Health

50వేలకు 600తక్కువ-TNI కరోనా బులెటిన్

TNILIVE Corona Bulletin - India Close To Hit 50000 Corona Cases

* దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 2,958 కరోనా కేసులు నమోదు కాగా, 126 మంది మృతిచెందారు. దీంతో భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 49,391కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు 14,182 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 1,694 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 33,514 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 15,525 కరోనా కేసులు నమోదు కాగా, 617 మంది మృతిచెందారు. గుజరాత్‌లో 6,245, ఢిల్లీలో 5,104, తమిళనాడులో 4,058, రాజస్తాన్‌లో 3,158, మధ్యప్రదేశ్‌లో 3,049, ఉత్తరప్రదేశ్‌లో 2,880 కరోనా కేసులు నమోదయ్యాయి.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన కొవిడ్‌ పరీక్షల్లో కొత్తగా 60 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1777కు చేరింది. ఇప్పటి వరకు కరోనాతో రాష్ట్ర వ్యాప్తంగా 36 మంది మృత్యువాత పడ్డారు. వివిధ ఆసుపత్రుల్లోచికిత్స పొంది 729 మంది కోలుకున్నారు.

* కరోనా వైరస్ రోజు రోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో కరోనా బారి నుంచి బయటపడేందుకు అన్ని ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. సామజిక దూరం పాటించడం, ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండటం వంటివి చేయాలని ప్రభుత్వాలు చెప్తున్నాయి. అయితే, ఇంట్లో ఉన్న వ్యక్తులకు ఏమి తోచక ఇండోర్ గేమ్స్ ఆడుతున్నారు. ఇందులో హౌసీ కూడా ఒకటి. గత మూడు నాలుగు రోజులుగా విశాఖపట్నంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. వారం క్రితం వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు, సడెన్ గా పెరిగిపోతుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. విశాఖలోని చందక వీధి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు ఇన్ని కేసులు ఎలా వస్తున్నాయి అదే దిశగా ఆరా తీస్తున్నారు. హౌసీ గేమ్ వంటివి ఒకేచోట కూర్చొని ఆడటం వలన వైరస్ వ్యాపిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలో మరింత మందికి కరోనా సోకి ఉండొచ్చనే అనుమానాలు ఎక్కువయ్యాయి. ఈ దిశగానే అధికారులు టెస్టులు నిర్వహిస్తున్నారు.

* దాదాపు 45 రోజుల తర్వాత రాష్ట్రంలో మద్యం షాపులు తెరుచుకోవడంతో.. మందుబాబుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. మద్యం కోసం చాలా మంది ఉదయం నుంచే వైన్స్‌ ముందు క్యూ కట్టారు. పలు చోట్ల మహిళలు కూడా మద్యం కోసం లైన్లలో వేచి ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలోని కొండాపూర్‌, పంజాగుట్ట, మాదాపూర్‌ లలో వైన్‌ షాపుల ముందు మహిళలు క్యూ నిల్చున్న దృశ్యాలు కనిపించారు. మరి కొన్ని చోట్ల వృద్ధ మహిళలు మద్యం కోసం వైన్‌ షాపుల వద్దకు వచ్చారు.

* కరోనా మహమ్మారి నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను మన దేశానికి చేర్చేందుకు భారత ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద తరలింపు కార్యక్రమాన్ని చేపట్టనుంది. మొదటి గల్ఫ్ యుద్ధం తరువాత మళ్ళీ ఇదే అతిపెద్ద తరలింపు కార్యక్రమం. ఇందు కోసం మే 7 వ తేదీ నుండి నుండి విమానాలు, నౌకల ద్వారా విదేశాల నుండి భారతీయులను తరలించే కార్యక్రమం మొదలవుతుంది. ఇప్పటికే మొత్తం 1,90,000 మంది భారతీయులు ఆయా దేశాల్లో ఉన్న రాయబార కార్యాలయాల్లో, హైకమీషన్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు.

* ఇంకెంతకాలం లాక్‌డౌన్‌ను కొనసాగిస్తారో చెప్పాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. బుధవారం ఆమె కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమై కరోనా వైరస్‌ సంక్షోభంపై చర్చించారు. ‘మే 17 తరవాత ఏంటి? మే 17 తర్వాత ఎలా? ఏ ప్రమాణాల ఆధారంగా కేంద్రం ఇంకెంత కాలం లాక్‌డౌన్‌ను పొడిగిస్తుంది’ అని సోనియా గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇదే సమావేశంలో పాల్గొన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్..‘లాక్‌డౌన్‌ 3.0 తరవాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాం’ అని అన్నారు. కరోనా వైరస్‌ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, వలస కూలీల సమస్యలు, వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని వెనక్కి తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆమె పార్టీ నేతలతో చర్చించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. వలస కార్మికుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సోనియా, రాహుల్ కొద్ది రోజులుగా విమర్శలు చేస్తూనే ఉన్నారు.

* మూడు రోజుల క్రితం కశ్మీర్‌లోని హంద్వారాలో ముష్కరుల కాల్పుల్లో అమరులైన మన వీరజనాన్ల ప్రాణత్యాగానికి సైన్యం ఘనమైన నివాళి అర్పించే దిశగా సాగుతోంది. కశ్మీర్‌లో నక్కిన ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఉగ్రవాదుల కదలికలపై పక్కా సమాచారం సేకరించిన సేనలు మంగళవారం రాత్రి వారి జాడను కనిపెట్టాయి. ఇప్పటికే పుల్వామా జిల్లా షార్షలీలో ఇద్దరు ముష్కరుల్ని బలగాలు మట్టుబెట్టాయి.

* కరోనా వైరస్‌ సంక్షోభం వల్ల ఏర్పడిన లోటును పూడ్చుకోడానికి అప్పులు తెచ్చుకోవాలని, పన్నులు పెంచి ప్రజల మీద భారం వేయొద్దని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం కేంద్రానికి సూచించారు. ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయిన తరుణంలో కొత్త పన్నులు విధించడం తగదన్నారు.

* కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంచడంపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కష్టాల వేళ పెట్రో ధరలు పెంచడం ఏంటంటూ ఆయన ట్వీట్ చేశారు. లాక్‌డౌన్‌తో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ధరలు తగ్గించేది పోయి పెంచుతారా అని ప్రశ్నించారు. కేంద్ర నిర్ణయం సరికాదని, వెంటనే వెనక్కు తీసుకోవాలని రాహుల్ కోరారు.