Politics

మొడీకి సోనియా సలహాలు. ఎన్నికలు తిరిగి నిర్వహించాలని చంద్రబాబు లేఖ. తాజావార్తలు .

మొడీకి సోనియా సలహాలు. ఎన్నికలు తిరిగి నిర్వహించాలని చంద్రబాబు లేఖ. తాజావార్తలు .

మొడీకి సోనియా సలహాలు. ఎన్నికలు తిరిగి నిర్వహించాలని చంద్రబాబు లేఖ.
తాజావార్తలు
* కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. కరోనాపై పోరాడే క్రమంలో కొన్ని రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేశారు. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన విధివిధానాలపై నేడు వర్చువల్‌గా జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో చర్చించారు. కరోనాను కాంగ్రెస్‌ పార్టీ ఓ జాతీయ స్థాయి సవాల్‌గా పరిగణించిందని.. పార్టీలకతీతంగా దీనిపై పోరాటం చేయాల్సిన అవసరాన్ని గుర్తించిందని ఆమె తెలిపారు. భారత్‌లో మహమ్మారి ప్రభావం ప్రారంభమైన ఫిబ్రవరి-మార్చి 2020 నుంచే ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్‌ అన్ని రకాలుగా సహకరించేందుకు ముందుకొచ్చిందని గుర్తుచేశారు. ఏడాది సన్నద్ధత ఉన్నప్పటికీ రెండో వేవ్‌ను నిలువరించడంలో ఘోరంగా విఫలమయ్యామని విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీ ఇచ్చిన నిర్మాణాత్మక సలహాలను స్వీకరించడానికి బదులు కేంద్రమంత్రులు ఎదురుదాడికి దిగారని ఆరోపించారు. అలాగే కరోనాపై పోరాడే క్రమంలో సాయం అర్థించిన కొన్ని రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపిందన్నారు. కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారని.. కాంగ్రెస్‌ లేదా ఇతర ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలపై పూర్తి నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. ఈ కష్ట సమయంలో తన, మన భేదం లేకుండా రాజధర్మం పాటించాలని హితవు పలికారు.

* పోలీసులు, ఎన్నికల అధికారులు, వాలంటీర్లు కుమ్మక్కై ఎన్నికలను ప్రహసనంగా మర్చేశారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… అప్రజాస్వామికంగా నిర్వహిస్తున్న ఈ ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు.

* తెదేపా నేతలు దొంగ ఓటర్లను పురమాయించి.. వైకాపా దొంగ ఓట్లు వేయిస్తోందని అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెదేపా అనుకూల మీడియా పోలింగ్‌ బూత్‌లకు వెళ్లి ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఓటర్లను మీడియా ఇబ్బంది పెట్టడంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.

* తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో భాగంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జరిగిన పోలింగ్‌ను రద్దు చేసి, కేంద్ర బలగాలతో తిరిగి నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)కి ఆయన లేఖ రాశారు. తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో జరిగిన అక్రమాలపై తగు చర్యలు తీసుకోకుంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే అవుతుందని లేఖలో పేర్కొన్నారు.

* తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ప్రశాంతంగా జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. వైకాపా అధికారంలోకి వచ్చాక జరిగే తొలి ఉప ఎన్నిక అని.. గతంతో పోలిస్తే ఇంత ప్రశాంతంగా ఎప్పుడూ ఉప ఎన్నికలు జరగలేదన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ఇలాగే ఉండాలని తమ ప్రభుత్వం నిరూపిస్తోందని చెప్పారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ తెదేపా నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

* కరోనా బాధితుల్లో నెలకొన్న భయాలను పోగొట్టి, వారిలో మానసిక స్థైర్యం నింపేందుకు గుజరాత్‌లోని ఓ ఆసుపత్రి సిబ్బంది వినూత్న రీతిలో చికిత్సకు శ్రీకారం చుట్టింది. వడోదరలోని పారుల్‌ ఆసుపత్రిలో కొవిడ్‌ బాధితులకు మ్యూజిక్‌ థెరపీని వైద్యులు ప్రారంభించారు. రోగుల ఎదుట సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తూ వారిని ఉత్సాహపరుస్తున్నారు. ఇలా చేయడం ద్వారా కొవిడ్‌ గురించి బాధితుల్లో ఉన్న ఆందోళన తగ్గి వారిలో మానసిక స్థైర్యం పెరుగుతుందని వైద్యులు పేర్కొన్నారు.

* రెండో దశ కరోనా విజృంభిస్తున్న వేళ.. వైరస్‌ కట్టడికి పల్లెవాసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో స్వీయ లాక్‌డౌన్ అమలవుతోంది. మరికొన్ని గ్రామాల్లో జనం గుమికూడకుండా చర్యలు చేపడుతున్నారు. చాటింపులు వేయిస్తూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. వేములవాడ మండలం ఆరెపల్లిలో మహమ్మారి బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకొనేందుకు శ్రమిస్తున్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణపై నెలకొన్న సందిగ్ధత ఎట్టకేలకు తొలగిపోయింది. ఈనెల 21వ తేదీ నుంచి ఒంటిమిట్టలో శ్రీరామనవమి ఉత్సవాలు జరగాల్సి ఉంది. కొవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ఒంటిమిట్ట ఆలయాన్ని మే 15వ తేదీ వరకు మూసివేయనున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) ప్రకటించింది. ఈ మేరకు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆపాలని అధికారులను ఆదేశించింది. ఏటా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

* తిరుపతి ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని తెదేపా ఎంపీలు ఆరోపించారు. అన్ని చోట్లా దొంగ ఓట్లు వేసినందుకుగానూ ఉపఎన్నిక పోలింగ్ రద్దు చేయాలని ఆ పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్‌, కనకమేడల రవీంద్రకుమార్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఉప ఎన్నిక నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని.. మళ్లీ కొత్తగా తిరుపతి ఉపఎన్నిక నిర్వహించాలని కోరినట్లు వారు చెప్పారు.