ScienceAndTech

కేరళలో డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్-తాజావార్తలు

కేరళలో డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్-తాజావార్తలు

* డ్రోన్ల నుంచి భద్రతకు పెను సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో దేశంలో తొలిసారిగా డ్రోన్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌, పరిశోధన కేంద్రాన్ని కేరళ పోలీసులు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గగనతలంలో డ్రోన్లతో అద్భుత ప్రదర్శనను నిర్వహించారు. ఈ తరహా లోహవిహంగాల నుంచి వచ్చే ముప్పులను విశ్లేషించడంతోపాటు వీటిని ఎక్కడెక్కడ వినియోగించొచ్చన్నది ఇక్కడ పరిశోధిస్తారు. సంఘ వ్యతిరేక శక్తులు నిఘా, స్మగ్లింగ్‌, ఉగ్రవాదం వంటి విద్రోహ చర్యలకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారన్న సమాచారం తమకు ఉందని విజయన్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. జమ్మూ వైమానిక స్థావరంపై జరిగిన డ్రోన్‌ దాడిని ఆయన ప్రస్తావించారు. ఈ అంశం భద్రతా దళాలకు పెను సవాళ్లు రువ్వుతోందని చెప్పారు. తాజాగా ప్రారంభించిన ల్యాబ్‌లో అక్రమ డ్రోన్లను గుర్తించడంతోపాటు పోలీసుల అవసరాలకు అనుగుణంగా ఇలాంటి సాధనాలను ఉత్పత్తి చేస్తారని తెలిపారు.

* కరోనా మూడోదశ వ్యాప్తి సహా బలహీన రోగనిరోధకశక్తిని దృష్టిలో ఉంచుకొని అగ్రరాజ్యం అమెరికా కొవిడ్ మూడో డోసు టీకాకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు అమెరికన్లు రెండు డోసుల తర్వాత మరో టీకా తీసుకునేందుకు అనుమతిస్తూ అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో కొవిడ్ ముప్పు అధికంగా ఉన్న వారితో పాటు.. సాధారణ ప్రజలకు సైతం వైరస్ నుంచి రెట్టింపు రక్షణ లభించనుందని సీడీసీ డైరెక్టర్ రొచెల్లె వాలెన్‌స్కీ పేర్కొన్నారు. అమెరికాలో ప్రస్తుతం ఫైజర్‌, మోడెర్నా టీకాలు అందిస్తున్నారు.

* యువత ఆత్మబలిదానాలు చూడలేక సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందిరాపార్క్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మైనార్టీ గర్జన సభ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ… దేశానికి స్వాతంత్ర్యం తేవడానికి కాంగ్రెస్‌ ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. కాంగ్రెస్‌ హయాంలోనే మైనార్టీలకు మేలు జరిగిందని, నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్‌ పార్టీ అని గుర్తు చేశారు. వైఎస్సార్‌ నేతృత్వంలో రిజర్వేషన్లు కల్పిస్తే ఎంతో మంది మైనార్టీలకు అవకాశాలు లభించాయన్నారు. రాష్ట్రపతి, ముఖ్యమంత్రి పదవులు ముస్లింలకు ఇచ్చింది కాంగ్రెస్‌ మాత్రమేనన్నారు.

* అర్హులైన వారందరికీ దళిత బంధు అందజేస్తామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. గ్రామ సభల ద్వారా దళిత బంధు సాయాన్ని పంపిణీ చేస్తామని వెల్లడించారు. పైలట్‌ ప్రాజెక్టు కింద ముందుగా హుజూరాబాద్‌లో అమలు చేస్తున్నట్లు చెప్పారు. హుజూరాబాద్‌లో ఈ నెల 16న జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగ సభ ఏర్పాట్లపై మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌తో పాటు సీఎస్‌ సమీక్షించారు. బహిరంగ సభ ఏర్పాట్లు, దళిత బంధు సాయం పంపిణీ, తదితర అంశాలపై సమీక్షించారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పరిధిలోని శాలపల్లి ఇందిరానగర్‌లో దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు.. అద్భుతమైన పథకం అని.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. 15 మంది లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా చెక్కులను అందజేయనున్నట్లు సీఎస్‌ వెల్లడించారు.

* నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. గత నాలుగు రోజులుగా ఉక్కపొతతో సతమతమైన నగర వాసులు సాయంత్రం కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. నగరంలోని ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, లక్డికాపూల్‌, నాంపల్లి, మాదాపూర్‌, ఎర్రగడ్డ, మియాపూర్‌, మదీనాగూడ, చందానగర్‌, కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, సైఫాబాద్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణ గూడ, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. సాయంత్రం కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లోని రహదారులు జలమయం అయ్యాయి. రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

* ఆడపిల్లలు పుడితే అక్కడ సంబరం చేసుకుంటారు. అంతా కలిసి మిఠాయిలు పంచుకొని సంతోషంగా గడుపుతారు. పంచాయతీని విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. కొండాపూర్‌ మండలం హరిదాస్‌పూర్‌ గ్రామంలో తొలుత ఈ సంప్రదాయం మొదలైంది. వీరిని ఆదర్శంగా తీసుకొని కంది మండలం ఎద్దుమైలారం సర్పంచ్‌ ముందుకొచ్చారు. తమ ఊర్లోనూ ఈ విధానం అనుసరించేందుకు ఉత్సాహం చూపారు. ఇలా ఆడపిల్లలకు గౌరవం కల్పిస్తూ సమాజంలో ఉన్నతంగా ఎదిగేందుకు వీరు చూపుతున్న చొరవ ఇప్పుడు పాఠ్యపుస్తకంలో చోటు దక్కించుకుంది. ఇంటర్మీడియెట్‌ ఆంగ్ల పుస్తకంలో ఈ విషయాన్ని పాఠ్యాంశంగా ప్రచురించారు. ‘లింగవివక్ష ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. ఇలాంటి సమయంలో కొండాపూర్‌ మండలం హరిదాస్‌పూర్‌లో ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం మొదలైంది. సర్పంచ్‌ షఫీ నేతృత్వంలో చేపట్టిన కార్యక్రమం తక్కువ వ్యవధిలోనే మంచి ఫలితాలను సాధించింది. ఈ ప్రేరణతో ఎద్దుమైలారంలోనూ దీనిని అమలు చేస్తున్నారు. ఇక్కడ ఒకే రోజు 72 మందిని సుకన్య సమృద్ధి యోజనలో చేర్చారు..’ అంటూ పుస్తకంలో ప్రచురించారు. ఇంటర్‌ విద్యార్థులు ఈ వ్యాసం చదివి దిగువన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. తద్వారా అమ్మాయిలను గౌరవించే ఈ గ్రామాల గురించి రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ పిల్లలంతా తెలుసుకోవడానికి అవకాశమేర్పడింది.

* న‌ల్ల‌గొండ : జిల్లాలోని నకిరేక‌ల్ బ‌స్టాండ్ ద‌శాబ్దం అనంత‌రం పూర్వ వైభ‌వాన్ని సంత‌రించుకుంది. అప్ప‌టి ర‌వాణాశాఖ మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావు ఈ బ‌స్టాండ్‌కు శంకుస్థాపన చేశారు. కాగా ద‌శాబ్దానికి పైగా బ‌స్టాండ్ వినియోగంలో లేకుండా పోయింది. రూ.20 ల‌క్ష‌ల వ్య‌యంతో బ‌స్టాండ్ తిరిగి పున‌రుద్ధ‌రించ‌బ‌డింది. ఉమ్మ‌డి ఏపీలో ర‌వాణాశాఖ మంత్రిగా ఉన్న కె. చంద్ర‌శేఖ‌ర్ రావు 5 మార్చి,1999న న‌కిరేక‌ల్ ఆర్టీసీ బ‌స్టాండ్‌కు శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం 4 జ‌న‌వ‌రి,2001న అప్ప‌టి గ‌నుల‌శాఖ మంత్రి ఎలిమినేటి ఉమా మాధ‌వ‌రెడ్డి ఈ బ‌స్టాండ్‌ను ప్రారంభించారు. జాతీయ ర‌హ‌దారి-65కు స‌మీపంలో ఈ బ‌స్టాండ్ ఉంటుంది. చుట్టుప్ర‌క్క‌ల 40 గ్రామాల ప్ర‌జ‌లు హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌, న‌ల్ల‌గొండ‌కు రావాలంటే న‌కిరేక‌ల్‌కు చేరుకోవాల్సిందే.