DailyDose

ఒకడు ఆదుకుంటే మరొకడు ముంచాడు-నేరవార్తలు

ఒకడు ఆదుకుంటే మరొకడు ముంచాడు-నేరవార్తలు

* టీవీ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. శ్రావణి చనిపోవడానికి సాయికి సంబంధం లేదని ఆమె తల్లి పాపా రత్నం చెప్పారు. కేసులో ప్రధాన నిందితుడు దేవరాజు వల్లే తమ బిడ్డ ప్రాణాలు తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘దేవరాజు వల్లే మా అమ్మాయి శ్రావణి చనిపోయింది. సాయి.. శ్రావణిని కొట్టింది దేవరాజు నుంచి దూరంగా ఉండాలని మాత్రమే. దేవరాజు తన మీద ఉన్న కేసును తీయించుకోవడానికే మా అమ్మాయితో ప్రేమ నాటకం ఆడాడు.  శ్రావణి చనిపోయే ముందు బాత్ రూమ్‌ నుంచి దేవరాజుకు ఫోన్ చేసింది. అయినప్పటికీ దేవరాజు పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వలేదు. అందుకే శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. సాయి లేకపోతే మా కుటుంబం ఆరోజే చనిపోయేవాళ్లం. దేవరాజుకు శ్రావణి అన్నీ చూసుకుంది. సీరియల్స్ వాళ్లు దేవరాజుకు ఒక ఎత్తు పన్ను ఉందన్నారు. శ్రావణి పది వేల రూపాయలు పెట్టి పన్ను కట్టించింది. రోజూ పాలు, గుడ్లు శ్రావణి తమ్ముడు ఇచ్చేవాడు. దేవరాజు మా అమ్మాయి దగ్గర డబ్బు తీసుకుని గ్లామర్ పెంచుకుని సీరియల్ అవకాశాలు దక్కించుకున్నాడు. మమ్మల్ని నట్టేట ముంచినాడు. కాగా దేవరాజ్‌, సాయి వేధింపుల మూలంగానే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిందని ఇప్పటికే పలు కథనాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. 

* ఆలయాలు, ప్రార్ధనా మందిరాల‌ వద్ద కెమెరాలు ఏర్పాటు పెట్టాలి..నిర్వాహకులు పోలీసులు సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి..స్థానిక పోలీసులు అక్కడ ఏర్పాట్లును పరిశీలించి, నిబంధనలు పాటించేలా చూడాలి..ప్రతి ఒక్కరూ జియో ట్యాగింగ్‌ చేయాలి..ఆడిటింగ్ రిపోర్ట్ లను జిల్లా ఎస్పీకి సమర్పించాలి..అనుకోని ఘటనలు జరిగితే… వాటికి సంబందించిన నిర్వాహకులు బాధ్యత వహించాలి..ఒకరి మతాన్ని మరోకరు గౌరవించుకునేలా .. పీస్ కమిటీ లు వేయాలి..గతంలో ఉన్న పీస్ కమిటీలు తరహాలో నేటి పరిస్థితి కి అనుగుణంగా విధానాలు మార్చుకోవాలి..ఉద్దేశపూర్వకంగా బయటి నుంచి వచ్చి అరాచకాలకు పాల్పడే వారు కూడా ఉంటారు.కావాలని మత విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశం ఉన్న ప్రాంతాల పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

* యూట్యూబ్‌లో చూస్తూ నాటుసారా తయారు చేస్తున్న చిత్తూరు జిల్లా పాకాల మండలం తోటపల్లికి చెందిన యువ ఇంజినీరు వంశీకృష్ణారెడ్డి (29)ని పోలీసులు అరెస్టు చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో తొలుత కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం సీసాలు తెచ్చి అతడు విక్రయించేవాడు. లక్ష్యాన్ని త్వరగా అందుకోలేమని భావించి యూట్యూబ్‌లో చూసి తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీ సమీపంలోని నివాసగృహాల్లో ఒక అద్దె గదిలో స్వయంగా సారా తయారు చేస్తున్నాడు. అతడు కర్ణాటక మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు గదిని సోదా చేశారు. గ్యాస్‌స్టవ్‌పై నాటుసారా తయారీని గుర్తించారు. సీసాల్లో అతడు 70 లీటర్ల నాటుసారా నింపాడు. 400 లీటర్ల ఊటను సిద్ధం చేసుకున్నాడు. కర్ణాటక నుంచి లీటరు పరిమాణం ఉండే 44 సీసాలను తెచ్చుకున్నాడు. మద్యంతోపాటు సారాబట్టీ వస్తువులను స్వాధీనం చేసుకున్నామని, నిందితుడిని అరెస్టు చేశామని ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ) తిరుపతి అర్బన్‌ సీఐ ధీరజ్‌రెడ్డి తెలిపారు. సహకరిస్తున్న అతడి తమ్ముడు వాసుపై కేసు నమోదు చేశారు.

* అన్నా నాకు న్యాయం చేయరా…! అని ప్రశ్నిస్తూ కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న పరిటాలకు చెందిన రాజశేఖరరెడ్డి పేరిట శనివారం గ్రామంలో పలుచోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి. అతని దశదిన కర్మ సందర్భంగా స్నేహితులు, బంధువులు వీటిని ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన మున్నంగి రాజశేఖరరెడ్డి బలవన్మరణానికి పాల్పడి పది రోజులైనా.. కారకులైన వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోడంపై బాధితుడి ఆవేదన తెలియజేస్తూ వీటిని పెట్టారు. నాకు సాయం చేసిన వారిని పొగడడం నేను చేసిన పాపమా…? మీ రాజకీయ ఆధిపత్య ఆట కోసం నన్ను చంపేస్తారా…? ఓ పోలీస్‌ అన్నా నేను నీ తమ్ముడిని అయి ఉంటే ఇలానే చేస్తారా…? నిజాన్ని తొక్కేసి మావాళ్ల నోర్లు నొక్కేస్తారా…? నా నిరుపేద కుటుంబానికి తీరని ద్రోహం చేస్తారా..? అంటూ బాధితుడి ఆవేదనను తెలియజేస్తూ ‘‘నా ఆత్మఘోష పేరిట’’ పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిపై గాంధీజీ, అంబేడ్కర్‌తో పాటు మాజీ ముఖ్యమంత్రులు వైఎస్‌.రాజశేఖరరెడ్డి, ఎన్టీఆర్‌ చిత్రాలను ప్రచురించారు.

* చోరీకోసం దుకాణం లోనికి చొరబడ్డ వ్యక్తి ఊపిరాడక అక్కడే మరణించిన ఉదంతమిది. షట్టర్‌ మూసేసి వెలుతురు కోసం అగ్గిపుల్ల వెలిగించడంతో అక్కడ ఉన్న శానిటైజర్‌, పెట్రోలుకు అంటుకుని మంటలు వ్యాపించాయి. దానికి తోడు గది నిండా పొగ నిండిపోవడంతో ఊపిరాడక శేఖర్‌(35) అనే ఆ దొంగ కన్ను మూశాడు. మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండలం పల్వంచ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. శనివారం ఉదయం దుకాణ యజమాని స్వామి షట్టరు తీసి చూసే సరికి శేఖర్‌ విగతజీవిగా కనిపించాడు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ లింబాద్రి తెలిపారు.