WorldWonders

చిన్నారిని ఎగరేసుకుపోయిన గాలిపటం

చిన్నారిని ఎగరేసుకుపోయిన గాలిపటం

తైవాన్‌లో భయానక ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారిని ఓ గాలిపటం అమాంతం గాల్లోకి ఎగరేసుకుపోయింది. తైవాన్‌లోని సించు నగరంలో ఏటా పతంగుల ఉత్సవాన్ని నిర్వహిస్తారు. తాజాగా జరిగిన వేడుకలో పలువురు పాల్గొన్నారు. అయితే గాల్లో ఎగురుతూ వచ్చిన ఓ భారీ గాలిపటం తోక ఉత్సవానికి వచ్చిన ఓ చిన్నారి చేతికి చుట్టుకొని ఆమెను అమాంతం ఆకాశంలోకి తీసుకెళ్లిపోయింది. 100 అడగులకు పైగా ఎత్తులోకి ఎగరేసుకుపోయింది. దాదాపు 30 సెకన్లపాటు చిన్నారిని గాల్లోనే గింగిరాలు తిప్పింది. ఒక్కసారిగా భయాందోళనకు గురైన పర్యాటకులు గాలిపటాన్ని నియంత్రణలోకి తీసుకొచ్చి ఆ చిన్నారిని కిందకు దింపారు. కాగా ఆ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ ప్రాంతంలో వచ్చే భారీ ఈదురు గాలుల కారణంగానే వేగంగా వచ్చిన భారీ గాలిపటం ధాటితో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. చిన్నారి స్పల్ప గాయాలతో బయటపడ్డట్లు పేర్కొన్నారు.