Business

మాల్యా మద్యం కంపెనీ మూసేయాల్సిందే-వాణిజ్యం

మాల్యా మద్యం కంపెనీ మూసేయాల్సిందే-వాణిజ్యం

* విజయ్‌ మాల్యకు చెందిన యునైటెడ్‌ బ్రూవరీస్‌ హోల్డింగ్స్‌(యూబీహెచ్‌ఎల్‌) దాఖలు చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు సోమవారం కొట్టివేసింది. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్‌ చెల్లించాల్సిన బకాయిలను రికవరీ చేయడం కోసం కంపెనీని మూసివేయాలన్న కర్ణాటక హై కోర్టు తీర్పును సమర్థించింది.

* నిన్న భారీ నష్టాలను చవిచూసిన దేశీయ మార్కెట్లు మంగళవారం లాభపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 376 పాయింట్లు లాభపడగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 121 పాయింట్లతో 11,850 మార్కును దాటింది. డాలర్‌తో రూపాయిం మారకం విలువ రూ.73.70గా ఉంది.

* ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్‌ చెల్లించాల్సిన రూ.20 వేల కోట్ల రెట్రోస్పెక్టేటీవ్‌ పన్ను కేసులో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం (ఆర్బిట్రేషన్‌) తీర్పును భారత్‌ సవాల్‌ చేయనుంది. ఈ మేరకు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను న్యాయ సలహా కోరినట్లు తెలుస్తోంది. స్థానిక పార్లమెంట్‌ రూపొందించిన చట్టాలను దాటి మధ్యవర్తిత్వ న్యాయస్థానం తీర్పు ఇవ్వకూడదని తుషార్‌ మెహతా అన్నారు. ది హేగ్‌లోని అంతర్జాతీయ మధ్యవర్తి్త్వ న్యాయస్థానం రెట్రోస్పెక్టేటివ్‌ కేసులో గత నెలలో వొడాఫోన్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఆదాయపన్ను శాఖ పారదర్శకంగా, సమానంగా చూడటంలో విఫలమైందంటూ.. వొడాఫోన్‌పై భారత ప్రభుత్వం పన్ను విధించడం అహేతుకం అని పేర్కొంది. ఇది భారత్‌-నెదర్లాండ్స్‌ మధ్య పెట్టుబడుల ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని వాదించింది. వొడాఫోన్‌ నుంచి బాకీల వసూలను తక్షణమే నిలిపి వేయాలని, అంతేకాకుండా కోర్టు ఖర్చుల కింద రూ.40 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.

* జీప్‌ ఇండియా తన ఎస్‌యూవీలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. కంపాస్‌, కాంపాస్‌ట్రెయిల్‌ హాక్‌ ఎస్‌యూవీపై పండుగ సీజన్‌లో తగ్గింపులు ఇస్తోంది. ఇవి కంపెనీ వెబ్‌సైట్‌ ప్రకారం కనిష్ఠంగా రూ. 1.5 లక్షల నుంచి రూ.2లక్షల వరకు ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన నైట్‌ ఈగిల్‌ వెర్షన్‌పై మాత్రం ఎటువంటి డిస్కౌంట్లు ఆఫర్‌ చేయలేదు. ఈ ఆఫర్లు అక్టోబర్‌ 31 వరకు అమల్లో ఉంటాయి.

* ఆరు నెలల మారటోరియం కాలానికి రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ మాఫీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని రుణ విక్రేతల (బ్యాంకులు, ఆర్థిక సంస్థలు)ను ఆర్బీఐ కోరింది. సాధారణ వడ్డీకి, చక్రవడ్డీకి ఉన్న తేడాను రుణ గ్రహీతల ఖాతాల్లో రుణ విక్రేతలు జమ చేయాలని కేంద్రం ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. మారటోరియం ఉపయోగించుకోని వారికి కూడా ఈ స్కీమ్‌ వర్తిస్తుంది. ఈ ప్రక్రియను నవంబరు 5నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆర్థిక సంస్థల్ని కోరింది.

* లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ) మెగా ఐపీఓ వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం మొదట కంపెనీకి సంబంధించిన విలువను లెక్కగట్టడంపై దృష్టి సారించిందని (దీపమ్‌) కార్యదర్శి తుహిన్‌ కంతా పాండే పేర్కొన్నారు. ‘ఎల్‌ఐసీ ఇష్యూకు ముందు నాలుగు దశల్లో ప్రక్రియ జరగాల్సి ఉంది. అవి..నిబంధనలను పాటించడం కోసం సలహాదార్ల నియామకం, చట్ట సవరణ, ఎల్‌ఐసీ అంతర్గత సాఫ్ట్‌వేర్‌ మార్పులు, ఎల్‌ఐసీ విలువ మదింపునకు ఒక అధికారి నియామకం. ఇప్పటికే సలహాదార్లుగా డెలాయిట్‌, ఎస్‌బీఐ క్యాప్స్‌ను నియమించుకుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చట్టంలో సవరణ చేయడం ద్వారా వాటా విక్రయానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ నాలుగు దశల తర్వాతే ఎంత వాటా విక్రయం చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందని పాండే స్పష్టం చేశారు. ఎల్‌ఐసీ ఐపీఓ చాలా పెద్దది కాబట్టి సమయం పట్టొచ్చని.. ఆ ఆర్థిక సంవత్సరంలో అది సాధ్యం కాకపోవచ్చని ఆయన అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యమైన రూ.2.1 లక్షల కోట్లలో ఎల్‌ఐసీ వాటా విక్రయం చాలా కీలకం.

* దేశ ప్రజలందరికీ అందుబాటులో ఉండే ప్రయాణ సాధనం రైలు. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు. రైలు ప్రయాణం చేసే వారందరూ దాదాపు ఐఆర్‌సీటీసీ(ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌) ద్వారా టికెట్లు బుక్‌ చేసుకుంటారు. ఇటీవల ఐఆర్‌సీటీసీతో కలిసి అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐ రూపే కార్డును తీసుకొచ్చింది. ‘ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ రూపే కార్డ్‌’ పేరుతో తీసుకొచ్చిన ఈ కార్డును ఉపయోగించి వినియోగదారులు నిబంధనల మేరకు ఉచితంగా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.

* కంపెనీ షేర్లను తిరిగి కొనుగోలు(బైబ్యాక్‌) చేసే ప్రతిపాదనను నవంబరు 2న పరిశీలించడానికి బోర్డు సమావేశం కానుందని ఎన్‌టీపీసీ ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో తెలిపింది.

* వేలం ద్వారా ‘ఈ’, ‘వీ’ బ్యాండ్లలో స్పెక్ట్రమ్‌ను కేటాయించాలని టెలికాం కంపెనీలు, భారత సెల్యులార్‌ ఆపరేటర్ల సంఘం(కాయ్‌)లు సంయుక్తంగా ట్రాయ్‌ను కోరాయి. ట్రాయ్‌ కొత్త అధిపతి పి.డి. వఘేలాతో జరిగిన ఇటీవలి సమావేశంలో డేటాకు సంబంధించిన ప్రాథమిక టారిఫ్‌లను నిర్ణయించే ప్రక్రియను వేగవంతం చేయాలనీ విజ్ఞప్తి చేసినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

* అమెరికన్‌ కన్సాలిడేట్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ హోల్డింగ్స్‌ ఛైర్మన్‌ పదవికి అక్టోబరు 19న పదవీ విరమణ చేసిన బొగ్గు దిగ్గజం రాబర్ట్‌ ముర్రే(80) ఆదివారం మరణించినట్లు ఆయన తరఫు న్యాయవాది ధ్రువీకరించారు.

* మారుతీ సుజుకీకి చెందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ బాలెనో మొత్తం అమ్మకాలు 8 లక్షలను అధిగమించాయి. ఈ మోడల్‌ 2015లో వచ్చింది.

* ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(ఐఆర్‌ఎఫ్‌సీ) పబ్లిక్‌ ఇష్యూకు రావడం కోసం ముసాయిదా పత్రాలను సెబీకి దరఖాస్తు చేసింది. ఇందులో భాగంగా 178 కోట్లకు పైగా షేర్లను ఆఫర్‌ చేయనుంది.

* బాసెల్‌-3 నిబంధనలను పాటించే బాండ్లను జారీ చేయడం ద్వారా రూ.5,000 కోట్ల నిధులను సమీకరించినట్లు సోమవారం ఎస్‌బీఐ తెలిపింది.