంది చెప్పండి !!.

అలాగే ఎన్ని రకాల ఆవకాయలు… ఆవకాయ.. వెల్లుల్లి ఆవకాయ… పచ్చావకాయ…మెంతికాయ… బెల్లం ఆవకాయ… పెసర పిండి ఆవకాయ… పులిహార ఆవకాయ… నువ్వు పిండి ఆవకాయ… కాయావకాయ… కాదేది ఆవకాయ అనర్హం అన్నట్టుగా ఎన్నో తయారు చేస్తాం..!!.

బ్రెడ్డు జాము అమెరికన్ కాంబినేషన్ అయితే చద్దన్నం ఆవకాయ ఇండియన్ కాంబినేషన్. నాకు తెలిసి నా తరంలో చాలామంది చద్దన్నం ఆవకాయ తిని బడికి వెళ్ళిన వాళ్ళే….. లేదా పెరుగు అన్నంలో ఆవకాయ నాలికకి రాసినవాళ్ళే…. కదండీ !!.

ఇప్పుడంటే ఇలా వెళ్లి అలా మామిడికాయలు , అలా వెళ్లి మూడు మామిళ్ల కారం, ఇదయం నువ్వుల నూనె ప్యాకెట్లతో.. టాటా వారి ఉప్పుతో 10….20 మామిడి కాయలతో ఆవకాయలు కానిచ్చేస్తున్నాం…!!.

మా చిన్నతనంలో ఈ తూతూమంత్రం ఆవకాయ లా….?. అబ్బే….నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్క చెల్లెళ్ళ కుటుంబాలకి సరిపడా ఆవకాయ తయారీ అంటే మాటలా… పెళ్లి సందడి కన్నా ఎక్కువగా ఉండేది… రెండు వేళ్ళ వెడల్పు ఉన్న దేశవాళీ మిరపకాయలు , మంచి ఆవాలు , మెంతులు తెప్పించి బాగు చేయించి ఎండబెట్టడం తో ఆవకాయ పని మొదలయ్యేది.

మా అమ్మ గారు ఆవకాయ కారాలు దంపే మనుషుల్ని పిలిపించి వాళ్లతో ఆ దేశవాళీ మిరపకాయల ముచికలు తీయించి దంపుళ్ళ సావిడి లో దంపిస్తూ మధ్యమధ్యలో వాళ్లకి కారం ఘాటు తగలకుండా నిమ్మకాయ దబ్బాకులు కలిపిన మజ్జిగ లు ఇస్తూ వాళ్ళ కష్టసుఖాల గురించి మాట్లాడుతూ ఆవ కూడా దంపించి , జల్లించి జాడీలోకి ఎక్కించేవారు… మంచి నువ్వుల నూనె సువాసన ఉందో లేదో చూసి ఫ్రెష్ గా తెప్పించేవారు…

. హాల్లో 100…. 200 మామిడికాయ ముక్కలు … కొత్తపల్లి కొబ్బరి లేదా పెద్ద రసాలు. అవి కూడా లేకపోతే సువర్ణ రేఖ ఇవి మాత్రమే ఆవకాయకి వాడే వారు. వీటి కోసం కూడా బాగా తెలుసున్న నాన్నగారు , ఆయనతో పాటు బాబాయో లేక అన్నయ్యలో ఒక్కోసారి తోటల నుంచి తెచ్చేవారు.

మామిడికాయ పెద్దవాళ్ళు ముక్క కొడితే పిల్లలు జీడీ పొర తీసి…. నలిగిపోయిన ముక్కల్ని వేరే దాచుకుని.. మధ్య మధ్యలో నోట్లో వేసుకుంటే… ఆ మజాయే వేరు. కానీ ఏ అమ్మ గారి కంట్లో పడినప్పుడు
ఎంగిలి మంగలం వె…..వా.. ఫో అవతలకి అని బయటకి గెంటేవారు…

ఆ తర్వాత ఆ ముక్కలు తుడిచి అమ్మ , పిన్ని అందరూ వాటిని నూనెలో ముంచి ఆవ ఉప్పు కలిపిన మరో పెద్ద పళ్ళెంలో దొర్లించేవాళ్ళు. కానీ పాపం.. ఆ రోజంతా కూడా చేతులు ఊదుకుంటూనే ఉండేవారు….

