Business

మస్క్ మస్త్ మస్త్-వాణిజ్యం

Business News - Elon Musk Crosses Bill Gates

* సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్‌ మహీంద్రా.. మీరు తర్వాత విహారానికి ఎక్కడి వెళ్లాలనుకుంటున్నారో చెప్పండి అంటూ మంగళవారం ఓ ట్వీట్‌ చేశారు. విహారానికి ప్రసిద్ధి చెందిన న్యూజిలాండ్‌, మెక్సికో, కెనడాతోపాటు పలు దేశాల పేర్లను అందులో ఉంచారు. తర్వాత మీరు ఎక్కడి వెళ్లాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి అని అందులో పేర్కొన్నారు. పక్కనే ఓ పజిల్‌ను ఉంచి దాన్ని పరిష్కరించగా వచ్చిన సంఖ్య ఉన్న ప్రాంతానికి వెళ్లండి అంటూ పేర్కొన్నారు. దీంతో ఆసక్తి కనబర్చిన నెటిజన్లు సులువుగానే ఆ పజిల్‌ను పరిష్కరించారు. కానీ ప్రతి ఒక్కరికీ ఒకే సమాధానం రావడం గమనార్హం. ఆ సమాధానం వచ్చిన 9వ సంఖ్య విహార ప్రదేశాన్ని చూసిన నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. మొత్తం 15 సంఖ్యల్లో 14 పలు దేశాల పేర్లు సూచిస్తుండగా.. 9వ నంబరు అంకె మాత్రం ‘ఇంట్లోనే ఉండండి’ అని సూచిస్తోంది. విపత్కర పరిస్థితుల్లో విహారానికి ఎక్కడికీ వెళ్లొద్దనీ, ఇంట్లోనే క్షేమంగా ఉండాలన్నిది ఆనంద్‌ మహీంద్రా సూచన.

* ఎలన్‌ మస్క్‌ సంపద రోజురోజుకీ భారీగా పెరుగుతోంది. దీంతో సోమవారం ఆయన బ్లూమ్‌బెర్గ్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి ఎగబాకారు. ఆయన స్థాపించిన టెస్లా సంస్థ షేర్ల ధర భారీగా పెరగడమే ఇందుకు కారణం. ఈ ఏడాది మస్క్‌ సంపద 7.2 బిలియన్‌ డాలర్ల నుంచి ఏకంగా 127.9 బిలియన్‌ డాలర్లకు చేరింది. 500 మంది కుబేరులతో రూపొందించే ‘బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌’ ఎనిమిదేళ్ల చరిత్రలో ఒకే సంవత్సరం ఈ స్థాయిలో ఆర్జించిన వ్యక్తి ఇంకొకరు లేరు. జనవరిలో మస్క్‌ ర్యాంకు 35గా ఉండింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. నేటి ట్రేడింగ్‌లో సూచీలు జీవనకాల గరిష్ఠాలను నమోదు చేశాయి. నిఫ్టీ తొలిసారి 13,000 మార్కును దాటింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 446 పాయింట్లు లాభపడి 44,523 వద్ద స్థిర పడగా.. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 129 పాయింట్ల లాభంతో 13,055 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.99గా ఉంది.

* వచ్చే ఏడాది అత్యంత కీలక సాంకేతికతలుగా కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్, 5జీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌లు (ఐఓటీ) నిలుస్తాయని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీర్స్‌ (ఐఈఈఈ) సర్వే వెల్లడించింది. 2021లో అత్యంత ముఖ్యమైన సాంకేతికతలు, సాంకేతికతను అందిపుచ్చుకోవడంపై కొవిడ్‌-19 ప్రభావం, సాంకేతికత వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే రంగాలపై ఈ సర్వే నిర్వహించారు. అమెరికా, బ్రిటన్, చైనా, భారత్, బ్రెజిల్‌కు చెందిన చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్స్‌ (సీఐవో), ఛీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్స్‌ (సీటీవో)లు పాల్గొన్నారు.