Health

సాంబ్రాణి చాలా ఆరోగ్యకరం

Sambrani Smoke Is Good For Your Health

తెల్లవారు జామున గుళ్లోకి వెళ్లగానే గుప్పున ముక్కుపుటాలను తాకే సుగంధ పరిమళం, స్నానం చేయించిన పసిబిడ్డను ఎత్తుకోగానే హాయిగొలిపేలా వచ్చే కమ్మటి సువాసన, పండగలప్పుడు ఇంటిని చుట్టేసే అత్తరు గుబాళింపుల ధూపం… సాంబ్రాణి. విరిగిపోయిన గాజు ముక్కల్లా కనిపించే ఆ పరిమళ ద్రవ్యం ఓ చెట్టు జిగురని మీకు తెలుసా… దానిలో ఆరోగ్యానికి మేలు చేసే సుగుణాలూ ఉన్నాయని విన్నారా… ఇవిగోండి ఆ విశేషాలు!
**ప్రకృతి మనకు చాలానే ఇచ్చింది. దాన్నుంచే మనం మన ఆహారాన్నీ ఆనందాన్నీ వెతుక్కుంటాం. మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే సాంబ్రాణి ధూపమూ అలా అడవితల్లి ఒడిలో పుట్టిందే. తుమ్మ చెట్టు కాండానికి గాటు పెడితే జిగురు రావడం మనకు తెలిసిందే. అచ్చం అలాగే, చెట్టుకు గాట్లు పెట్టడం వల్ల సాంబ్రాణి కూడా తయారవుతుంది. ఆ వృక్ష జాతులే బోస్వెల్లియా శాక్రా (ఫ్రాంకిన్సెస్‌), కొమ్మి ఫొరా మిరా (మిర్‌).
**ఎక్కడ పెరుగుతుందంటే…
సాంబ్రాణిని ఉత్పత్తి చేసే ఈ చెట్లు ఎక్కువగా సోమాలియా, అరేబియా, ఒమన్‌ దేశాలతో పాటు భారత్‌, ఇథియోపియా, జోర్డాన్‌, ఆఫ్రికా తదితర దేశాల్లోనూ పెరుగుతాయి. ఇవి ఎక్కువగా పొడి వాతావరణం, ఎండా ఉండే ఉష్ణమండల ప్రాంత నేలల్లో పెరుగుతాయి. ఈ చెట్లలో ఫ్రాంకిన్సెస్‌ జిగురు గట్టిగా ఉంటే, మిర్‌ రకం బంక గాఢమైన వాసన కలిగి ఉంటుంది. చెట్టు పెరిగే వాతా వరణం, నేల, చెట్టు వయసు తదితరాలను బట్టి దాని నుంచి వచ్చే జిగురు నాణ్యత ఆధార పడుతుంది. అయితే, ఒమన్‌లో దొరికే ఫ్రాంకిన్సెస్‌ రకం జిగురునూ సోమాలియాలో దొరికే మిర్‌ రకం జిగురునూ నాణ్య మైనవిగానూ ఖరీదైనవిగానూ చెబుతారు. సోమాలియాలో పెరిగే ‘కింగ్‌ ఆఫ్‌ ఫ్రాంకిన్సెస్‌’ను సాంబ్రాణుల్లో అత్యంత ఖరీదైనదిగా చెబుతారు. దీని ధర కిలో రూ.30వేల పైగా పలుకుతుంది.
***వేల ఏళ్ల నుంచీ…
క్రీస్తు పుట్టినప్పుడు ఆయన కోసం వచ్చిన ముగ్గురు మేధావుల్లో ఒకరు బంగారం తీసుకురాగా ఒకరు ఫ్రాంకిన్సెస్‌ సాంబ్రాణినీ, మరొకరు మిర్‌ సాంబ్రాణినీ తీసుకువచ్చారని బైబిల్‌ చెబుతుంది. మధ్య ప్రాచ్యదేశాల్లోనూ, ఉత్తర ఆఫ్రికాలోనూ దాదాపు అయిదు వేల సంవత్సరాలకు పూర్వం నుంచే సాంబ్రాణి వ్యాపారం నడిచేదట. బాబిలోనియాలో అంత్యక్రియల్లోనూ, ఈజిప్టులో మమ్మీలను భద్రపరిచేందుకూ ఈ సాంబ్రాణిని వాడేవారట. సాంబ్రాణి పొగ ఉండే చోట సూక్ష్మక్రిములూ, కీటకాలూ ఉండవు. అందుకే ఇప్పటికీ పసిపిల్లలకు స్నానం చేయించగానే సాంబ్రాణి పొగ వేస్తారు. దీని నుంచి తీసే నూనెను సబ్బులూ, పర్‌ఫ్యూమ్‌లూ, బాడీ లోషన్లూ తది తరాల్లో వాడతారు. ఈ నూనె చర్మాన్ని యవ్వనంగా ఉంచుతూ, జుట్టుకి బలాన్నిస్తుంది.
**ఆరోగ్యానికీ ఎంతో మేలు!
సాంబ్రాణిని ఆయుర్వేదంలో కీళ్లనొప్పుల నివారణకూ, జీర్ణక్రియ, చర్మ రోగాలను తగ్గించేందుకూ తయారు చేసే లేహ్యాలూ, ఇతర మందుల్లో వాడతారు. అలాగే, యాంక్జైటీ, ఆస్తమా, అల్సర్లూ, క్యాన్సర్ల చికిత్సల కోసం వినియోగించే మందుల తయారీలోనూ సాంబ్రాణిని ఉపయోగిస్తున్నారు. దీనిలో యాంటీ సెప్టిక్‌ గుణాలూ ఉన్నాయి గనుక, దీన్నుంచి తీసిన నూనెను టూత్‌పేస్టులూ, ఆయింట్‌మెంట్లూ, మందుల తయారీలోనూ వాడతారు. సాంబ్రాణి ధూపం వేసినప్పుడు వచ్చే వాసన నాడుల్ని ప్రేరేపించి రక్త ప్రసరణను మెరుగు పరుస్తుందట. అందుకే మానసిక రుగ్మతల్ని దూరం చేసే అరోమా థెరపీలోనూ దీన్ని వాడతారు. ఈ సువాసన మనసును ఉత్సాహంగా ఉంచుతూ డిప్రెషన్‌ను దరిచేరనీయదట. ఇన్ని ఉపయోగాలున్నాయి కాబట్టే, ఈనాటికీ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల టన్నుల సాంబ్రాణి వ్యాపారం జరుగుతోంది మరి!