Health

కరోనా కాలంలో ఆరోగ్యానికి ఆయుర్వేద చిట్కాలు

Ayurveda Tips For Good Health During COVID19 Times

ఈ కరోనా కష్టకాలంలో ప్రభుత్వాలు, డాక్టర్లు అంతా ఏకమై చెప్తున్న మాట ఒకటే.. వైరస్ బారినుంచి తప్పించుకోవాలంటే కావాల్సింది మందులు మాత్రమే కాదని, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ముఖ్యమని. మరి దానికోసం వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. మన పూర్వకాలం నుంచి ఇంట్లో పాటిస్తున్న ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే చాలు. ఈ చిట్కాలతో ప్రతిఒక్కరు ఆరోగ్యంగా ఉండొచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ చెప్తోంది.కరోనా వైరస్​కు మందు లేకపోయినా.. పాజిటివ్​ వచ్చిన చాలామంది పేషెంట్లు త్వరగా కోలుకోవడానికి ఇంటి చిట్కాలనే ఎక్కువగా పాటిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ఎప్పటికప్పుడు కోవిడ్​కి సంబంధించిన గైడ్​లైన్స్​ని జారీ చేస్తూనే ఉంది. యోగా ప్రాక్టీస్​ చేయడం, కౌన్సెలింగ్​ తీసుకోవడం, సరిపడా నీళ్లు తాగడం, పౌష్టికాహారం వంటి సలహాలే కాకుండా ఇటీవల మరిన్ని గైడ్​లైన్స్​ జారీ చేసింది. అందులో చెప్పిన చిట్కాలను రోజువారీగా పాటిస్తే, ఇమ్యూనిటీ పవర్​ పెరగడంతో పాటు కరోనా పాజిటివ్​ వచ్చినా త్వరగా కోలుకుంటారు.
*ఆయుష్​ క్వాత్​ (కషాయం)
రోజుకోసారి కప్పు లేదా నూట యాభై మిల్లీలీటర్ల ఆయుష్​ క్వాత్​ తాగమని కేంద్ర ఆరోగ్యశాఖ సూచిస్తోంది. నాలుగొంతుల తులసి ఆకులు, రెండొంతుల దాల్చిన చెక్క, రెండొంతుల సొంఠి, ఒక వంతు మిరియాలను రెండు కప్పుల నీళ్లలో వేసి మరిగించాలి. కావాలంటే ఈ పదార్థాలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. దాన్ని రోజుకో పావు టీ స్పూన్​ చొప్పున నీళ్లలో మరిగించి తాగాలి. లేదంటే మూడు గ్రాముల పొడిని టీ బ్యాగ్స్​గా తయారు చేసుకుని, వేడి నీళ్లలో ఐదు నిమిషాలు ముంచి తీసేయాలి. ఈ ఆయుష్​ క్వాత్​లో కిస్‌మిస్‌, నిమ్మరసం లేదా బెల్లం తురుము కలిపి తాగినా ఆరోగ్యానికి మంచిదే. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు రోజంతా హుషారుగా ఉండేలా చేస్తుంది.
*పసుపు పాలు
ఈ ఇంటి చిట్కాను ఇప్పటికే చాలామంది పాటిస్తున్నారు. దీనివల్ల మంచి ఫలితాలను పొందుతున్నామని కూడా కోవిడ్​ నుంచి కోలుకున్న వాళ్లు ఎంతోమంది తమ ఎక్స్​పీరియెన్స్​ చెప్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ కూడా రోజూ ఉదయం, సాయంత్రం తప్పకుండా గోరువెచ్చని పాలలో అర టీ స్పూన్​ పసుపు కలుపుకుని తాగమని పదేపదే చెప్తోంది. ఎందుకంటే పసుపులో ఉండే థెరపెటిక్​ గుణాలు ఏదైనా గాయం లేదా జబ్బు నుంచి మనిషిని త్వరగా కోలుకునేలా చేస్తాయి. శరీరంలోని రకరకాల ఇన్​ఫెక్షన్లు, ఇతర సమస్యలను పసుపు పాలు త్వరగా మాన్పుతాయి. పసుపులో యాంటీ మైక్రోబియల్​, యాంటీ అలర్జిక్​, యాంటీ ఇన్​ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్లే పసుపు ఇంత ఎఫెక్టివ్​గా పని చేస్తుంది. ఈ పసుపు పాలలో కావాలంటే చిటికెడు మిరియాల పొడి వేసుకోవచ్చు.
