Sports

వందేళ్ల తర్వాత అథ్లెటిక్స్‌లో భారత్‌కు స్వర్ణం-తాజావార్తలు

వందేళ్ల తర్వాత అథ్లెటిక్స్‌లో భారత్‌కు స్వర్ణం-తాజావార్తలు

* టోక్యోలో చరిత్ర సృషించిన నీరజ్ చోప్రా… జావెలిన్‍ త్రోలో బంగారు పతకం సాధించిన నీరజ్‍… వందేళ్ల తర్వాత ఒలింపిక్స్ అథ్లెటిక్స్ విభాగంలో భారత్‍కు పతకం… టోక్యో ఒలింపిక్స్ అథ్లెటిక్‍ విభాగంలో భారత్‍కు బంగారు పతకం… 13 ఏళ్ళ తర్వాత తొలిసారి వ్యక్తిగత విభాగంలో భారత్‍కు పసిడి పతకం… 2008 ఒలింపిక్స్ షూటింగ్‍లో అభినవ్‍ బింద్రాకు స్వర్ణం.

* భారత రెజ్లర్‌ బజరంగ్‌ పునియా అద్భుతం చేశాడు. పురుషుల 65 కిలోల కుస్తీపోటీల్లో కాంస్య పతకం సాధించాడు. ప్లేఆఫ్‌ పోటీల్లో కజక్‌స్థాన్‌కు చెందిన దౌలత్‌ నియజ్‌బెకోవ్‌ను 8-0తో చిత్తు చేశాడు.

* నీటి పారుదలశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. గెజిట్‌ నోటిఫికేషన్‌ సంబంధిత అంశాలపై సమావేశంలో చర్చించారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై అధికారులతో సీఎం సమాలోచనలు చేశారు. నిన్న కూడా సమీక్ష నిర్వహించిన కేసీఆర్‌… రాష్ట్ర సాగునీటి హక్కులు, వ్యవసాయం, రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, అందుకు యంత్రాంగం పట్టుదలతో కృషి చేయాలని ఉద్ఘాటించారు. రాష్ట్రానికి హక్కుగా కేటాయించిన న్యాయమైన నీటి వాటాలకు సంబంధించి బచావత్‌, బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పులపై సమావేశంలో చర్చించారు. కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ లోని అంశాలపైనా చర్చించారు. గోదావరి, కృష్ణా జలాల్లో ఉభయ రాష్ట్రాలకు ఉండే నీటి వాటా గురించి సమావేశంలో విస్తృతంగా చర్చించారు. బోర్డుల సమావేశంలో తెలంగాణ వాణిని గట్టిగా వినిపించాలని ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. ఇవాళ మరోసారి సమావేశమై ఇదే అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు.

* జీవాన్వేషణే లక్ష్యంగా అంగారకుడిపైకి నాసా పంపిన పర్‌సివరెన్స్‌ రోవర్‌ శోధన కొనసాగుతుంది. మిషన్‌లో భాగంగా ఇటీవల రోవర్‌ కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది. జెజెరో క్రేటర్‌లోని ఓ పురాతన రాతిపై అనుకున్నట్లుగానే గుంత చేసిన రోవర్‌.. రాతి నమూనాలను సేకరించడంలో మాత్రం విఫలమైంది. ఇలా అంగారకుడిపై గుంత చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. అనుకున్నట్లుగానే అన్ని పరికరాలు సక్రమంగా పనిచేశాయని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.

* రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే హైదరాబాద్‌లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌ శివారులోని సాహెబ్‌నగర్ డ్రైనేజీలో పూడిక తీస్తూ మృతి చెందిన కార్మికులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సాహెబ్‌నగర్‌లో పారిశుద్ధ్య పనులు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన శివ, అంతయ్య కుటుంబాలను రేవంత్‌ పరామర్శించారు. సోమవారంలోగా పరిహారం చెల్లించకపోతే జాతీయ స్థాయిలో అన్ని విభాగాలకు ఫిర్యాదు చేస్తానని.. అప్పుడు సంబంధిత అధికారులు దిల్లీకి తిరగాల్సి వస్తుందని హెచ్చరించారు.

* తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అరాచక, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా నిర్వహిస్తున్నామని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్‌ తెలిపారు. ఇంద్రవెల్లి సభకు రాజకీయాలకు అతీతంగా అందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రజల స్పందన చూస్తుంటే ఇంద్రవెల్లి సభకు లక్షకు పైగా జనం రాబోతున్నారని అయన పేర్కొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం రోజు ఆగస్టు 9న ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హుజూరాబాద్ ఎన్నికల కోసం కేసీఆర్ మళ్లీ మోసాలకు తెరలేపారని ధ్వజమెత్తారు. దళిత గిరిజనుల కుటుంబాలకు రూ.కోటి ఇచ్చినా తక్కువేనని మధుయాష్కీ వ్యాఖ్యానించారు.

* జగనన్న ఇళ్లలోని బెడ్ రూమ్స్‌లో పెళ్లయిన కొత్త జంటలకు శోభనానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేసి ఇటీవల వార్తల్లోకెక్కిన కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టిన వైకాపా అభ్యర్థిని ఓడించి తెదేపా సర్పంచి అభ్యర్థిని గెలిపిస్తారా? అని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఇనుగూరుపేట మండలం పల్లెపాడు జిల్లా డైట్‌ కళాశాలలో అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ..‘‘అధికారులకు ఇప్పుడే చెబుతున్నా.. తెదేపా సర్పంచికి గానీ, ఇంకెవరైనా నాయకులకు గానీ ఎలాంటి పనులు చేయడానికి వీల్లేదు. గ్రామంలో స్థానిక వైకాపా నాయకుడు కుమార్‌ రెడ్డి చెప్పిందే చేయాలి. మండలంలోని ఇతర వైకాపా నాయకులు చెప్పినా చేయొద్దు’’ అని అధికారులకు హుకుం జారీ చేశారు. మండలంలోని దేవిస్‌పేట, కొత్తూరు, పున్నూరు, పల్లెపాడు గ్రామాల్లో తెదేపా సర్పంచి అభ్యర్థుల్ని గెలిపించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి వ్యాఖ్యలతో సమావేశంలో పాల్గొన్న అధికారులు నివ్వెరబోయారు.

* ఏపీలో కాషాయ ముఖ్యమంత్రి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యల వెనక భయం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. విజయవాడలో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరోగ్య స్వయం సేవక్‌ శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజ సేవ కోసం పరితపించే పార్టీ భాజపా అని.. రాజకీయాల కోసం వైకాపా, తెదేపా ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వం చేసిన తప్పులపై ప్రశ్నిస్తే కూల్చివేత కుట్ర అంటున్నారని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వాన్ని కూల్చాలనుకోవడం లేదని.. సమాజహితం కోసం పనిచేయడమే భాజపా లక్ష్యమని సోము స్పష్టం చేశారు.

* త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్‌ కుమార్‌ దేవ్‌పై హత్యాయత్నం జరిగింది. ఆయనను కారుతో ఢీకొట్టేందుకు ప్రయత్నించగా.. సీఎం అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిప్లవ్‌ దేవ్‌ గురువారం సాయంత్రం వాకింగ్‌ చేసేందుకు బయటకు వచ్చారు. తన అధికారిక నివాసానికి సమీపంలో సీఎం వాకింగ్‌ చేస్తుండగా.. ముగ్గురు వ్యక్తులు కారు నడుపుకొంటూ భద్రతా వలయంలోకి దూసుకొచ్చారు. వాహనాన్ని గమనించిన ముఖ్యమంత్రి.. వెంటనే పక్కకు జరగడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సీఎం భద్రతాసిబ్బంది ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. కారును ఆపేందుకు సెక్యూరిటీ ప్రయత్నించినప్పటికీ వారు వేగంగా వెళ్లిపోయారు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం అర్ధరాత్రి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులు సీఎంపై దాడికి ఎందుకు ప్రయత్నించారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని, దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.

* ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను డీనోటిఫై చేసేవరకు అందరూ జాగ్రత్తగా ఉండాలని, అప్పటి వరకు తిరుమల శ్రీవారి దర్శనానికి పరిమితంగానే టికెట్లు జారీ చేస్తామని టీటీడీ ఈవో కె.ఎస్‌.జవహర్‌రెడ్డి తెలిపారు. శనివారం తితిదే పరిపాలన భవనంలో డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి భక్తులు ఫోన్ ద్వారా చేసిన ఫిర్యాదులు, సలహాలను ఈవో స్వీకరించి సమాధానాలు ఇచ్చారు.