Food

రక్త విరేచనాలకు విరుగుడు…కదళీఫలం

kadalee Falam Helps Fight Bloody DIarrhea

కాస్త అలసటగా అనిపించినా… ఒత్తిడికి గురైనా… వ్యాయామం చేసిన తర్వాత వెంటనే దీన్ని తీసుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరైనా తినొచ్చు.. ఏంటది? అని ఆలోచిస్తున్నారా? ఇంతబాగా అరటిపండు వలిచి చేతిలో పెట్టిన తర్వాత కూడా అర్థంకాలేదా? అదేనండీ అరటిపండు…
**రుచితోపాటు తక్షణ శక్తినీ అందించే అరటిపండును ‘కదళీఫలం’ అంటారు. ఉపవాస సమయంలో చాలామంది దీన్నే ఆహారంగా తీసుకుంటారు. ఒకరకంగా దీన్ని ‘సంపూర్ణాహారం’ అనొచ్చు. ఇది తేమను అధికంగా కలిగి ఉంటుంది. కొవ్వులు, పిండిపదార్థాలు, పీచు, పొటాషియం, ఫాస్ఫరస్‌, పెప్టిన్‌, సుక్రోజ్‌, ఫ్రక్టోజ్‌, గ్లూకోజ్‌, విటమిన్‌-సి, విటమిన్‌-బి6 ఉంటాయి.
*ఎవరు తినకూడదు:
తీవ్రమైన మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వాళ్లు తినకూడదు. అలాగే మధుమేహం, ఆస్తమా, అధిక బరువుతో ఇబ్బందిపడుతున్నవాళ్లు తక్కువగా తీసుకోవాలి.
*విరుగుడు:
బాగా దాహం వేసినప్పుడు, నూనె పదార్థాలను ఎక్కువగా తిని వికారంగా అనిపించినప్పుడు.. అరటిపండును తీసుకోవచ్చు. కొన్ని రకాలైన కలుషిత పదార్థాలు, విషపదార్థాలు తీసుకున్నప్పుడు విరుగుడుగా దీన్ని తినిపిస్తే ఫలితం ఉంటుంది.
***ప్రయోజనాలెన్నో…
*ఒత్తిడి మాయం:
మనసంతా చిరాగ్గా, గందరగోళంగా ఉన్నప్పుడు అరటిపండును తింటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
*కఫం తగ్గుతుంది:
దీంట్లో రెండు మూడు మిరియాలు వేసుకుని తింటే కఫం, దగ్గు తగ్గుతాయి.
*గర్భిణులకు:
పాలల్లో అరటిపండు ముక్కలు, కుంకుమపువ్వు వేసుకుని తీసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా పుడతారు.
*మలబద్ధకం మాయం:
బాగా పండిన అరటిపండు తింటే మలబద్ధకం ఉండదు. పచ్చి అరటిపండు తింటే విరేచనాలు తగ్గుతాయి.
*స్మూథీ:
పాలు, అరటిపండు ముక్కలు, కొద్దిగా తేనె, పంచదార వేసి స్మూథీలా తయారుచేసి బలహీనంగా ఉండే పిల్లలకు ఇస్తే బరువు పెరుగుతారు.
*తలనొప్పికి:
పెరుగన్నంలో అరటిపండు కలిపి తింటే తలనొప్పి తగ్గుతుంది.
*పేగులకు మేలు:
దీంట్లో ఉండే పెప్టిన్‌ పేగులకు మేలు చేస్తుంది. విరేచనం సాఫీగా జరిగేలా చూస్తుంది.
*రక్త విరేచనాలు:
ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు అరటిపండు గుజ్జులో పాతబెల్లం పాకం కలిపి ఇస్తే ఫలితం ఉంటుంది.
*ఆహారానికి బదులు:
ఊబకాయులు ఆహారానికి బదులుగా అరటిపండు తీసుకోవాలి. అలాగే ఆహారం తిన్న వెంటనే పండు తీసుకోవద్దు.
*సుఖనిద్ర:
దీంట్లో ఉండే విటమిన్‌-బి6 హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది. కంటికి కూడా మంచిది.అంతేకాదు మెదడుకు చురుకుదనాన్ని అందిస్తుంది.
*తొక్కలోనూ:
అరటిపండు తొక్కలో ఉండే తెల్లటి పొరలో కూడా ఔషధ గుణాలుంటాయి.
*ఎముకలకు:
దీంట్లో ఉండే ఫాస్ఫరస్‌ ఎముకలకు ఎంతో మేలు చేస్తుంది.
మధుమేహ రోగులు: టైప్‌ 2 మధుమేహం ఉన్నవారు తినొచ్చు. అయితే భోజనంలో కాకుండా విడిగా తీసుకోవాలి. ఈ పండులో ఫ్రక్టోజ్‌ షుగర్‌ ఉంటుంది కాబట్టి మితంగా తీసుకోవాలి.
*నొప్పులు:
ఒళ్లునొప్పులు, వాపులు ఉన్నవాళ్లు తింటే అవి తగ్గుతాయి. పెద్దపేగు పుండుతో బాధపడేవాళ్లు కూడా అరటిపండును తీసుకోవచ్చు.
*ఉపశమనం:
నెలసరికి ముందు ఆందోళన, ఒత్తిడి, అలసటతో బాధపడేవాళ్లు దీన్ని తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
*పుల్లటి తేన్పులు:
ఈ సమస్యతో బాధపడేవాళ్లు దోరగా పండిన అరటిపండును తింటే సమస్య తగ్గుతుంది.
*వ్యాయామం తర్వాత:
అధికంగా వ్యాయామం చేసేవాళ్లు కండరాలు కృశించిపోకుండా ఉండటానికి దీన్ని తీసుకుంటారు. దీనిలో ఉండే పొటాషియం వెంటనే శక్తిని పుంజుకునేలా చేస్తుంది. ఒకరకంగాదీన్ని సూపర్‌ఫుడ్‌ అనొచ్చు.