*అశ్వగంధ
పూర్వకాలం నుంచి దివ్య ఔషధంగా ఉపయోగిస్తున్న మూలికల్లో అశ్వగంధ ఒకటి. కరోనా బారిన పడ్డప్పుడు ఆయా పేషెంట్లు శారీరకంగా, మానసికంగా ఎంతో ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ అశ్వగంధ ఒత్తిడి, కార్టిసాల్​ లెవల్స్​ని తగ్గించి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా బ్లడ్​ షుగర్​ స్థాయిలను అదుపులో ఉంచుతూ, యాంగ్జైటీ, డిప్రెషన్​ వంటి సమస్యలకు చెక్​ పెడుతుంది. ఇన్ని లాభాలు పొందాలంటే పదిహేను రోజుల పాటు రోజుకు రెండుసార్లు రెండు, మూడు గ్రాముల అశ్వగంధను తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించిన గైడ్​లైన్స్​లో ఉంది. లేదంటే మార్కెట్లో దొరికే ఐదు వందల గ్రాముల అశ్వగంధ సప్లిమెంట్స్​ని రోజుకు రెండుసార్లు తీసుకోవచ్చు.
*పుక్కిలించడం
కోవిడ్​ లక్షణాల్లో గొంతులో గరగరా చాలామందికి ఉంటోంది. పాజిటివ్​ వచ్చి తగ్గిన తర్వాత కూడా కొందరికి ఈ సమస్య ఉంటోందని చెప్తున్నారు. దీనికి హెల్త్​ మినిస్ట్రీ చెప్తున్న పరిష్కారం.. గోరువెచ్చని నీళ్లలో పసుపు, ఉప్పు వేసి పుక్కిలించడం. ఉప్పు కలిపిన నీళ్లు గొంతులోని యాసిడ్స్​ని న్యూట్రలైజ్​ చేసి బయటికి పంపించేస్తాయి. దానివల్ల గొంతులో బర్నింగ్​ సెన్సేషన్​ తగ్గించడంతో పాటు మ్యూకస్​ మెంబ్రేన్స్​లో ఇరిటేషన్​ని దూరం చేస్తుంది. అలాగే గొంతులోని గాయాలు, ఇన్​ఫెక్షన్స్​ను పసుపు కంట్రోల్​ చేస్తుంది. అందువల్ల ఒక కప్పు గోరువెచ్చని నీళ్లలో అర టీ స్పూన్​ ఉప్పు, అర టీ స్పూన్​ పసుపు వేసి కలపాలి. దాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మేయడం వల్ల త్వరగా రిలీఫ్‌ వస్తుంది.
*తిప్పతీగ
కోవిడ్​ లక్షణాల్లో ప్రధానంగా కనిపించే జ్వరానికి ఈ తిప్పతీగ బాగా పనిచేస్తుంది. అదీ ఇదీ అని కాకుండా, అన్నిరకాల జ్వరాలకు తిప్పతీగ బెరడు చెక్​ పెడుతుంది. ప్రతిరోజూ ఒక గ్రాము బెరడు ముక్కను పొడి చేసి లేదా నీళ్లలో మరిగించి తీసుకోవాలి. పోస్ట్​ కోవిడ్ లక్షణాల నుంచి ఉపశమనం కలిగించే యాంటీ ఇన్​ఫ్లమేటరీ, యాంటీ పైరెటిక్​ ఎఫెక్ట్స్​ ఇందులో ఉంటాయి.​ కడుపులో జీర్ణమవ్వని వాటివల్ల కూడా ఒక్కోసారి జ్వరం వస్తుంది. అలాంటి జ్వరాలు రాకుండా ఉండేందుకు కడుపులోని టాక్సిన్స్​ని తిప్పతీగ బయటికి పంపించేస్తుంది. అలాగే ఈ రెమెడీ తలనొప్పి, అజీర్తి, ఆకలి లేకపోవడం, ఒళ్లు నొప్పులు, బర్నింగ్​ సెన్సేషన్​ వంటి సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది.
