DailyDose

చందానగర్‌లో బెట్టింగ్ ముఠా అరెస్ట్-నేరవార్తలు

* శేరీలింగంప‌ల్లి ప‌రిధిలోని చందాన‌గ‌ర్ పాపిరెడ్డి కాల‌నీలో ఉన్న చందాన‌గ‌ర్ రైల్వే స్టేష‌న్ వ‌ద్ద టీ స్టాల్ స‌మీపంలో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వ‌హిస్తున్నార‌న్న స‌మాచారం మేర‌కు చందాన‌గ‌ర్ ఎస్ఐ రాములు, ఇత‌ర సిబ్బంది క‌లిసి దాడులు నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో బెట్టింగ్ నిర్వ‌హిస్తున్న వి.శేఖ‌ర్‌, కె.ఎల్ల‌ప్ప‌, ఆర్‌.శివ‌, జి.సునీల్‌ను వారు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.15,130 న‌గ‌దు, 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిని పోలీసులు రిమాండ్‌కు త‌ర‌లించారు. ఈ మేర‌కు వారిని మెజిస్ట్రేట్ ముందు హాజ‌రు ప‌ర‌చ‌నున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

* గుంటూరు నగరంలో గత కొన్ని రోజులుగా ద్విచక్ర వాహనాల దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో గుంటూరు అర్బన్ ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక దృష్టిసారించిన తూర్పు డిఎస్పీ సీతారామయ్య భారీ ఎత్తున వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా వాసి వెలవోలు వెంకటేష్ ను అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం20 ద్విచక్ర వాహనాలు దొంగిలించినట్లు,ఇంజనీర్ విద్యను అభ్యసించి చెడు అలవాట్లకు లోనైన వెంకటేష్ ఈ దొంగతనాలకు పాల్పడటం గమనార్హం. ఇతను గుంటూరు నగరంలోని కొత్తపేట, లాలపేట, పాతగుంటూరు, నగరం పాలెం, పట్టాభిపురం, అరండల్ పేట పలు ప్రాంతాలలో చోరీకి పాల్పడినట్లు తెలిపారు.

* ప్రకాశం బ్యారేజీ వద్ద కాలువలోకి దూకిన యువతి…నీటిప్రవాహంలో కొట్టుకు పోయిన యువతి…యువతిని రక్షించేందుకు ప్రయత్నించిన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు….గంటసేపుగా సాగుతున్న రెస్క్యూ ఆపరేషన్…ఆటోనగర్ నుంచి సిటీ బస్సులో వచ్చినట్టు టికెట్ ఆధారంగా గుర్తించిన పోలీసులు.

* జమ్మూ కశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా బలగాలతో కలిసి ఈ ఎన్‌కౌంటర్‌ చేసినట్లు కశ్మీర్‌ జోన్‌ పోలీసులు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. కుల్గామ్‌లో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా దళాలు శుక్రవారం సాయంత్రం పోలీసులతో కలిసి కూంబింగ్‌ నిర్వహించారు. దీంతో ముష్కరులు వీరిపై కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన జవాన్లు వారిపై ఎదురు కాల్పులు జరిపి ఇద్దరిని హతమార్చారు. అక్టోబర్‌ 7వ తేదీన జమ్మూ కశ్మీర్‌లోని షోపియన్‌ జిల్లా సుగన్‌ జైనాపురా ప్రాంతంలో భద్రతా బలగాలు ముగ్గురు ముష్కరులను హతమార్చాయి. అదే తరహాలో సెప్టెంబర్‌ 7న అవంతిపురా జిల్లా సంబూర ప్రాంతంలో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి.

* గత కొంతకాలంగా ఓఎల్ఎక్స్‌లో వాహనాల నకిలీ ఫొటోలు పెడుతూ పలువురిని మోసం చేస్తున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ రాష్ట్రం భారత్‌పూర్‌కు చెందిన 9 మందిని సీసీస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరానికి చెందిన ఎనిమిది మందిని వీరు మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఓఎల్ఎక్స్‌లో ద్విచక్రవాహనాలు, కార్లను తక్కువ ధరకు విక్రయిస్తామంటూ పోస్టులు పెడుతూ పలువురి వద్ద నుంచి డబ్బులు బదిలీ చేయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. నగదు పంపినా బుక్‌ చేసుకున్న వస్తువులు రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సీసీస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సైబర్‌ క్రైం పోలీసులు తెలిపారు.

* సైబర్‌ నేరస్థులు ఓ వైద్యుడిపై వలపు వల విసిరారు. ఆయన చరవాణి నంబరు తెలుసుకుని వాట్సాప్‌ ద్వారా ముగ్గురు యువతులు రోజూ రాత్రి వేళల్లో ఆయనతో మాట్లాడారు. మీరంటే చాలా ఇష్టమని హైదరాబాద్‌కు రావాలని ఉందంటూ ఆయనతో మాయమాటలు చెప్పారు. పడకగదిలో ఉన్నానంటూ వీడియోకాల్‌ ద్వారా మాట్లాడేవారు. తమ వద్ద అధిక లాభాలొచ్చే పథకాలున్నాయని, తొలుత నగదుజమ చేస్తే తర్వాత వడ్డీతో పాటు అసలు ఇస్తామని చెప్పారు. వైద్యుడు మూడు నెలల్లో రూ.41లక్షలు సైబర్‌ నేరస్థుల ఖాతాలకు పంపించారు. నగదు రాకపోవడంతో అనుమానం వచ్చి ఫోన్‌ చేయగా వారు స్పందించలేదు. మోసపోయానని గ్రహించిన వైద్యుడు శుక్రవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు గుజరాత్‌లోని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారని, ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారని సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ ప్రసాద్‌ తెలిపారు.