Business

నెదర్ల్యాండ్స్ ద్వారా పన్ను ఎగ్గొట్టి…ఇండియాకు టెస్లా-వాణిజ్యం

Musk Brings Tesla To India via Netherlands

* ఎలన్ మస్క్‌లోని వ్యాపారి ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటాడు. ప్రతి రూపాయి లెక్క అన్నట్లు వ్యవహరిస్తాడు. అందుకే భారత్‌లో తన వ్యాపారానికి అవసరమైన పెట్టుబడి ఎటునుంచి వస్తే లాభమో లెక్కలేసుకొని.. నెదర్లాండ్స్‌ను ఎంచుకొన్నాడు. ఇటీవల భారత్‌లో మస్క్‌ రిజిస్టర్‌ చేసిన టెస్లామోటార్స్‌ అండ్‌ ఎనర్జీ ఇండియాకు నెదర్లాండ్స్‌లోని టెస్లా మోటార్స్‌ నెదర్లాండ్స్‌ మాతృసంస్థగా వ్యవహరించనుంది. ఈ నిర్ణయంతో మస్క్‌కు భారత్‌లో మూలధనంపై వచ్చే లాభాలు, డివిడెండ్‌ చెల్లింపుల్లో భారీగా పన్ను రాయితీలు లభించనున్నాయి.

* చైనాలో పుట్టి ప్రపంచదేశాలకు విస్తరించిన కరోనా మహమ్మారి ప్రతిచోటా కల్లోలం సృష్టించింది. అనేక రంగాలను ఛిన్నాభిన్నం చేసింది. అన్ని దేశాల వృద్ధిరేటుపై గట్టిదెబ్బ కొట్టింది. కరోనా కారణంగా ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. అయితే, ఇలాంటి సమయంలో మహమ్మారి పుట్టినిల్లయిన చైనా ఆర్థిక వ్యవస్థ మాత్రం పుంజుకోవడం గమనార్హం. 2020లో ఆ దేశ జీడీపీ 2.3శాతం పెరిగింది. ఈ మేరకు చైనా నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌(ఎన్‌బీఎస్‌) సోమవారం డేటా విడుదల చేసింది.ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ అయిన చైనా జీడీపీ 2020లో 2.3శాతం పెరిగి 13.42 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. ఆ దేశ కరెన్సీ ప్రకారం.. ఈ విలువ 101.5986 ట్రిలియన్‌ యువాన్లు. కరోనా వైరస్‌ వెలుగుచూసిన తర్వాత చైనా ఆర్థిక వ్యవస్థ కూడా పతనమైంది. అయితే, ఈ ప్రభావం నుంచి డ్రాగన్‌ వేగంగా కోలుకుంది. లాక్‌డౌన్‌ కారణంగా 2020 తొలి త్రైమాసికంలో ఆ దేశ జీడీపీ 6.8శాతం కుంగింది. కానీ, రెండో త్రైమాసికానికి వచ్చేసరికి మళ్లీ గాడినపడింది. అదే సమయంలో కరోనా ప్రపంచమంతా పాకి మహమ్మారిగా మారింది.భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రధాన ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలవుతున్న సమయంలో చైనా స్థిరంగా కోలుకుంది. మూడో త్రైమాసికంలో జీడీపీ 4.9శాతం, నాలుగో త్రైమాసికంలో 6.5శాతం వృద్ధిచెందడం గమనార్హం. తయారీ, ఎగుమతులు కూడా పెరిగాయి. ఆ దేశ ఉద్యోగ మార్కెట్‌ కూడా మెరుగుపడింది. గతేడాది చైనాలోని పట్టణ ప్రాంతాల్లో 11.86 మిలియన్ల కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది. 2020లో ఆర్థిక వృద్ధి సాధించిన ఏకైక ప్రధాన ఆర్థిక వ్యవస్థ చైనానే అని ఎన్‌బీఎస్‌ హెడ్‌ నింగ్‌ జిజే అన్నారు.

* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తమ‌ వినియోగదారులకు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. ఇక‌ నగదును కూడా డోర్ డెప్ డెలివరీ సేవల కింద జారీచేయ‌నుంది. ఈ సౌకర్యంతో వినియోగదారులు వారి ఇంటి వద్ద బ్యాంకింగ్ సేవల సౌలభ్యాన్ని పొంద‌వ‌చ్చు. మీ బ్యాంక్ ఇప్పుడు మీ ఇంటి వద్ద ఉంది. ఈ రోజు డోర్స్టాప్ బ్యాంకింగ్ కోసం నమోదు చేయండి! మరింత తెలుసుకోవడానికి: https://t.co/m4Od9LofF6 టోల్ ఫ్రీ నం. 1800 1037 188 లేదా 1800 1213 721 కి కాల్ చేయండి, అని ఎస్‌బీఐ తెలిపింది.

* దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు డీలాపడ్డాయి. సెన్సెక్స్‌ దాదాపు 500 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 14,300 దిగువన ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.28గా ఉంది.

* దేశీయ మర్కెట్‌ సూచీలు సోమవారం భారీగా పతనమయ్యాయి. ఊగిసలాట ధోరణిలో ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు.. సమయం గడిచేకొద్దీ నష్టాల్లోకి జారుకొన్నాయి. ఉదయం 11.40 సమయంలో సెన్సెక్స్‌ 409 పాయింట్లు పతనమై 48,625 వద్ద, నిఫ్టీ 144 పాయింట్లు పతనమై 14,289 వద్ద ట్రేడవుతున్నాయి. కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌, ఎనర్జీ రంగాలు తప్ప మిగిలిన సూచీలు మొత్తం నష్టాల్లోనే ఉండటం విశేషం. న్యూలాండ్‌ లేబరేటరీ, ఇండియన్‌ ఎనర్జీ, టాటా ఎలిక్సీ, బజాజ్‌ హిందూస్థాన్‌ షుగర్స్‌, మజెస్కో షేర్లు లాభాల్లో ఉండగా.. రామ్‌కో ఇండస్ట్రీస్‌, మాస్టెక్‌, ఎంఎస్‌టీసీ, టాటా స్టీల్‌ లాంగ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

* దేశంలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. వాహనదారుల జేబులు గుల్లవుతున్నాయి. సోమవారం పెట్రోల్‌ ధర లీటర్‌పై 25 పైసలు, డీజిల్‌ ధర 25 పైసలు చొప్పున పెరిగింది. దీంతో ఇంధన ధరలు కొత్త గరిష్ఠానికి చేరుకున్నాయి. తాజా పెంపుతో దేశ రాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.84.95కు చేరింది. డీజిల్‌ ధర రూ.75.13గా ఉంది. దేశీయ అతిపెద్ద ఇంధన రిటైల్‌ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ధరల ప్రకారం.. పెట్రోల్‌ ధర ముంబయిలో అత్యధికంగా రూ.91.56గా ఉంది. చెన్నైలో రూ.87.63, కోల్‌కతాలో రూ.86.39కి చేరింది. ఇక డీజిల్‌ ధర ముంబయిలో రూ.81.87, చెన్నైలో రూ.80.43, కోల్‌కతాలో రూ.78.72గా ఉంది.