Business

మహీంద్రా వాటాల విక్రయం-వాణిజ్యం

Business News - Mahindra To Sell Its Shares In Korean Company

* అక్రమంగా పాన్‌ మసాలా తయారు చేయటమే కాకుండా.. ఏకంగా ఎనిమిది వందల కోట్లకు పైగా పన్నులు ఎగవేసిన ఓ సంస్థ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్టు కేంద్ర వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) శాఖ అధికారులు తెలిపారు. అధికారిక అనుమతులు, రిజిస్ట్రేషన్‌ వంటివేవీ లేకుండానే సదరు సంస్థ గుట్కా, పాన్‌ మసాలా వంటి ఉత్పత్తులను తయారు చేసి.. వివిధ రాష్ట్రాలకు రహస్యంగా సరఫరా సాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

* దేశీయ కార్ల తయారీ దిగ్గజం మహీంద్రా సంస్థ దక్షిణ కొరియాకు చెందిన స్సాన్గ్‌ యాంగ్‌లో కీలక వాటాలను విక్రయించే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ కంపెనీలో మహీంద్రాకు 74.65శాతం వాటాలున్నాయి. వాటిని హెచ్‌ఏఏహెచ్‌ ఆటోమోటీవ్‌ హోల్డింగ్స్‌ కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే, దీన్ని మహీంద్రా మాత్రం ధ్రువీకరించలేదు. దీనిపై మహీంద్రా ఎండీ పవన్‌ గోయంక స్పందిస్తూ ‘‘ మేము ఒక పెట్టుబడిదారుతో చర్చలు జరుపుతున్నాం. పలు కారణాల వల్ల ఆ పేరును నేను వెల్లడించలేను. కాకపోతే, ఈ డీల్‌ను ఫిబ్రవరి 28 నాటికి ముగించే అవకాశం ఉంది’’ అని పేర్కొన్నారు.

* సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌కు చెందిన కొవిడ్‌-19 టీకాలైన కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌కు డీసీజీఐ (భారత్‌ ఔషధ నియంత్రణ మండలి)లోని సబ్జెక్టు నిపుణుల కమిటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వటంతో ఈ రెండు టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ టీకాలకు ఇక డీసీజీఐ తుది అనుమతి ఇవ్వటమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఇతర కంపెనీల టీకాలు ఏ దశలో ఉన్నాయి, ఎప్పటికి రావచ్చు…అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా మారింది.

* కరోనా సంక్షోభ పరిణామాలతో పెట్టుబడి ప్రణాళికలను కంపెనీలు వాయిదా వేయడం లేదా రద్దు చేసుకుంటున్నట్లు కొత్త ప్రాజెక్టుల గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. ప్లాంట్ల నిర్మాణం, భవనాలు-ఇతర ఆస్తుల కోసం కంపెనీలు వెచ్చించే మొత్తాలు 2019 డిసెంబరులో రూ.7.01 లక్షల కోట్లుగా నమోదు కాగా.. డిసెంబరు 2020 త్రైమాసికంలో ఇవి ఏకంగా 88.6 శాతం తగ్గి రూ.80,000 కోట్లకు పరిమితిమయ్యాయని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ(సీఎమ్‌ఐఈ) పేర్కొంది. తయారీ ప్లాంట్ల వంటి కొత్త ఆస్తులపై ఖర్చుపెట్టే నగదును మూలధన వ్యయాలంటారన్న సంగతి తెలిసిందే. కంపెనీలు తమ ప్రస్తుత సామర్థ్యం సరిపోదని భావించినపుడు అదనపు తయారీ లేదా ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేసేందుకు పెట్టుబడులు పెడతాయి. 2020-21 తొలి త్రైమాసికంలో కరోనా వ్యాప్తి మొదలు కావడంతో సామర్థ్య వినియోగం 50 శాతం కంటే తక్కువకు చేరిందని ఆర్‌బీఐ సమాచారం వెల్లడిస్తోంది. ఇక అంతక్రితం త్రైమాసికం ఇది 69.9 శాతంగా ఉంది. పూర్తయిన ప్రాజెక్టుల విషయానికొస్తే అవి 74.3 శాతం తగ్గి రూ.43,000 కోట్లకు చేరుకోగా.. నిలిచిపోయిన ప్రాజెక్టులు 52.5 శాతానికి డీలా పడి రూ.29,000 కోట్లకు; తిరిగి మొదలైన ప్రాజెక్టులు 90.2 శాతం తగ్గి రూ.8,000 కోట్లకు పరిమితమయ్యాయి.

* డిసెంబరు 202లో 6.03 కోట్ల జీఎస్‌టీ ఇన్‌వాయిస్‌లు జారీ కావడం విశేసం. నవంబరులో జనరేట్‌ అయిన 5.89 కోట్లతో పోలిస్తే ఇవి ఎక్కువని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తన రుణ పరిమితిని రూ.90,000 కోట్ల నుంచి రూ.1.18 లక్షల కోట్లకు పెంచినట్లు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎఫ్‌సీ) తెలిపింది. ఈ నిర్ణయాన్ని కంపెనీ బోర్డు తీసుకుంది.

* 4జీ టెండర్‌లో దేశీయ తయారీదార్లు పాల్గొనడానికి ముందు భారత టెలికాం సామగ్రి నాణ్యతను పరీక్షించనున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. రూ.9300 కోట్ల విలువైన 4జీ టెండర్‌ను మార్చిలో బీఎస్‌ఎన్‌ఎల్‌ జారీ చేసినప్పటికీ.. తర్వాత రద్దు చేసింది.

* కంపెనీ అమ్మకాలు డిసెంబరు 2020లో 17.5 శాతం వృద్ధితో 2,72,084కు చేరినట్లు టీవీఎస్‌ మోటార్‌ వెల్లడించింది. డిసెంబరు 2019లో ఈ కంపెనీ 2,31,571 వాహనాలను విక్రయించింది.