DailyDose

సరికొత్త యాపిల్ వాచీలు వచ్చాయి-వాణిజ్యం

సరికొత్త యాపిల్ వాచీలు వచ్చాయి-వాణిజ్యం

* ఈ నెల 18న ప్రారంభం కానున్న కనకదుర్గ ఫ్లై ఓవర్‌ సామర్థ్య పరీక్షలను మరోమారు నిర్వహించారు. నేషనల్‌ హైవే, ఆర్‌ అండ్‌ బీ అధికారులు ఇప్పటికే పలు పర్యాయాలు లోడ్‌ టెస్ట్‌లు నిర్వహించిన సంగతి విదితమే. మరో రెండు రోజుల్లో ఈ ఫ్లై ఓవర్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో చివరి సారిగా మంగళవారం సుమారు 216 పౌండ్ల బరువుతోకూడిన తొమ్మిది టిప్పర్లను ఫ్లై ఓవర్‌పై ఉంచారు. ఈ టిప్పర్లను సుమారు 106 గంటలపాటు అలానే ఉంచుతారని అక్కడ సిబ్బంది తెలిపారు. కాగా ఫ్లై ఓవర్‌ రోడ్‌లో సెంట్రల్‌ డివైడర్‌ పెయింటింగ్, జీబ్రా లైన్లు, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌తోకూడిన బోర్డ్‌ల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. ఫిల్లర్‌కు ఫిల్లర్‌కు మధ్య జాయింట్లను కలుపుతూ తుది మెరుగులు దిద్దుతున్నారు.

* యాపిల్‌ కొత్త వాచీలు. రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోవచ్చు. ఐప్యాడ్‌ కొత్త వెర్షన్‌ కూడా. టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ సరికొత్త ఉత్పత్తులు వాచ్‌ సిరీస్‌ 6, యాపిల్‌ వాచ్‌ ఎస్‌ఈ, ఐప్యాడ్‌ ఎయిర్‌లను మంగళవారం జరిగిన వర్చువల్‌ కార్యక్రమంలో విడుదల చేసింది. ప్రస్తుత కొవిడ్‌-19 పరిస్థితుల వల్ల కంపెనీ ఆన్‌లైన్‌లో వీటిని తీసుకొచ్చింది. ఈసారి యాపిల్‌ వాచ్‌, ఐప్యాడ్‌ కొత్త వెర్షన్‌లను మాత్రమే విడుదల చేసింది. ఎటువంటి ఐఫోన్లు, మ్యాక్‌లను తీసుకురాలేదు. యాపిల్‌ కొత్త తరం వాచ్‌ సిరీస్‌ ‘వాచ్‌ 6’ను యాపిల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జఫె్‌ విలియమ్స్‌ విడుదల చేశారు. రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలను తెలియజేయడం దీని ప్రత్యేకత. ఈ సిరీస్‌ ప్రారంభ ధర 399 డాలర్లు. రక్తాన్ని పరీక్షించడానికి రెడ్‌, ఇన్‌ఫ్రారెడ్‌ లైట్‌, ఆ తర్వాత ఆల్గారిథమ్స్‌ను వినియోగిస్తుంది.

* కరోనా సంక్షోభ కాలంలోనూ భారత్‌కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) భారీగా వచ్చాయని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్‌ ష్రింగ్లా తెలిపారు. గత కొన్ని నెలల్లో 20 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు సమకూరాయని వెల్లడించారు. యూకేలో జరుగుతున్న సీఐఐ సమావేశంలో ఆయన ఆన్‌లైన్‌ మాధ్యమంలో ప్రసంగించారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి భారత ప్రభుత్వం తీసుకున్న నిర్మాణాత్మక సంస్కరణల్ని ఈ సందర్భంగా వివరించారు. రక్షణ, అంతరిక్ష, అణుశక్తి వంటి రంగాల్లోనూ ఎఫ్‌డీఐలను భారీ స్థాయిలో ఆహ్వానిస్తున్నామని తెలిపారు. గత ఆరు సంవత్సరాల్లో సులభతర వాణిజ్యం కోసం ప్రధాని మోదీ నేతృత్వంలో అనేక సంస్కరణలు చేపట్టినట్లు వివరించారు. ప్రపంచంలో అందిరికీ అందుబాటులో ఉండే ఆర్థిక వ్యవస్థగా భారత్‌ రూపుదిద్దుకుందన్నారు. పన్నుల విధింపుల్లో సైతం పారదర్శకత పాటిస్తున్నామన్నారు.

* కరోనాకు టీకా సిద్ధం చేస్తున్న అమెరికాకు చెందిన నోవావాక్స్‌ తయారీలో దూకుడు పెంచనుంది. భారత్‌ సహకారంతో ప్రతి ఏడాది రెండు బిలియన్ల డోసులను అధికంగా ఉత్పత్తి చేయనున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యధికంగా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపిన నోవావాక్స్‌ ఆగస్టులో భారత్‌లోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌తో జతకట్టింది. భారత్‌ వంటి దేశాల్లో టీకా చవక ధరలో అందించేందుకు మొదటి విడతలో కనీసం బిలియన్‌ డోసులు ఉత్పత్తి చేయాలనే సంకల్పంతో ఉంది. ఈ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ ప్రస్తుతం మధ్య దశలో ఉన్నాయి. మొదటి దశ పరీక్షలు గతంలోనే నిర్వహించగా టీకాలో అత్యధిక శాతం యాంటీబాడీలు ఉన్నట్లు తేలింది.

* చైనా కంపెనీ బైట్‌డ్యాన్స్‌కు చెందిన టిక్‌టాక్‌ యాప్ అమెరికా కార్యకలాపాలను ప్రముఖ అమెరికన్‌ సంస్థ ఒరాకిల్ సొంతం కానున్నట్లు సమాచారం. ఒరాకిల్ ఒప్పందానికి దగ్గరగా ఉన్నట్లు విన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పడమే అందుకు కారణం. కాకపోతే మెజారిటీ యాజమాన్య హక్కులను తన వద్దే ఉంచుకునేందుకు బైట్‌డ్యాన్స్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. టిక్‌టాక్‌ వినియోగదారుల సమాచారం చైనాకు చేరుతుందంటూ, వారి సమాచార భద్రతపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో యాప్ యూఎస్‌ కార్యకలాపాలను సెప్టెంబరు 15లోగా విక్రయించేలా ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆ కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ ఆసక్తి చూపినా..బైట్‌డ్యాన్స్‌ అందుకు అంగీకరించలేదు.