Health

బ్లాక్‌ఫంగస్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన-తాజావార్తలు

Indian Health Department Warns On Black Fungus

* సైబర్‌క్రైం నేరగాళ్ల నయా మోసాలు రోజురోజూకు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. ఉద్యోగం పేరుతో కుత్బుల్లాపూర్‌కు చెందిన మహిళను సైబర్‌నేరగాళ్లు మోసగించారు. ఉద్యోగం పేరట సుమారు రూ.2.52 లక్షలను కాజేశారు. ఉద్యోగం కోసం నౌకరి.కామ్‌లో మహిళ తన వివరాలు నమోదు చేసింది. దీంతో సైబర్‌నేరగాళ్లు రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.10 చెల్లించాలని అడిగారు. నిజమే అని నమ్మి సదరు మహిళ సైబర్‌ నేరగాళ్లు పంపిన లింక్‌ క్లిక్‌ చేయడంతో ఖాతా నుంచి నగదు మాయం అయింది. ఆమె ఖాతా నుంచి పలు విడతలుగా రూ.2.52 లక్షలను సైబర్‌ నేరస్థులు స్వాహా చేశారు. దీంతో బాధితురాలు పేట్‌బషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

* బ్లాక్‌ ఫంగస్‌ లేదా మ్యుకర్‌మైకోసిస్..కరోనా నుంచి కోలుకున్న కొందరిలో వెలుగుచూస్తున్న ఈ వ్యాధి ఇప్పుడు కలవరం పుట్టిస్తోంది. కొవిడ్ చికిత్సలో భాగంగా రోగనిరోధక శక్తిని తాత్కాలికంగా అణిచిపెట్టేందుకు ఇచ్చే స్టిరాయిడ్ల మోతాదు మించి వాడిన వారిలో, దీర్ఘకాలంగా మధుమేహంతో బాధపడుతున్న వారికి ఇదో ముప్పుగా పరిణమించింది. ప్రజలు దానిని ముందుగా గుర్తించి, అప్రమత్తంగా ఉండే ఉద్దేశంతో కేంద్ర ఆరోగ్య శాఖ ట్విటర్‌లో పలు సూచనలు చేసింది. మ్యుకర్‌మైకోసిస్ ప్రధానంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఇది పర్యావరణ వ్యాధికారకాలతో పోరాడే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. చక్కెర స్థాయి నియంత్రణలో లేనివారు, కిడ్నీ మార్పిడి వంటి శస్త్రచికిత్సల్లో భాగంగా రోగనిరోధక శక్తిని అణిచిపెట్టే మందులు వాడినవారిలో ఈ వ్యాధి బయటపడుతోంది. తాజాగా కరోనా చికిత్సలో భాగంగా స్టిరాయిడ్స్ ఎక్కువగా వాడుతున్న కొందరిలో దీన్ని గుర్తిస్తున్నారు. ఇతర ఆరోగ్య సమస్యలున్నవారిలో కూడా ఇది వెలుగుచూస్తోంది. కరోనా మొదటి దశలో చికిత్సలో స్టిరాయిడ్స్ వాడకం పెద్దగా లేనందున బ్లాక్‌ ఫంగస్‌ కనిపించలేదని వైద్యులు చెప్తున్నారు.

* కారాగారాల్లో రద్దీ తగ్గించే అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాల అమలు కోసం పనిచేస్తున్న లాయర్లు, న్యాయాధికారుల్లో 18-44 ఏళ్ల వయసు వారు నేరుగా టీకాలను పొందే వీలుందా అని దిల్లీ హైకోర్టు ఆరా తీసింది. ‘తుపాకీ ఇవ్వకుండా యుద్ధానికి ఎలా పంపగలమ’ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశించి గురువారం వ్యాఖ్యానించింది. సర్వోన్నత న్యాయస్థాన ఆదేశాల అమలు కోసమే వారు పనిచేస్తున్నారని జస్టిస్‌ నవీన్‌ చావ్లా ధర్మాసనం గుర్తుచేసింది. జిల్లా కోర్టుల్లోని టీకా కేంద్రాల్లో న్యాయాధికారులు, న్యాయ సహాయం అందించే లాయర్లకు తక్షణం టీకాలు ఇచ్చేలా కేంద్రానికి, దిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ దిల్లీ రాష్ట్ర న్యాయ సేవా ప్రాధికార సంస్థ (డీఎస్‌ఎల్‌ఎస్‌ఏ) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

* కొవిడ్‌ చికిత్స కోసం ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులు ఆపడం సంప్రదాయం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారం ఉండాలన్నారు. రెండు రాష్ట్రాలు చర్చించుకొని సమస్య పరిష్కరించుకోవాలని కోరారు. హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ప్రభుత్వం గౌరవించాలని, తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులను ఆపడం సరికాదని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ వచ్చేందుకు అంబులెన్స్‌లకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలన్నారు. ఈవిషయమై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కేంద్ర హోంశాఖ కార్యదర్శి,మాట్లాడారని అన్నారు.

