Politics

రఘురామరాజుపై దేశద్రోహం కేసు నమోదు-నేరవార్తలు

Crime News - Traitor Case Filed On MP Raghurama Raju

* ఆరో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో హైడ్రామా చోటుచేసుకుంది. సీఐడీ పోలీసులపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. తనను సీఐడీ పోలీసులు కొట్టారని న్యాయవాదులకు ఎంపీ తెలిపారు. ఈ మేరకు జడ్జికి లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రిమాండ్ రిపోర్టును మెజిస్ట్రేట్ తిప్పిపంపారు. మరోవైపు లాయర్ ఆదినారాయణరావు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. మరికాసేపట్లో డివిజన్ బెంచ్‌లో విచారణ జరగనుంది. ఇదిలా ఉండగా, కోర్టుకు వెళ్లకుండా పోలీసులు తమను అడ్డుకున్నారని రఘురామ తరఫు లాయర్లు తెలిపారు. పబ్లిక్ కోర్టులోకి వెళ్లేందుకు పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని లాయర్ గోపినాథ్ అన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజు ఒంటిపై గాయాలున్నాయని ఆయన తెలిపారు. కోర్టులోకి న్యాయవాదులను వెళ్లనివ్వడం లేదని ఆరోపించారు.

* మీడియా చానళ్లతో కలిసి రఘురామకృష్ణరాజు కుట్ర పన్నారంటూ దేశద్రోహం కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ. మంగళగిరి సీఐడీ పీఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదు. ఏ1గా రఘురాజు.. ఏ2, ఏ3లుగా టీవీ 5, ఏబీఎన్. అందరూ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని ఆరోపణ. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై సీఐడీ దేశద్రోహం కేసును నమోదు చేసింది. రఘురాజుపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలను పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ లో ఉన్న వివరాలు ఇవే: ఒక పథకం ప్రకారం కొన్ని మీడియా చానళ్లతో కలిసి రఘురాజు కుట్ర పన్నారు. కులం, మతం ప్రాతిపదికన విభజన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తిని రెచ్చగొట్టేలా కుట్రలకు పాల్పడ్డారు. రెడ్డి, క్రిస్టియన్ వర్గాలను రఘురాజు టార్గెట్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధిక్కార స్వరాన్ని వినిపించేందుకు కొన్ని టీవీ చానళ్లతో కలిసి కుట్రపన్నారు. ఏబీఎన్, టీవీ5 చానళ్లు రఘురాజుకు స్లాట్స్ కేటాయించాయి. వీరందరూ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. మంగళగిరి సీఐడీ పోలీస్ స్టేషన్ లో రఘురాజుపై కేసు నమోదు చేశారు. 124 ఏ (దేశ ద్రోహం), 153 ఏ (వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం), రెడ్ విత్ 120 బీ (నేరపూరిత కుట్ర), 505 (రెచ్చగొట్టడం) సెక్షన్లపై కేసు బుక్ చేశారు. ఈ కేసులలో ఏ1గా రఘురాజు, ఏ2గా టీవీ5, ఏ3గా ఏబీఎన్ చానళ్లను చేర్చారు. సీఐడీ డీజీ రిపోర్టు ఆధారంగా కేసును నమోదు చేశారు.

* అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వైసిపిలో విభేదాలు.గోళ్ల శివారులో ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయుల మధ్య ఘర్షణ.రాళ్లు, కట్టెలతో ఇరు వర్గాల దాడి.ఇద్దరికి తీవ్ర గాయాలు.

* దారి దోపిడీల‌కు పాల్ప‌డుతున్న ముఠాను బాచుప‌ల్లి పోలీసులు ఇవాళ‌ అరెస్టు చేశారు. ముఠాలోని ఆరుగురు యువ‌కుల‌ను అదుపులోకి తీసుకున్నారు.. ఈ ముఠా రాత్రి పూట ఒంట‌రిగా ఉన్న వారిపై దాడి చేసి దోపిడీల‌కు పాల్ప‌డుతుంద‌ని పోలీసులు వెల్ల‌డించారు.నిందితులు స్విగ్గీ, జొమాటోల‌లో ప‌ని చేస్తున్న‌ట్లు వివ‌రించారు.విలాసాలకు అల‌వాటు ప‌డిన యువ‌కులు  ఈ విధంగా దోపిడీలు చేస్తున్న‌ట్లు పోలీసులు స్ప‌ష్టం చేశారు.దొంగిలించిన ఫోన్లు, ఇత‌ర సామ‌గ్రిని ఓఎల్ఎక్స్‌లో నిందితులు విక్ర‌యిస్తున్న‌ట్లు గుర్తించారు.

* ఖమ్మం జిల్లాలో పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.ఖమ్మం గ్రామీణ మండలం పిట్టలవారిగూడెం శివారులోని క్వారీలో భారీగా పేలుడు పదార్థాలు నిల్వ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది.ఈ మేరకు దాడి చేసి రూ. 15.5 లక్షల విలువైన జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లు, సల్ఫర్‌ను పట్టుకున్నారు.పేలుడు పదార్థాలను నిల్వచేసిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.క్వారీలో పేలుళ్లు జరిపేందుకు వీటిని తీసుకువచ్చినట్లు భావిస్తున్నారు.పేలుడు పదార్థాలకు అనుమతి లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.