Health

ప్రతిరోజు కళ్లపై అరచేతులతో రుద్దుకోవాలి

ప్రతిరోజు కళ్లపై అరచేతులతో రుద్దుకోవాలి

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం. చూపు లేకపోతే ప్రపంచమంతా చీకటే. కంట్లో నలక పడినప్పుడో, కళ్ల కలక వచ్చినప్పుడో.. లేదూ ఏ కారణంతోనైనా కళ్లు తెరవలేకపోతేనే తెలుస్తుంది చూపు గొప్పతనం ఏంటో. కొద్దిసేపటికే అంత కలవరపడిపోతే ఇక పూర్తిగా చూపు పోతే? ఊహించుకోవటానికే భయమేస్తోంది కదా. ప్రపంచ దృష్టి దినం (వరల్డ్‌ సైట్‌ డే) హెచ్చరిస్తోంది ఇదే. ముందు చూపుతో చూపును కాపాడుకోవాలని సూచిస్తోంది.
**చూపు తగ్గినా, కోల్పోయినా దాని పరిణామాలను జీవితాంతం అనుభవించాల్సిందే. రోజువారీ పనులు చేసుకోలేకపోవటం దగ్గర్నుంచి ఇతరులతో కలవలేకపోవటం, అభిప్రాయాలను కలబోసుకోలేకపోవటం వరకూ రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగం, వ్యాపారాలు, చదువుల వంటివన్నీ దెబ్బతింటాయి. చూపు దెబ్బతినకుండా, కోల్పోకుండా చూసుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. కాస్త జాగ్రత్త పడితే సుమారు కోటి మందిని చూపు కోల్పోకుండా కాపాడుకోవచ్చని ప్రపంచ ఆరోగ్యసంస్థ చెబుతోంది. చూపు తగ్గటానికి, పోవటానికి రకరకాల అంశాలు కారణమవుతుంటాయి. కంటికి దెబ్బలు తగలటం, దృష్టి దోషాలు, శుక్లాలు, వయసుతో పాటు రెటీనా మధ్య భాగం క్షీణించటం, నీటికాసుల వంటి సమస్యలెన్నో దోహదం చేయొచ్చు. మంచి విషయం ఏంటంటే- చలువ అద్దాలు ధరించటం, ఆకు కూరలు తినటం వంటి చిన్న చిన్న జాగ్రత్తలతోనూ చూపును కాపాడుకొనే అవకాశముండటం. ప్రపంచ దృష్టి దినం సందర్భంగా అలాంటి విషయాలపై ఓసారి కన్నేద్దాం.
*ఆహారంపై శ్రద్ద
కంటి ఆరోగ్యంలో మనం తినే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఆకుకూరల్లోని ల్యూటీన్‌, జియాగ్జాంతిన్‌ వంటి పోషకాలు కంటి జబ్బుల ముప్పు తగ్గటానికి తోడ్పడతాయి. క్యారెట్‌, చిలగడదుంప వంటి పసుపు, కాషాయ రంగు కూరగాయల్లోని విటమిన్‌ ఎ కళ్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక బొప్పాయి, నారింజ, మామిడి, స్ట్రాబెర్రీ వంటి పండ్లలోని విటమిన్‌ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు కంటి జబ్బుల నివారణకు దోహదం చేస్తాయి. అలాగే చేపలనూ మరవొద్దు. వీటితో లభించే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కన్నీటి ఉత్పత్తిని పెంచుతాయి. కళ్లు పొడిబారకుండా కాపాడతాయి.
*తరచూ కంటి పరీక్ష
నీటికాసులు, మధుమేహ కంటి జబ్బు వంటి రకరకాల సమస్యలను గుర్తించటానికి తరచూ కంటి పరీక్షలు చేయించుకోవటం ఒక్కటే మార్గం. వీటిని ముందుగానే గుర్తిస్తే ముదరకుండా చూసుకోవచ్చు. దృష్టిలోపాలు గలవారు కనీసం ఏడాదికి ఒకసారైనా కంటి డాక్టర్‌ను సంప్రదించి, దృష్టి దోషంలో మార్పులేవైనా తలెత్తాయేమో చూసుకోవాలి. కంటి సమస్యలేవీ లేకపోయినా నలబై ఏళ్ల వయసులో ప్రాథమికంగా ఒకసారి పరీక్ష చేయించుకోవాలి. అనంతరం 41-55 ఏళ్ల వయసులో ప్రతి 2-4 సంవత్సరాలకు.. 55-64 ఏళ్లలో ప్రతి 1-3 సంవత్సరాలకు.. 65 ఏళ్లు పైబడ్డాక ప్రతి ఏటా కంటి పరీక్ష చేయించుకోవటం మంచిది. కంటి పాప, మధ్య చూపు, రంగులు కనిపించే తీరు, కంట్లో ఒత్తిడి వంటి వాటిని బట్టి ఆయా సమస్యలను ముందుగానే గుర్తించటానికి వీలవుతుంది.
*పొగాకుకు దూర
సిగరెట్లు, బీడీలు, చుట్టలు, గుట్కా, జర్దా.. ఏ రూపంలో పొగాకు తీసుకున్నా కంటికి హాని చేసేదే. సిగరెట్ల వంటివి తాగినప్పుడు పొగలోని సైనైడ్‌ రక్తంలో కలిసి కంట్లోని కణాలను దెబ్బతీస్తుంది. పొగ తాగితే శుక్లాలు, కళ్లు పొడిబారటం వంటి సమస్యల ముప్పూ పెరుగుతుంది. వయసుతో పాటు రెటీనా మధ్యభాగం క్షీణించే ప్రమాదమూ ఎక్కువవుతుంది. దీనికి చికిత్స తీసుకోకపోతే చూపు పూర్తిగా దెబ్బతింటుంది.
