Politics

వరంగల్ ప్రజలకు కేటీఆర్ భరోసా

వరంగల్ ప్రజలకు కేటీఆర్ భరోసా

భారీ వర్షాలకు అతలాకుతలమైన వరంగల్‌ నగరంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో మంత్రులు పర్యటించారు. కేటీఆర్‌తో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్లో వరంగల్‌కు చేరుకున్నారు. జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో బస్సులో పర్యటించారు. తొలుత నయీంనగర్‌ నాలాను మంత్రులు సందర్శించారు. స్థానికులను మంత్రి కేటీఆర్‌ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరద వల్ల తీవ్రంగా నష్టపోయామని ఈ సందర్భంగా బాధితులు వాపోయారు. ఇళ్లల్లో బియ్యం, నిత్యవసర వస్తువులు, దుస్తులు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. భవిష్యత్తులో వరద ముప్పు లేకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని, డ్రైనేజీ నిర్మాణానికి రూ.10కోట్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. వరంగల్‌ నగరంలో ఆక్రమణలు తొలగిస్తామని.. స్థానికులు సహకరించాలని కోరారు. భోజన విరామం తర్వాత నిట్‌ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్‌, అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. అంతకు ముందు విహంగ వీక్షణం ద్వారా ఓరుగల్లు నగరాన్ని కేటీఆర్‌ పరిశీలించారు.