DailyDose

బాబు డైరక్షన్…రాజు యాక్షన్-తాజావార్తలు

బాబు డైరక్షన్…రాజు యాక్షన్-తాజావార్తలు

* వినాయక చవితి పండగపై ప్రతిపక్షాలు, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చేస్తున్న ఆరోపణలను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఖండించారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల శ్రేయస్సు కోసమే వినాయ చవితి ఉత్సవాలను ఇంట్లోనే జరుపుకోవాలని ప్రభుత్వం సూచించిందన్నారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని మంత్రి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ…..వినాయక చవితి ఉత్సవాలపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పండితులు, మత పెద్దలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటి వరకు అన్ని పండగలను ఇళ్లలోనే చేసుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. ఈ విషయంపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేయెద్దని సూచించారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గత ఐదు నెలలుగా తన సొంత నియోజకవర్గానికి కూడా రాలేదని విమర్శించారు. దిల్లీలో కూర్చుని మాట్లాడటం కాదు.. అంత ప్రేమ ఉంటే సొంత నియోజకవర్గానికి వచ్చి వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొనాలంటూ మండిపడ్డారు. రఘురామ కృష్ణరాజు.. చంద్రబాబు డైరెక్షన్‌లో మాట్లాడుతున్నారని ఆరోపించారు. కొవిడ్‌ ప్రొటోకాల్‌ ప్రకారం పూజలు చేసుకుని ప్రజలు సురక్షితంగా ఉండాలని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు.

* తెలంగాణ రాష్ట్రానికి అసలు ముఖ్యమంత్రి కేటీఆరే అని సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌ విశ్రాంతి తీసుకొని కేటీఆర్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలన్నారు. వరంగల్‌లోని వరద ముంపు ప్రాంతాల్లో ఆయన ఇవాళ పర్యటించారు. జిల్లాకు తక్షణ సాయంగా రూ. వెయ్యి కోట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెరాస నేతల ఆశీస్సులతోనే రాష్ట్రంలో భూ కబ్జాలు జరుగుతున్నాయని, నాలాలు ఆక్రమించడం వల్లే వరంగల్‌కు వరద ముంపు ఏర్పడిందని నారాయణ విమర్శించారు.

* శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. డీఈ శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులకు రూ.50 లక్షలు, మిగతా మృతుల కుటుంబ సభ్యులకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్లు విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రకటించారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.

* ప్రభుత్వ భూములను అక్రమంగా ఇతరులకు కట్టబెట్టిన ఆరోపణలపై ఇద్దరు తహశీల్దార్లపై వేటు పడింది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 540లో ప్రభుత్వ భూములను అక్రమంగా ఇతరులకు పట్టాలు చేసిన ఇద్దరు తహశీల్దార్లను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో గతంలో మఠంపల్లి తహసీల్దార్‌గా పనిచేసి ప్రస్తుతం గరిడేపల్లి తహశీల్దార్‌గా కొనసాగుతున్న చంద్రశేఖర్‌తో పాటు మఠంపల్లి ప్రస్తుత తహశీల్దార్‌ వేణుగోపాల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఇద్దరు తహశీల్దార్లు మొత్తం 430 ఏకరాల ప్రభుత్వ భూమిని అక్రమ మ్యూటేషన్ ఇచ్చినట్లు ప్రాథమిక సమాచారం. వీరిద్దరిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

* తెలంగాణ పరిధిలోని శ్రీశైలం ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్‌ సీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు.. దారితీసిన పరిస్థితులను వెలికితీయాలని సీఎం స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల మేరకు సీఐడీ అదనపు డీజీ గోవింద్‌సింగ్‌ను విచారణాధికారిగా నియమిస్తూ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని ఆదేశించారు. శ్రీశైలం విద్యుదుత్పత్తి కేంద్రం అగ్నిప్రమాదంలో ప్రాణనష్టంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

* కరోనా బారిన పడి కోలుకుంటున్నవారి సంఖ్య దేశంలో రోజురోజుకీ పెరుగుతోంది. గురువారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 62,282 మంది డిశ్చార్జి అయ్యారు. 24గంటల సమయంలో ఇంతమంది కోలుకొని డిశ్చార్జి కావడం ఇదే తొలిసారి. తాజా గణాంకాలతో భారత్‌లో కొవిడ్‌ బారినపడి కోలుకున్నవారి సంఖ్య 21,58,946కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. మరోవైపు, యాక్టివ్‌ కేసులు, మరణాల రేటు కూడా తగ్గుతోంది. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 74.3% కాగా; మరణాల రేటు 1.9%గా ఉంది.