ఆవకాయ కలిపిన బేసిన్లలో అలాగే ఉంచి అన్నం కలిపి అందరికీ తలా ఓ ముద్ద పెట్టి ఉప్పు , కారాలు సరిపోతాయో లేదో చూడ్డం వాళ్ళకో ఒక పెద్ద పని….
వాళ్ళు ఎప్పుడు పెడతారా అని చూడ్డం మా పని….

మళ్లీ మూడు రోజులకి ఆవకాయ తిరగ కలిపినప్పుడు… కలిపి కొంత.. కలపకుండా కొంత… ఒక ఐదేళ్ల పిళ్లాడు ఈజీగా కూర్చోగలిగేంత పెద్ద పెద్ద జాడీలలో నూనె సరిపోయిందో లేదో చూసి మళ్ళీ కలిపి కొంత తినడానికి తీసి దానికి మర మూత బిగించి పైన గుడ్డ కట్టేవారు…

అన్నం దగ్గర కూర్చోగానే ఆధరవులు ఎన్ని ఉన్నా అందరికీ ఆవకాయ కావాలి …కొందరికి ఊట కావాలి. కొందరికి పిండి కావాలి.. కొందరికి ముక్క కావాలి. ఎవరి రుచి వారిది… అలాగే ఆవకాయలో నూనె కలుపుకుంటారో… నెయ్యి వేసి కలుపుకుంటారో.. మీగడతో తింటారో…వెన్నముద్ద కలుపుకుంటారో…ఎవరి ఇష్టం వారిది…

ఏడాది అంతా హాయిగా తినే ఆవకాయ గురించి ఒక్క పోస్టులో ఒక్క రోజులో నేను ఎంత చెబితే సరిపోతుంది చెప్పండి. తెల్లటి ధవళ కాంతితో మెరిసే అన్నం మీద పొద్దు పొడిచే సూర్యుడు లాగా ఆవకాయ అందం చందం ఎంత చెప్పినా తక్కువే…

అందుకనే అన్నారు. ఊరీ ఊరని ఊరగాయ… వచ్చీ రాని మాటలు ముద్దు తరగనివని..
బడికి వెళ్ళే హడావిడిలో నాన్నగారు , అమ్మ వేడి వేడి అన్నంలో ఆవకాయని రకరకాల కాంబినేషన్లలో తినడం నేర్పడం మరిచిపోలేని అనుభూతి..

పుట్టింటి నుంచి ఆవకాయ సీసాలు తెచ్చుకుని మగని విస్తరిలో ముద్దుగా వడ్డిస్తూ మా అమ్మ మీ కోసం ప్రత్యేకంగా పంపిందండీ అంటే మురిసి పోని అల్లుళ్లు ఉంటారా…..?. పిల్లావకాయలు… పింది ఆవకాయలు ఎన్ని పెట్టినా సంవత్సరానికి పెట్టే ఆవకాయ రుచే వేరు..

బీపీలు వచ్చి కారాలు తగ్గించాలి , ఉప్పు తగ్గించాలి… అని డాక్టర్ చెప్పగానే ఆవకాయ ని తలుచుకుని పై ప్రాణం పైనే పోతుంది . డాక్టర్ గారు… అప్పుడప్పుడు ఒక్క ఆవకాయ ముక్క వేసుకోవచ్చా !!?. అని ఎలాగో అలా సిగ్గు విడిచి అడిగేస్తాం… అది ఆవకాయ కు ఉన్న పవర్ .

అన్నట్లు చెప్పడం మరిచిపోయాను . ఈ మధ్య పెళ్లిళ్లలో ఆవకాయ అన్నం కూడా ఒక గొప్ప ఐటం లాగా చేరుస్తున్నారు… ఇందులోనూ ఒక మంచి ఉంది . ఇంకా ఆవకాయ అంటే తెలియని మొహాలు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఆంధ్ర ఆవకాయ పవర్..

మీతో ఆవకాయ గురించి ముచ్చటిస్తున్నా అనే మాటే గానీ కొత్తావకాయ ఊరిస్తూ కవ్విస్తోంది.. ఉంటానండి మరి !!.