*ములేతీ పొడి
అనాదిగా వస్తున్న మూలికా వైద్యంలో ములేతీ పొడికి ప్రాధాన్యం ఉంది. దీన్ని ఎక్కువగా పొడి దగ్గుకు వాడతారు. ప్రతిరోజూ రెండుసార్లు ఒకటి నుంచి మూడు గ్రాముల ములేతీ పొడిని గోరువెచ్చని నీళ్లలో కలుపుకుని తాగాలి. జలుబు, దగ్గు నుంచి ఈ పొడి వెంటనే రిలీఫ్‌ ఇస్తుంది. ములేతీ వేర్లు దొరికితే, ఇంట్లో ములేతీ టీ తయారు చేసుకోవచ్చు. దానికోసం ఒక ఇంచు ములేతీ వేరు, ఒక టీ స్పూన్​ అల్లం తరుగు, నాలుగు మిరియాలను రెండు కప్పుల నీళ్లలో వేసి సగానికి సగం మరిగించాలి. నోటికి రుచిగా ఉండాలనుకుంటే ఆ మిశ్రమంలో ఒక టీ స్పూన్​ తేనె కలుపుకుని తాగొచ్చు. ఈ కరోనా కాలంలో ఇలా చేయడం వల్ల దగ్గు, జలుబు సమస్యల నుంచి రిలీఫ్‌ లభిస్తుంది.
*చవన్​ప్రాశ్‌
చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ ఈ కరోనా కాలంలో చవన్​ప్రాశ్‌​ని తీసుకోవాలని గతంలో కూడా మినిస్ట్రీ ఆఫ్​ ఆయుష్​ సూచించింది. రోజూ ఉదయం పాలు లేదా గోరువెచ్చని నీళ్లలో ఒక టీ స్పూన్​ లేదా ఐదు మిల్లీగ్రాముల చవన్​ప్రాశ్‌ని తీసుకోవాలి. ఇందులో నలభై రకాలకు పైగా మెడిసినల్​ హెర్బ్స్​ కలిసి ఉంటాయి. అవన్నీ మనిషిలో రోగనిరోధక శక్తిని పెంచి, ఎలాంటి వ్యాధుల నుంచైనా త్వరగా కోలుకునేలా చేస్తాయి. అయితే డయాబెటిస్​ పేషెంట్లు మాత్రం షుగర్​ ఫ్రీ చవన్​ప్రాశ్‌​ ఎంచుకోవడం మంచిది.
*ఉసిరికాయ లేదా ఉసిరి పొడి
హోమ్​ రెమెడీస్​లో మరో ముఖ్యమైన ఔషధం ఉసిరికాయ లేదా ఉసిరి పొడి. రోజూ ఒక ఉసిరి కాయను నేరుగా తిన్నా సరే, లేదంటే ఒకటి నుంచి మూడు గ్రాముల ఉసిరి పొడిని రోజుకు రెండుసార్లు నీళ్లలో కలుపుకుని తాగినా పర్లేదు. ఉసిరిలో జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలను తగ్గించే గుణాలు ఉంటాయి. అలాగే ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. కఫంతో చాతీ పట్టేసినట్టు అనిపిస్తే, కచ్చితంగా కొన్నిరోజులు ఉసిరిని తీసుకోవాలి. ఇందులో క్రోమియం ఉండటం వల్ల.. అది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్స్​ ఎక్కువగా ఉండటంతో చాలావరకు ఆరోగ్య సమస్యలు దరిచేరవు. యాంటీ బ్యాక్టీరియల్​ గుణాలున్న ఉసిరి శరీరంలోని మలినాలను బయటికి పంపించేస్తుంది.