Politics

భాజపాకు ఓటు వేయొద్దంటున్న రైతులు-తాజావార్తలు

Farmers Request Not To Vote For BJP - News Roundup

* బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు ఓటు వెయొద్దని 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్​ మోర్చా(ఎస్​కేఎమ్​) ఆ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసింది.”మేం ఏ పార్టీకి మద్దతు పలకడం లేదు. ఎవరికి ఓటు వేయాలో చెప్పడం లేదు. భాజపాకు గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాం” అని ఎస్​కేఎమ్​ నేత యోగేంద్ర యాదవ్​ అన్నారు.బంగాల్​లో కాషాయ పార్టీని ఓడించండంటూ సంయుక్త కిసాన్​ మోర్చా(ఎస్​కేఎమ్​) పత్రికా ప్రకటనను సైతం విడుదల చేసింది.అప్పుడే రైతలు డిమాండ్లకు తలొగ్గి, సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని పేర్కొంది.మరోవైపు శని, ఆదివారాల్లో కిసాన్​ మహా పంచాయత్​ పేరుతో.. రైతు సంఘాల నాయకులు రాకేశ్​ సింగ్ టికాయిత్​, యుధ్​వీర్​ సింగ్​లు.. బంగాల్​లోని భవానీపుర్​, నందిగ్రామ్​, సింగూరు, అసన్​సోల్​లో జరిగే సభల్లో పాల్గొననున్నారు.

* ఈ నెల 14 ఆదివారం జరిగే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల శాసనమండలి స్థానానికి జరిగే ఎన్నిక సజావుగా జరగాలని ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష అన్నారు. శనివారం వనపర్తిలోని ఆర్డీవో కార్యాలయ ఆవరణలో ఎన్నికల సామాగ్రి పంపిణీ లో కలెక్టర్ పరిశీలించి ఎన్నికల సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 31 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, 31 మంది పీవోలు, 31 మంది ఏపీవో లు, 62 మంది ఓ పి వో లు, 17మంది మైక్రో అబ్జర్వర్లు పని చేస్తారని తెలిపారు. ముప్పై ఒక్క పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ జరుగుతుందని, 31 మంది బూత్లెవల్ అధికారులు పాల్గొంటారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 21,458 మంది పట్టభద్ర ఓటర్లు ఉన్నారని తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్ ను సానిటైజ్ చేయించడం జరిగింది అని, శానిటైజర్, మాస్కులు, సబ్బు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు జరపాలని ఆదేశించారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం కు తరలించాలని బాక్సు తరలించే వాహనం కదలికలకు ఒక యాప్ ను ఏర్పాటు చేసిందని సెక్టోరియల్, జోనల్ అధికారులు ఈ యాప్ ద్వారా వాహనం కదలికలు తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఆర్టిఓ తాసిల్దార్లు,డిఆర్డీఓ,సిబ్బంది పాల్గొన్నారు.

* ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీట్లు పెరిగాయి. ఈ కోర్సులను నిర్వహిస్తున్న యూనివర్సిటీ, ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ ప్రొఫెషనల్‌ ఇన్‌స్టిట్యూట్లలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి అనుమతుల పొడిగింపు, సీట్ల సంఖ్య పెంపు, అదనపు కోర్సుల ప్రవేశానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2020-21 విద్యా సంవత్సరంలో ఎంబీఏలో 480 సీట్లు, ఎంసీఏలో 180 సీట్లు అదనంగా భర్తీ చేయనున్నారు. ఈ రెండు కోర్సుల్లో కలిపి అదనంగా 660 సీట్ల భర్తీకి అనుమతి లభించింది. జనవరి 19న జారీ చేసిన జీవో నెం. 8 ప్రకారం రాష్ట్రంలోని 5 ఎంబీఏ కాలేజీల్లో 240 సీట్ల భర్తీకి అనుమతి లభించగా, ఇప్పుడు వాటి సంఖ్య 720కి పెరిగింది. అలాగే జనవరి 19న జారీ చేసిన జీవో నెం. 7 ప్రకారం రాష్ట్రంలోని 3 ఎంసీఏ కాలేజీల్లో 180 సీట్ల భర్తీకి అనుమతి లభించగా, ఇప్పుడు వాటి సంఖ్య 360కి పెరిగింది.

* ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ రెండు స్థానాల నుంచి 30 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

* భారత్​లో కరోనా తీవ్రత పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 24,882 కొత్త కేసులు వెలుగుచూశాయి.మొత్తం మరణాల సంఖ్య లక్షా 58 వేల 446కు చేరింది.మొత్తం కేసులు: 1,13,33,728.మొత్తం మరణాలు: 1,58,446.కోలుకున్నవారు: 1,09,73,260.యాక్టివ్​ కేసులు: 2,02,022.దేశంలో ఇప్పటివరకు 2 కోట్ల 82 లక్షలకుపైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.

* మూడు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ నేడు​ ఉత్తర్​ప్రదేశ్​కు చేరుకోనున్నారు. పర్యటనలో భాగంగా మొదట కాశీలో పర్యటించనున్నారు.సాయంత్రం 4 గంటలకు కుటుంబ సమేతంగా కాశీకి చేరుకుని గంగా నది ఒడ్డున పూజలు నిర్వహిస్తారు. అనంతరం స్థానిక విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకుంటారు.ఈ పర్యటనలో కోవింద్.. వివిధ ప్రాంతాలను సందర్శించనున్నారు. ఇది రాష్ట్రపతి వ్యక్తిగత పర్యటన కావడం గమనార్హం.రాష్ట్రపతి రాక నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.గంగా ఘాట్​ సహా సమీప ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.కరోనా దృష్ట్యా గంగా హారతి నిర్వహించే అర్చకులతో పాటు 40 మందికి పైగా సిబ్బందికి కొవిడ్​ పరీక్షలు నిర్వహించారు.

* శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్, మాజీ మంత్రులు గంటా శ్రీనివాస రావు, మాజీ మంత్రి నారాయణ.. స్వామివారి సేవలో పాల్గొన్నారు.దర్శనానంతరం ఆలయ అర్చకులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

* తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజున ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం సహా పలువురు స్వత్రంత అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరిలో పద్మరాజన్‌(62) కూడా ఉన్నారు. ప్రత్యేకంగా ఈయన పేరే ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే.. రాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లో నామినేషన్‌ వేయడం ద్వారా ఆయన ‘తేర్దల్‌ మన్నన్‌ ’(ఎన్నికల రాజు)గా పేరుగాంచారు. ఇక ఏప్రిల్‌ 6న శాసన సభ ఎన్నికలు జరుగనున్న తరుణంలో మేట్టూరు నియోజకవర్గం నుంచి స్వతంత్రపద అభ్యర్దిగా నామినేషన్‌ వేశారు. కాగా 8వ తరగతి మాత్రమే చదువుకున్న పద్మరాజన్‌ సహకార సంఘాల ఎన్నికల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు నామినేషన్లు వేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. తన ఇంటికి టెలిఫోన్‌ సౌకర్యం కోసం 1988లో తొలిసారిగా మేట్టూరు అసెంబ్లీ స్థానానికి నామినేషన్‌ వేశారు. గిన్నీస్‌బుక్‌లో స్థానం కోసం ఆ తరువాత నుంచి అన్ని ఎన్నికల్లో నామినేషన్లు వేయడం కొనసాగించారు. ప్రధాని, ముఖ్యమంత్రి, అగ్రనేతలు పోటీచేసే స్థానాల్లో నామినేషన్లు వేయడం ద్వారా గుర్తింపు పొందారు. డిపాజిట్టుకు సొమ్ములేని పక్షంలో భార్య నగలు కుదువ పెడతాడు.