*అవసరమైతే చలువ అద్దాల
సూర్యరశ్మిలోని అతి నీలలోహిత కిరణాలు శుక్లాలు, రెటీనా మధ్యభాగం క్షీణించటం వంటి సమస్యలకు దోహదం చేసే మార్పులను ప్రేరేపిస్తాయి. అందువల్ల బాగా ఎండ కాస్తున్నప్పుడు బయటకు వెళ్లేటప్పుడు చలువ అద్దాలు ధరించటం మంచిది. వీటిని కొనేటప్పుడు జాగ్రత్త అవసరం. అతి నీలలోహిత కిరణాలను పూర్తిగా అడ్డుకునే అద్దాలు ఎంచుకోవాలి. వెడెల్పు అంచులున్న టోపీలనూ ధరించినా కళ్లు దెబ్బతినకుండా చూసుకోవచ్చు.
*డిజిటల్‌ పరికరాలతో జాగ్రత్త
కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌లను చూస్తున్నప్పుడు రెప్పలు సరిగా ఆడించం. ఇది కళ్లు పొడిబారేలా చేస్తుంది. డిజిటల్‌ పరికరాల నుంచి వెలువడే ప్రకాశవంతమైన కాంతికి కళ్లు త్వరగా అలసిపోతాయి కూడా. అందువల్ల వీటితో ఎక్కువసేపు పనిచేయాల్సి వచ్చినప్పుడు మధ్యమధ్యలో దృష్టిని మరల్చటం మంచిది. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 సెకండ్ల పాటు 20 అడుగుల దూరంలోని దృశ్యాలను చూడటం అలవాటు చేసుకోవాలి. అరచేతులను కొద్దిసేపు గట్టిగా రుద్దుకొని కళ్ల మీద పెట్టుకున్నా ఉపశమనం కలుగుతుంది. ఇలాంటి చిట్కాలతో ఫలితం కనిపించకపోతే డాక్టర్‌ను సంప్రదించాలి. ఎందుకంటే కణస్థాయిలో వాపు ప్రక్రియ, కుంగుబాటు మాత్రల వంటి కొన్నిరకాల మందులు, వయసుతో పాటు హార్మోన్ల స్థాయులు మారిపోవటం వంటివీ కళ్లు పొడిబారటానికి దారితీస్తాయి. వీటన్నింటినీ పరిశీలించి, అవసరమైతే కన్నీటి ఉత్పత్తిని పెంచే చుక్కల మందులు సూచిస్తారు.
*మధుమేహం కంటికి పెద్ద శత్రువు. రక్తంలో గ్లూకోజు స్థాయలు నిరంతరం ఎక్కువగా ఉండటం వల్ల రెటీనాలోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతింటాయి. ఇందులో తొలిదశలో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. క్రమంగా చూపు మసకబారుతుంది. అప్పటికీ నిర్లక్ష్యం చేస్తే చూపు పూర్తిగా పోతుంది. అందువల్ల దీన్ని ముందుగానే గుర్తించి జాగ్రత్త పడటం మంచిది. వయసు మీద పడినవారిలో తరచూ కనిపించే మరో సమస్య శుక్లాలు. దీని బారినపడ్డవారిలో చూపు మసకబారటం, రంగులు వెలిసిపోయినట్టు కనిపించటం, రాత్రిపూట దృశ్యాలు సరిగా కనిపించకపోవటం, రెండేసి వస్తువులు కనిపించటం వంటి లక్షణాలు పొడసూపుతాయి. కంటి శస్త్రచికిత్స, అద్దాలతో శుక్లాలను పూర్తిగా నయం చేసుకోవచ్చు. అరవై ఏళ్లు పైబడినవారిలో అంధత్వానికి ప్రధాన కారణం రెటీనా మధ్యభాగం క్షీణించటం. కంటి కణజాలం దెబ్బతినటం దీనికి మూలం. ఇందులో రెండు రకాలున్నాయి. రెటీనాలో నీరు చేరటం వల్ల తలెత్తే సమస్యను కంట్లోకి ఇంజెక్షన్లు ఇవ్వటం ద్వారా నయం చేయొచ్చు. కాకపోతే చాలామందిలో కళ్లు పొడిబారే రకమే కనిపిస్తుంది. దీనికి ఎలాంటి చికిత్స లేదు. అంటే చూపు పోతే తిరిగి రావటం అసాధ్యమన్నమాట. కళ్లను దొంగదెబ్బ తీసే ఇంకో సమస్య నీటి కాసులు. దీనికి కారణం కంట్లో ఒత్తిడి పెరిగి, దృశ్యనాడి దెబ్బతినటం. ఇది నెమ్మదిగా ముదురుతూ వస్తుంటుంది. మొదట్లో ఎలాంటి లక్షణాలూ లేకపోవటం వల్ల చూపు పూర్తిగా పోయేంతవరకూ చాలామంది దీన్ని గుర్తించలేకపోవచ్చు. తరచూ కంటి పరీక్షలు చేయించుకోవటం ద్వారానే దీన్ని పసిగట్టగలం. కంట్లో ఒత్తిడిని తగ్గించే చుక్కల మందుతో ముదరకుండా ఇది చూసుకోవచ్చు. ఇవి పనిచేయకపోతే శస్త్రచికిత్స అవసరమవుతుంది.