* వ్యాక్సిన్‌ తయారీ సంస్థలకూ కులం ఆపాదిస్తారా? అని వైకాపా నేతలను ఏపీ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. విశాఖ తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాక్సిన్ల కోసం లేఖలు రాస్తే సరిపోతుందా.. డబ్బు చెల్లించరా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో సామాన్యులకు వ్యాక్సిన్ అందే పరిస్థితి లేదని.. వాటి కోసం ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్తున్నారని చెప్పారు. ‘‘ఆక్సిజన్‌ కొరతతో ప్రజల ప్రాణాలు పోతుంటే పట్టదా?సరిహద్దు వద్ద అంబులెన్స్‌లను ఆపుతున్నా పట్టించుకోరా?తెలంగాణకు అంబులెన్స్‌లను పంపలేని స్థితిలో పాలకులున్నారు’’ అని అచ్చెన్నాయుడు ఆక్షేపించారు.

* రాష్ట్ర సరిహద్దులో ఏపీ అంబులెన్స్‌లను నిలిపేయడం సరికాదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మానవీయ కోణంలో ఆలోచించాలని సూచించారు. తక్షణమే సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని రేవంత్ కోరారు.

* రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరోనా విజృంభిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో టెస్టింగ్‌ కిట్లు లేకపోవడం దారుణమని ఆక్షేపించారు. కరోనా రోగులకు సేవలందించేందుకు గాంధీభవన్‌లో రాహుల్‌గాంధీ కేర్‌ కార్యక్రమాన్ని ఉత్తమ్‌ ప్రారంభించారు. దీని ద్వారా ప్లాస్మా, రక్తదానం, ఆక్సిజన్‌ సమకూర్చున్నట్లు చెప్పారు. యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కొవిడ్‌రోగులకు అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు.

* వేల మంది ఇతర రాష్ట్రాల రోగులకు వైద్యం అందించామని, ఏ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టాలని తాము అనుకోవట్లేదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. ‘పొరుగు రాష్ట్రం నుంచి బయలుదేరడానికి ముందే ఇక్కడి ఆస్పత్రిని సంప్రదించాలి. ఇతర రాష్ట్రాల ప్రజలకు వైద్యం చేయబోమని మేము ఎప్పుడూ చెప్పలేదు. ఏ రాష్ట్రాల ప్రజలను ఇబ్బంది పెట్టాలని మేం అనుకోవట్లేదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పేషెంట్స్ కోసం స్టేట్ కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేశాం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేస్తున్నాం’ అని డీహెచ్‌ తెలిపారు.

* కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసుల మధ్య వ్యవధి పెంచడం వల్ల యాంటీబాడీల ప్రతిస్పందన మరింతగా పెరుగుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫైజర్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్న 12 వారాల తర్వాత రెండో డోసు ఇవ్వడం వల్ల యాంటీబాడీల ప్రతిస్పందనలు దాదాపు మూడున్నర రెట్లు పెరిగినట్లు బ్రిటిష్‌ అధ్యయనంలో తేలింది. దీంతో వ్యాక్సిన్‌ డోసుల వ్యవధిని పెంచడం సరైన నిర్ణయమనడానికి ఇటువంటి శాస్త్రీయ అధ్యయనాలు మద్దతుగా నిలుస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

* ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య ఘర్షణలు వరుసగా నాలుగో రోజూ కొనసాగాయి. హమాస్‌ ఉగ్రవాదులతో ఘర్షణ తీవ్రం కావడంతో 9 వేల మంది రిజర్వుడు సైనికులను గాజా సరిహద్దుల్లో ఇజ్రాయెల్‌ మోహరించింది. దీంతో ఇప్పటి వరకు కొనసాగిన రాకెట్‌ దాడులు, వైమానిక దాడులు నుంచి ఘర్షణలు భూభాగానికీ పాకే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో పూర్తి స్థాయి యుద్ధం తలెత్తే ప్రమాదం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. మరోవైపు ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో గాజాలోని 100 మంది పాలస్తీనా పౌరులు మరణించినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

* కరోనా కల్లోలంతో ప్రజలు పడుతున్న పాట్లు తనను అంతే ఆవేదనకు గురి చేస్తున్నాయని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా కనిపించని శత్రువుతో పోరాడుతోందని ఆయన అభివర్ణించారు. వేగంగా మార్పులు చెందే ఈ వైరస్ ప్రపంచానికి సవాలుగా పరిణమించదని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ కరోనా మహమ్మారి కారణంగా మనం ఆత్మీయులను కోల్పోయాం. మీరు అనుభవిస్తోన్న బాధ.. నన్నూ అంతే వేదనకు గురిచేస్తోంది. నేను మీ ప్రధాన సేవకుడిని. మీ ప్రతి ఉద్వేగాన్ని నేను పంచుకుంటాను. మన ముందు కనిపించని శత్రువు ఉంది. 100 ఏళ్లలో ఎన్నడూ లేని కఠిన సమయాన్ని మనం ఇప్పుడు ఎదుర్కొంటున్నాం. ఈ మహమ్మారి ప్రపంచాన్ని అడుగడుగునా పరీక్షిస్తోంది’ అని ప్రధాని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.