Business

వ్యాక్సిన్ వార్తలతో సూచీల దూకుడు-వాణిజ్యం

వ్యాక్సిన్ వార్తలతో సూచీల దూకుడు-వాణిజ్యం

* ఐసీఐసీఐ బ్యాంకు మరో వినూత్న ఆవిష్కరణతో ముందుకొచ్చింది. తమ మొబైల్ చెల్లింపుల యాప్‌ కొత్త వెర్షన్‌ను ఆవిష్కరించింది. ఇతర బ్యాంకుల వినియోగదారులు సైతం ఈ యాప్‌ ద్వారా చెల్లింపులు, బ్యాంకింగ్‌ సేవలు పొందగలగడం విశేషం. ఈ మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌నకు ‘ఐమొబైల్‌ పే’ అని నామకరణం చేసింది ఆ సంస్థ.

* దేశీయ మార్కెట్ల లాభాల జోరు కొనసాగుతోంది. సరికొత్త గరిష్ఠాలను నెలకొల్పుతూ ముందుకు దూసుకెళుతున్నాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌లో సైతం సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ఫైనాన్షియల్‌, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ షేర్లు రాణించడంతో లాభాల్లో పయనించాయి. వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుందన్న వార్తలు మదుపరుల్లో ఉత్సాహం నింపడమే మార్కెట్ల దూకుడుకు కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలో సెన్సెక్స్‌, నిఫ్టీలు జీవనకాల గరిష్ఠాలను అందుకున్నాయి. నిఫ్టీ 13,350 ఎగువన ముగిసింది.

* కరోనావైరస్‌ వ్యాప్తి నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌ సమయంలో ప్రయాణాలు రద్దు కావడంతో ఆ సమయంలో బుక్‌ చేసుకున్న టికెట్ల సొమ్మును వాపస్‌ చేయనున్నట్లు ఇండిగో నేడు ప్రకటించింది. వచ్చేఏడాది జనవరి 31 నాటికి ఈ మొత్తాలను వాపస్‌ చేయడం పూర్తవుతుందని పేర్కొంది. ‘‘31 జనవరి 2021 నాటికి ప్రయాణికుల టికెట్ల సొమ్మును వాపస్‌ చేయడానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్నాం’’ అని ఇండిగో సీఈవో రోంజాయ్‌ డుట్టా పేర్కొన్నట్లు ఆంగ్ల వార్త సంస్థ పీటీఐ వెల్లడించింది.

* కొత్త సంవత్సరం నుంచి జాతీయ రహదారులపై జరిగే టోల్ చెల్లింపులను నగదు రహితం చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. జనవరి ఒకటి నుంచి టోల్‌ గేట్ల వద్ద 100 శాతం వసూళ్లను ఫాస్టాగ్‌ ద్వారానే నిర్వహించేలా చూస్తోంది. ప్రస్తుతం టోల్ చెల్లింపుల్లో దాదాపు 75 శాతం ఫాస్టాగ్స్‌ ద్వారా జరుగుతున్నాయి. కాగా, ఒక వరసలో మాత్రమే నగదు రూపంలో చెల్లింపులకు అనుమతి ఉంది.

* ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్టు అమెరికాలో ఐపీవోకు వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 10 బిలియన్‌ డాలర్లను సమీకరించాలనే లక్ష్యంతో వాల్‌మార్ట్‌ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే గోల్డ్‌మన్‌ సాక్స్‌ సంస్థను ఈ వ్యవహరాలను చూసేందుకు నియమించుకొంది. ఫ్లిప్‌కార్ట్‌లో 25శాతం వాటాలను విక్రయించ వచ్చని భావిస్తున్నారు.

* దేశవ్యాప్తంగా పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా ఏడో రోజూ చమురు సంస్థలు పెట్రోల్‌, డీజిల్‌ ధరల్ని పెంచాయి. సోమవారం లీటర్‌ పెట్రోలుపై 30 పైసలు, డీజిల్‌పై 26 పైసలు పెరిగాయి. దేశ రాజధానిలో లీటరు పెట్రోల్‌ ధర రూ.83.77, డీజిల్ రూ.73.93గా ఉంది. బ్యారెల్ ముడి చమురు అంతర్జాతీయ మార్కెట్‌లో 49.07 డాలర్లుగా కొనసాగుతోంది. అంతర్జాతీయ విపణిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా దేశీయ ధరల్లో కూడా పెరుగుదల ఉన్నట్లు చమురు ఉత్పత్తి సంస్థలు వెల్లడించాయి.