Business

“బిగ్ బుల్” రాకేష్ ఝున్‌ఝున్‌వాలా రహస్యం ఇదే-వాణిజ్యం

Business News - Rakesh JhunJhunWala Speaks Of His Strategy

* ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణపై పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి కీలక వ్యాఖ్యలు చేశారు. సంస్థలో ప్రభుత్వ వాటాను ఉపసంహరించుకొని ప్రైవేటీకరించడం? లేదా పూర్తిగా మూసివేయడం?తప్ప వేరే మార్గమే లేదన్నారు. ప్రైవేటీకరించడమా?లేక ప్రైవేటీకరించకపోవడమా?అన్న ప్రత్యామ్నాయాలు కేంద్ర ప్రభుత్వం ముందు లేనేలేవన్నారు. ఎయిరిండియాకు రోజూ రూ.20 కోట్ల చొప్పున నష్టం వస్తోందన్నారు. ఇప్పటికే రూ.60,000 కోట్ల మేర రుణాలు పేరుకుపోయాయన్నారు. కొత్త యాజమాన్యం రాక తప్పదని స్పష్టం చేశారు.

* స్టాక్‌ మార్కెట్లో నమోదిత కంపెనీల్లో తనకు ఉన్న వాటాల కంటే నమోదు కాని కంపెనీల్లోని వాటాలే అధిక లాభాలను తెచ్చిపెట్టాయని భారత షేర్‌ మార్కెట్‌ ‘బిగ్‌ బుల్‌’గా పేరుగాంచిన రాకేశ్‌ ఝన్‌ఝున్‌వాలా తెలిపారు. కొన్ని కంపెనీల్లో 10-12 ఏళ్ల నుంచి తన వాటాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈక్విటీ మార్కెట్ల ఆర్జనపై ప్రభుత్వం విధిస్తున్న పన్నులు ఆమోదయోగ్యంగానే ఉన్నాయని స్పష్టం చేశారు. ‘జన స్మాల్‌ ఫైనాన్స్‌’ వార్షికోత్సవం సందర్భంగా శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

* భారత్‌లో డిజిటల్‌ రంగంలో సేవలు అందించే విదేశీ సంస్థలపై ప్రభుత్వం విధిస్తున్న ‘ఈక్వలైజేషన్‌ లెవీ’కి ప్రతీకారంగా వాణిజ్యపరమైన చర్యలు తీసుకునే దిశగా అమెరికా సాగుతోంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం.. దీనిపై తమ అభిప్రాయాలు తెలపాలంటూ ప్రజలను కోరింది. భారత్‌తో పాటు టర్కీ, ఇటలీ, యూకే, స్పెయిన్‌, ఆస్ట్రియాపైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

* ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) ప్రైవేటీకరణ దిశగా మరో అడుగు ముందడుగు వేసింది. అసోంలోని నుమాలీగఢ్‌ రిఫైనరీ (ఎన్‌ఆర్‌ఎల్‌) నుంచి బీపీసీఎల్‌ పూర్తిగా వైదొలిగినట్లు ప్రకటించింది. ఎన్‌ఆర్‌ఎల్‌లో తనకున్న 61.65 శాతం వాటాను అస్సాం ప్రభుత్వం, ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌(ఓఐఎల్‌), ఇంజినీర్స్‌ ఇండియా కన్సార్షియానికి విక్రయించినట్లు పేర్కొంది. ఈ ఒప్పంద విలువ సుమారు రూ. 9,876 కోట్లుగా వెల్లడించింది.