Health

గుడ్డి ఎలుకకు తిరిగి కంటిచూపు అందించిన హార్వార్డ్ శాస్త్రవేత్తలు

గుడ్డి ఎలుకకు తిరిగి కంటిచూపు అందించిన హార్వార్డ్ శాస్త్రవేత్తలు

వృద్ధాప్యంతో వ‌చ్చే స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టే దిశ‌గా మ‌రో ముందడుగు ప‌డింది. హార్వ‌ర్డ్ మెడిక‌ల్ స్కూల్‌కు చెందిన సైంటిస్టులు ఓ అరుదైన ఘ‌న‌త సాధించారు. సంక్లిష్ట క‌ణ‌జాలాల బాహ్య‌జ‌న్యువుల‌ను రీప్రోగ్రామింగ్‌ చేయ‌డం ద్వారా చూపు కోల్పోయిన వృద్ధ ఎలుక‌ల్లో తిరిగి చూపు తెప్పించారు. వాటి క‌ళ్ల‌లోని రెటీనాలో వ‌య‌సు మ‌ళ్లిన క‌ణాల‌ను రీప్రోగ్రామింగ్ చేయ‌డంతో య‌వ్వ‌నంలో ఉన్న చూపు వాటికి తిరిగి వ‌చ్చిన‌ట్లు నేచ‌ర్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురిత‌మైన అధ్య‌య‌నం వెల్ల‌డించింది. శ‌రీరంలోని వివిధ అవ‌య‌వాల క‌ణజాలాల‌ను రిపేర్ చేయ‌డం ద్వారా మ‌నుషుల్లో వృద్ధాప్యానికి, వృద్ధాప్య సంబంధిత రోగాల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని ఈ అధ్య‌య‌నం తేల్చింది. ఇప్ప‌టికైతే క‌నీసం ఎలుక‌ల్లో అయినా సంక్లిష్ట క‌ణ‌జాలాన్ని రీప్రోగ్రామింగ్ చేయ‌డం ద్వారా వృద్ధాప్యాన్ని రివ‌ర్స్ చేయ‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని నిరూపిత‌మైంద‌ని హార్వ‌ర్డ్ మెడిక‌ల్ స్కూల్‌కు చెందిన ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ డేవిడ్ సింక్లెయిర్ అన్నారు. క్షీర‌దాల్లో రీసెట్ స్విచ్ ఒక‌టి ఉంటుంద‌ని, దీని వ‌ల్ల ఎన్నో వృద్ధాప్య సంబంధ స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించ‌వ‌చ్చ‌ని ఈ ప్ర‌యోగం నిరూపించింద‌ని ఆయ‌న చెప్పారు. మ‌నుషుల్లో వృద్ధాప్యంతోపాటు వ‌చ్చే గ్లూకోమాలాంటి రోగాల‌ను కూడా ఇలాగే న‌యం చేయ‌వ‌చ్చ‌ని సింక్లెయిర్ తెలిపారు. గ్లూకోమాలాంటి వ‌ల్ల చూపు కోల్పోయినా.. తిరిగి చూపు తెప్పించ‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని ఈ తాజా అధ్య‌య‌నం నిరూపించింది. ఈ ప్ర‌యోగంలో భాగంగా ఎలుక‌ల రెటీనాలోకి మూడు య‌వ్వ‌న ద‌శ‌ను తీసుకొచ్చే జ‌న్యువుల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ఆ మూడు జ‌న్యువుల పేర్లు Oct4, Sox2, Klf4. వీటి ద్వారానే ఆ ఎలుక‌ల్లో పోయిన చూపు తిరిగి వ‌చ్చింది.