Health

మనుషుల్లో కూడా విషం తయారీ వ్యవస్థ

మనుషుల్లో కూడా విషం తయారీ వ్యవస్థ

‘ఖలున నిలువెల్ల విషము గదరా సుమతీ’.. అని అప్పుడెప్పుడో సుమతీ శతకకారుడు చెప్పాడు! చెడ్డవాడికి ఒళ్లంతా విషమే ఉంటుందన్నది ఆయన లెక్క. కానీ.. మంచివారు, చెడ్డవారు అనే తేడా లేకుండా మనుషులందరిలోనూ అచ్చం పాముల్లోలాగానే విషం తయారు చేసుకోగల యంత్రాంగం(టూల్‌కిట్‌) ఒకటి ఉంటుందని ఒకినావా ఇన్‌స్టిట్యూట్‌(జపాన్‌), ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది! మనుషుల్లోనే కాదు.. క్షీరదాలన్నింటిలోనూ.. అంటే పిల్లలకు పాలిచ్చి పెంచే జీవులన్నింటిలోనూ ‘విష వ్యవస్థ’ ఉంటుందని వారు చెబుతున్నారు. మన నోట్లో ఉండే లాలాజల గ్రం ధులకు, పాముల్లో ఉండే విషగ్రంధులకు మధ్య కొంత సంబంధం ఉందని వివరించారు. ‘తైవాన్‌ హబు’ పాముల విష గ్రంధుల్లోనూ.. మనుషుల లాలాజల గ్రంధుల్లోనూ కామన్‌గా ఉండే జన్యువులను పరిశీలించారు. ఆ పాముల్లోని 3000 జన్యువులు.. కాలిక్రియెన్స్‌ అనే ప్రొటీన్లను ఉత్పత్తు చేస్తున్నట్టు గుర్తించారు. పాము ఒత్తిడికి గురైనప్పుడు ఈ కాలిక్రియెన్‌ ప్రొటీన్లు ఉత్పత్తి అవుతాయి. విషం తయారీకి కావాల్సిన ప్రాథమిక ప్రొటీన్‌ ఇది.