Food

నిమ్మకాయ తినండి…నిశ్చింతగా ఉండండి

Eat Lemon - Stay Healthy - Telugu Food And DIet News

నిమ్మకాయ పచ్చడి, నిమ్మకాయ పులిహోర, నిమ్మకాయ పప్పు, నిమ్మకాయ చారు… నిమ్మ పడితే ఆ వంటకాలకు అమ్మ చేతి ముద్దంత కమ్మదనం రావడం ఎంత నిజమో అది ఆరోగ్యానికి దివ్య ఔషధం అన్నదీ అంతే నిజం. ఇక, ఈ కాయ కాని కాయ… పండు కాని పండులోని రకాలన్నిటినీ ఓ చోట చేర్చితే కనులకు పండుగే. నిమ్మలో ఉన్న ఆకర్షణీయమైన రంగులూ వెరైటీలూ అన్నీ ఇన్నీ కావు మరి.
**వందల ఏళ్ల కిందటి మాట… ‘సెవెన్‌ ఇయర్స్‌ వార్‌’ జరుగుతోంది. బ్రిటన్‌కి చెందిన ‘ద రాయల్‌ నేవీ’ సైన్యం నౌకల్లో బయలుదేరింది. ఎదురొచ్చిన శత్రుసైన్యాల్ని ఎంతో చాకచక్యంగా మట్టుపెడుతూ ముందుకు కదులుతోంది. శత్రువుల వల్ల బ్రిటిష్‌ సైన్యానికి ఎలాంటి హానీ జరగలేదు. కానీ ఆ యుద్ధం సమయంలో 1.84 లక్షల మందితో వెళ్లిన నౌకలో చివరికి ప్రాణాలతో మిగిలింది యాభైవేలమందే. మిగిలినవారందరూ ఏమయ్యారంటే… స్కర్వీ వ్యాధికి బలయ్యారు. అంత ప్రమాదకరమైన ఆ రోగానికి మందేంటని ఐరోపా దేశాల వైద్యులు ప్రయోగాలు చేయగా చేయగా తెలిసిందేంటంటే… సి-విటమిన్‌ లోపం వల్ల వచ్చే ఆ వ్యాధికి నిమ్మకాయే మందు అని. ఆయుర్వేదానికి పుట్టినిల్లు అయిన భారతదేశమే దాని జన్మస్థలం అనీ. అప్పట్నుంచే పాశ్చాత్య దేశాల్లో నిమ్మసాగు మొదలైంది.
***శీతాకాలంలో వేడి వేడి అన్నంలో నిమ్మకాయ పచ్చడి కలుపుకుని తింటుంటే ఎంత రుచిగా ఉంటుందో. జ్వరం వచ్చినపుడు కూడా నోటికి బాగుంటుందని ఆ పచ్చడితోనే అన్నం తినమంటారు. వేసవిలో తడారిపోయిన నోటికి
చల్లటి నిమ్మ షర్బత్‌ని అందిస్తే ప్రాణం లేచొచ్చినట్లే ఉంటుంది. ఇక, వర్షాకాలంలో వేడివేడి మిర్చీ బజ్జీల మీద ఉల్లిపాయ ముక్కలూ నిమ్మరసం వేసుకుని తింటే ఆ మజానే వేరు… ఇలా మనం నిమ్మకాయను రుచి పరంగానే చూసి తెగ వర్ణించేసుకుంటుంటాం. కానీ పూర్వీకులు మన సంప్రదాయ వంటకాలూ పానీయాల్లో నిమ్మకు అంత ప్రత్యేక స్థానం ఇవ్వడానికి మరో కారణం దాన్లోని ఔషధ గుణాలే. నిమ్మలోని సి-విటమిన్‌ వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఎన్నో రోగాలు రాకుండా అడ్డుకుంటుంది. జ్వరం వచ్చినపుడూ, జలుబూ దగ్గులాంటివి ఎక్కువ వచ్చే చలికాలంలోనూ నిమ్మకాయ పచ్చడి తినడం వెనుక అసలు ఉద్దేశం అదే. నిమ్మ జీర్ణ సమస్యలకూ చక్కని మందు. అందుకే, చికెన్‌ మటన్‌లు వండేటపుడూ అందులో కాస్త నిమ్మరసాన్ని పిండుతారు. సాఫ్ట్‌ డ్రింకులూ చాకొలెట్లలాంటివాటిలోనూ నిమ్మకాయల వాడకం ఎక్కువే. బేకరీ ఉత్పత్తుల్లోనూ నిమ్మ తొక్కల పొడిని ఉపయోగిస్తారు. నిమ్మరసం కలిపి చేసే లెమన్‌ టీతో పాటు నిమ్మ ఆకులతో కూడా టీని తయారుచేస్తారు.
***ఎన్నో రకాలు…
మనకు పసుపూ ఆకుపచ్చ రంగులో గుండ్రంగా ఉండే నిమ్మకాయలే సుపరిచితం. కానీ నిమ్మ జాతుల్ని నారింజ, ఇతర సిట్రస్‌ జాతులతో సంకరీకరించి రూపొందించిన హైబ్రిడ్‌ నిమ్మరకాలు అన్నీ ఇన్నీ కావు. ఆస్ట్రేలియాలో పండే ఫింగర్‌ లైమ్‌లైతే పైకి చిన్నసైజు కీరా దోసల్లా ఉంటాయి. కెవియర్‌ ఆఫ్‌ సిట్రస్‌గా పేరు పొందిన ఈ జాతి కాయల లోపలి ముత్యాలు ఎరుపు, ఆకుపచ్చ, ఊదా, గులాబీ రంగులతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. తియ్యగా ఉండే ఈ నిమ్మను ఎక్కువగా పానీయాలూ, వంటకాలను