Movies

రావి కొండలరావు మృతి

ప్రముఖ నటుడు, రచయిత రావి కొండలరావు కన్నుమూశారు. 600కుపైగా చిత్రాల్లో నటించి, అనేక చిత్రాలకు దర్శక నిర్మాతగా, రచయితగా పని చేసిన ఆయన బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిచారు. ఆయన కెరీర్‌లో ‘తేనె మనసులు’, ‘దసరా బుల్లోడు’, ‘రంగూన్ ‌రౌడీ’, ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’, ‘వరకట్నం’, ‘అందాల రాముడు’, ‘రాధా కళ్యాణం’, ‘చంటబ్బాయి’, ‘పెళ్ళి పుస్తకం’, ‘బృందావనం’ ‘భైరవ ద్వీపం’ ‘రాధాగోపాలం’, ‘మీ శ్రేయోభిలాషి’, ‘కింగ్’‌, ‘ఓయ్’‌, లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆయన భార్య రాధాకుమారి కూడా సినిమా నటే. ఇద్దరూ కలిసి అనేక చిత్రాల్లో భార్యాభర్తలుగా నటించారు. రావి కొండలరావు ఫిబ్రవరి 11, 1932లో జన్మించారు. ‘శోభ’ (1958)తో ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. తొలినాళ్లలో మద్రాసులో ఆనందవాణి అనే పత్రికలో ఉపసంపాదకుడిగా పనిచేస్తూ సినిమాల్లో నటించేవారు. బాపు-రమణకు రావి కొండలరావు ఆప్తులు. సినీ జీవితం తొలినాళ్లలో రావి కొండలరావు ముళ్లపూడి రమణ ఇంట్లోనే ఉండేవారు. ‘భైరవద్వీపం’, ‘బృందావనం’, ‘పెళ్ళిపుస్తకం’ తదితర చిత్రాలకు మాటలు అందించారు. పరిశ్రమకు వచ్చిన తొలి రోజుల్లో మలయాళ, తమిళ సినిమాలకు డబ్బింగ్‌ కూడా చెప్పేవారు. అక్కడే డబ్బింగ్‌ చెబుతున్న రాధాకుమారిని తర్వాత రావి కొండలరావు వివాహం చేసుకున్నారు. రావి కొండలరావు సినిమాలు మాత్రమే కాకుండా… కథలు, నాటికలు కూడా రాసేవారు.‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’ పేరుతో సినీ సంకలనం రాశారు. అలనాటి సినిమా విశేషాలను ఆ సంకలనంలో అందించేవారు. 2004లో ఆయన రచించిన బ్లాక్ అండ్ వైట్ అనే పుస్తకం తెలుగు సినిమాకు చెందిన ఉత్తమ పుస్తకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది పురస్కారానికి ఎంపికైంది. అలాగే కళలకు ఆయన చేసిన సేవకు గాను ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో గౌరవించింది. సినిమాల్లోకి వచ్చే ముందు రావి కొండలరావు ఆర్‌ఎస్‌ఎస్‌లో క్రియాశీల సభ్యుడిగా పని చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ విజయా సంస్థకు రావి కొండలరావు అత్యంత ఆప్తుడు, నమ్మకస్తుడు కూడా. అందుకే నాగిరెడ్డి సలహా మేరకు చందమామ-విజయా కంబైన్స్‌ నిర్మించిన ‘బృందావనం’, ‘భైరవద్వీపం’, ‘శ్రీకృష్ణార్జున విజయం’ సినిమాలు కొండలరావు నిర్మాణ నిర్వహణలోనే పూర్తిచేశారు.