* అమెరికాలో ఎన్నికల ప్రచారం ముమ్మరం కావడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తోపాటు ప్రత్యర్థి జో బైడెన్‌ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్‌ జన్మస్థలమైన పెన్సిల్వేనియాలో డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఓటర్లతో మాట్లాడిన ఆయన.. అమెరికన్‌ కార్మికులను డెమొక్రాట్‌లు అమ్మివేశారని విమర్శించారు. ఒకవేళ బైడెన్‌ అధికారంలోకి వస్తే మీకు పీడకలే అవుతారని అక్కడి ఓటర్లతో అన్నారు.

* కరోనా వైరస్‌కు మందు కనిపెట్టానని, తాను తయారుచేసిన మందును వినియోగించేలా తీర్పు ఇవ్వాలంటూ పిటిషన్‌ వేసిన ఓ ఆయుర్వేద వైద్యుడిపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అనాధారిత పిటిషన్‌ వేసిన అతడికి రూ.10 వేల జరిమానా విధించింది. ఆయుర్వేద వైద్యంలో బ్యాచిలర్‌ డిగ్రీ చేసిన హరియాణాకు చెందిన ఓం ప్రకాశ్‌ వేద్‌ జ్ఞాన్‌తారా తాను కొవిడ్‌కు మందు తయారు చేశానని సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలు చేశాడు. భారత ప్రభుత్వం, ఆరోగ్య శాఖ, ఇతరులు ఆ మందును వినియోగించేలా తీర్పు ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరాడు. తాను రూపొందించిన దేశీయ మందు ప్రజలను ప్రాణాంతక వ్యాధి నుంచి కాపాడుతుందని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.

* దేశీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. వ్యాక్సిన్‌పై ఆశలతో అంతర్జాతీయ మార్కెట్లు సహా దేశీయ మార్కెట్లు లాభాల్లో పయనించాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌.. లాభాలను కొనసాగించినప్పటికీ ఒడుదొడుకులకు లోనైంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్టీపీసీ వంటి ప్రధాన షేర్ల అండతో లాభాల్లోకి వెళ్లింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు చివరి గంటలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో ఇంట్రాడే లాభాలను చివర్లో కోల్పోయింది. చివరికి 214.33 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌ 38,434.72 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 66.50 పాయింట్లు లాభంతో 11,378.70 వద్ద ముగిసింది.

* బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అక్షయ్‌కుమార్‌ ప్రముఖ సాహస యాత్రికుడు బేర్‌ గ్రిల్స్‌తో కలిసి సాహసాలు చేయనున్నాడు. అతడితో కలిసి చిత్రీకరించిన సాహసయాత్ర ఎపిసోడ్‌ టీజర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ‘నన్నో పిచ్చోడు అనుకుంటున్నారా.. అయితే పిచ్చోళ్లే ఇలా అడవిలో సాహసాలు చేస్తారు’ అంటూ ఆ టీజర్‌కు తన వ్యాఖ్యానాన్ని జత చేశాడు. కాగా ఆ టీజర్‌ సినీ, సాహసయాత్ర ప్రేమికుల్లో ఉత్సుకతను రేకెత్తిస్తోంది. బేర్‌ సైతం ఓ మోషన్‌ పోస్టర్‌ను పంచుకున్నాడు. ‘జీవితమే ఓ సాహసయాత్ర. ఇలా సాహసాలను ఎంజాయ్‌ చేసే వాళ్లు మరికొందరు ఉన్నారు. లెజెండరీ అక్షయ్‌ కుమార్‌ ఓ ఉత్తమ సాహస యాత్రికుడు’ అంటూ పేర్కొన్నాడు.