Kids

తొందరపాటు వలదు – తెలుగు చిన్నారుల కథ

తొందరపాటు వలదు – తెలుగు చిన్నారుల కథ

ఒక వర్తకుడు జాతరలో తన సరుకునంతా అమ్మి బాగా సొమ్ము చేసుకున్నాడు. సంచులన్నీ డబ్బులతో బరువెక్కిపోయాయి. జాతర ముగిసిన తర్వాత చీకటి పడకముందే ఇల్లు చేరాలని నిశ్చయించుకున్నాడు.

మధ్యాహ్నమంతా ఒక పట్టణంలో విశ్రాంతి తీసుకున్నాడు. అతనింక బయల్దేరాలనుకునే సమయానికి అతని పనివాడు వర్తకుడి గుర్రాన్ని వెంటబెట్టుకు వచ్చి “అయ్యా! గుర్రం ఎడమ గిట్టలో ఒక మేకు ఉండిపోయింది. ఇప్పుడేం చేద్దాం! అని అడిగాడు. దానికా వర్తకుడు “ఉండనివ్వరా, ఏం కాదులే!” అని జవాబిచ్చి ఊరుకోకుండా “నేను ఇంకా ఆరుమైళ్ళ దూరం వెళ్ళాలి, నేను కొంచెం తొందరగా ఉన్నాను. నాగుర్రానికి నన్ను సవ్యంగా ఇల్లు చేర్చే సత్తా ఉంది” అన్నాడు.

సాయంత్రం వేళ అతను ఒక సత్రం దగ్గర మళ్ళీవచ్చి “అయ్యా! గుర్రం ఎడమ గిట్టకున్న నాడా ఊడిపోయింది. నేను దాన్ని కంసాలి వద్దకు తీసుకెళ్ళాలా?” అని అడిగాడు.

“దాన్నలాగే ఉండనివ్వరా బాబూ! నా గుర్రం మరో రెండు మైళ్ళు నన్ను మోయ లేదా? నేను కాస్త తొందరలో ఉన్నాను కదా?” అని బదులిచ్చాడు వర్తకుడు.

అలాగే వర్తకుడు ప్రయాణం సాగించాడు. కాని కొద్ది దూరం ప్రయాణించాక గుర్రం కుంటడం మొదలెట్టింది. మెల్లిగా కుంటడం మొదలెట్టి ఒక దగ్గర కూలబడిపోయింది. హఠాత్తుగా కూలబడిపోవడం వల్ల గుర్రం కాలు విరిగిపోయింది. అంతే! వర్తకుడు బిత్తరపోయాడు. గుర్రాన్ని అక్కడే వదిలేసి, సంచులన్నీ మోసుకుంటూ, రొప్పుతూ నడుస్తూ ఇల్లు చేరాడు.

వర్తకుడు తన పనివాడి మాట విని గుర్రానికి గిట్టలకు నాడాలు వేయించినట్లయితే వర్తకుడికి బాధలు తప్పేవి కదా! సమయస్పూర్తితో మెలుగుతూ, చెయాల్సిన పనిని తగిన సమయంలో పూర్తిచేస్తే ఎలాంటి ఆపదలూ, ఇబ్బందులూ ఉండవు.

మీ పనిపై మనసు లగ్నం చేయండి. అలా చేయడం వల్ల అన్ని పనులూ అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఇలా చేయడం వలన అద్భుతాలు చేయడం ఏమంత కష్టంకాదు.