అలంకరించేందుకు ఉపయోగిస్తారు. గులాబ్‌ జామూన్‌లలా నిగనిగలాడే బ్లడ్‌ లైమ్‌లనైతే అందంకోసం కూడా పెంచుతున్నారు. ఇక, పైన చారలు చారలుగా ఉండి లోపల గులాబీ రంగులో ఉండే వారిగేటెడ్‌ పింక్‌ లెమన్‌ యురేకా, పైన బొడిపె వచ్చే సిట్రన్‌ బెల్డి, మెదడులోని నరాలను పోలినట్లూ ఉండే కాఫిర్‌ లైమ్‌, పైన నారింజ రంగులో ఉండే మేయర్‌, పచ్చిగా ఉన్నపుడు లోపల నారింజ రంగులో ఉండి పండే సరికి తొక్క కూడా నారింజ వర్ణంలోకి మారే రంగ్‌పూర్‌ నిమ్మలతో పాటు ఆస్ట్రేలియన్‌ డిజర్ట్‌, కీ, మస్క్‌, వైల్డ్‌, స్పానిష్‌, లిమెక్వెట్‌… ఇలా నిమ్మలో రకాలెన్నో. వీటిలో ఒక్కోటీ ఒక్కో రూపంలో ఉండడంతో పాటు రుచిలోనూ మామూలు నిమ్మకాయలకు భిన్నంగా ఉంటాయి. కొన్నైతే పులుపు తక్కువగా ఉండి నారింజ పండ్లలా తినేందుకూ బాగుంటాయి.
**నిమ్మ చేసే మేలెంతో..
రోజూ ఉదయం ఓ గ్లాసు వేడినీళ్లలో స్పూను నిమ్మరసం కలిపి తాగితే జలుబు, దగ్గుతో పాటు రకరకాల ఫ్లూ వ్యాధులను నివారించగలిగే వ్యాధి నిరోధక శక్తినిస్తుంది.
* పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల నిమ్మను ఆహారంలో భాగంగా చేసుకునేవారికి ఆకలి తగ్గి అతిగా తినడం మానేస్తారట. అందుకే, రోజూ నిమ్మరసాన్ని తీసుకునేవాళ్లు త్వరగా బరువు తగ్గుతారని
పరిశోధనలు చెబుతున్నాయి.
* నిమ్మకాయల్లో పొటాషియం నిల్వలు కూడా ఎక్కువే. ఇది రక్తపోటుని కూడా అదుపులోకి తెస్తుంది. రక్తంలో పొటాషియం తగ్గడం వల్ల డిప్రెషన్‌, ఆందోళన, మతిమరుపు లాంటి సమస్యలు కూడా వస్తాయి. రోజూ తగినంత నిమ్మరసాన్ని తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
నిమ్మలోని సి-విటమిన్‌కు శరీరాన్ని ఉత్తేజపరిచే లక్షణం కూడా ఉంది.
* శరీరంలో ఉండే వ్యర్థాలను బయటికి పంపించేందుకు నిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్లు బాగా పనిచేస్తాయి.
* గొంతు సంబంధ ఇన్ఫెక్షన్లనీ టాన్సిలైటిస్‌నీ తగ్గించే యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఇందులో ఎక్కువ. నీళ్లలో నిమ్మరసం కలిపి పుక్కిలిస్తే గొంతునొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు.
***సౌందర్య పోషణకు…
సహజమైన యాంటీసెప్టిక్‌గా పనిచేసే నిమ్మరసం చర్మ సమస్యల్ని తగ్గిస్తుంది. దీన్లోని విటమిన్‌-సి ముడతల్నీ నల్లమచ్చల్నీ తొలగిస్తుంది. వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వదు. కాలిన మచ్చల మీద
నిమ్మరసం పూస్తే అవి క్రమంగా పోతాయి. బ్లాక్‌హెడ్స్‌కి కూడా నిమ్మకాయ చక్కని ఔషధం.
* నిమ్మ చర్మాన్ని కాంతిమంతంగా చేసేందుకూ బాగా ఉపయోగపడుతుంది. దీనిలో పంచదార, నీళ్లు కలిపి ముఖానికి రాస్తే మేను నిగనిగలాడుతుంది. అయితే, నిమ్మరసాన్ని ఎండలోకి వెళ్లేముందు రాసుకుంటే చర్మం నల్లబడుతుంది. సున్నిత చర్మం కలవాళ్లు నిమ్మరసాన్ని నీళ్లలో కలిపి రాసుకోవడం మంచిది.
* పెరుగులో నిమ్మరసం కలిపి తలకి పట్టిస్తే చుండ్రు సమస్య దూరమవుతుంది.
* మురికినీ జిడ్డునీ పోగొట్టే లక్షణం ఉంది కాబట్టే నిమ్మకాయను సబ్బుల తయారీలోనూ ఎక్కువగా వాడుతుంటారు. నీచు వాసనా చెమట వాసన… ఇలా ఏ వాసననైనా పోగొట్టే లక్షణం కూడా నిమ్మకు ఉంది మరి.
మన దగ్గర విరివిగా దొరికే నిమ్మకాయలో ఇన్ని వెరైటీలూ సుగుణాలూ ఉన్నాయని మరి మీకు తెలుసా..?