Fashion

తెలుగువారందరూ అమృతాంజనాన్ని ఎందుకు ఆదరించాలి?

తెలుగువారందరూ అమృతాంజనాన్ని ఎందుకు ఆదరించాలి?

కాశీనాథుని నాగేశ్వరరావు అభ్యుదయవాది, దేశభక్తుడు, సంఘసంస్కరణాభిలాషి, సాహితీపరుడు. కాశీనాథుని నాగేశ్వరరావుపంతులు గారు 1860లో కృష్ణాజిల్లా గుడివాడతాలూకా యలమర్రులో జన్మించారు. బందరు, గుంటూరులలో చదువుకొన్నారు.
సత్ప్రవర్తన, క్రమశిక్షణ, నిబద్ధతలతో చదువుసాగించారు. అప్పట్లో గుంటూరుపట్టణంలో రెంటాల వెంకటసుబ్బారావనే వకీలు వుండేవారు. పేరుకు వకీలైనా మేడ్ ఈజీపేరుతో పాఠ్యపుస్తకాలకు గైడులు వ్రాసిపేరును ధనాన్ని బాగా ఆర్జించారు. వేంకటసుబ్బారావు గారికి మందుల వ్యాపారం కూడా వుండేది. రెంటాలకు మదరాసులోని విక్టోరియాలో డిపో వుండేది.ఆయన దృష్టిలో పడ్డాడు నాగలింగం.నాగలింగం ఎవరనే సందేహం కదూ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులకు తల్లిదండ్రులు పెట్టినపేరు నాగలింగమే మరి.
కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి స్ఫూరదృష్టి, మంచితనం, తెలివితేటలు రెంటాలవెంకటసుబ్బారావుకు బాగానచ్చాయి. తన మేనకోడలు మాయమ్మను ఇచ్చి చేయాలని నిర్ణయించాడు.నాగేశ్వరరావు కూడా సరేనన్నారు. కానీ తల్లిఒప్పుకోలేదు. ఎందుకంటే నాగలింగం ఆరాధ్యశైవ బ్రాహ్మణుడు. అమ్మాయి నియోగిశాఖకు చెందిన బ్రాహ్మణవధువు.పెళ్ళి జరిగితే శాఖంతరవివాహమైతుంది. అప్పటికే కందుకూరి వీరేశలింగం పంతులగారి సంస్కరణవాదం బాగా వంటబట్టి వుండటంతో శాఖాబేధాలను నాగేశ్వరరావు పట్టించుకోలేదు.
1890 లో కొండావెంకటప్పయ్య వంటి స్నేహితులే పెండ్లిపెద్దలై పెండ్లిజరిపించారు.అమ్మ పెండ్లికిరాలేదు. అందువలన రెంటాలవారి ఇంట్లోనే మకాంవేశాడు.
రెంటాలవారి మేడ్ ఈజీ, సాహిత్యం,మందులవ్యాపారం పై దృష్టిసారించి వ్యాపార మేళుకువలను బాగా ఆకలింపు చేసుకొన్నాడు. ఇద్దరు వ్యక్తుల మధ్య మనస్పర్థలు రావటానికి మగువ మద్యం మాంసం ఆర్థికభాగస్వామ్యం బుుణం వృత్తి మొదలైనవి బాగా పనిచేస్తాయి. కాశీనాథపంతులకు రెంటాలకు భాగస్వామ్య విషయంగా మనస్పర్థలు వచ్చాయి.
కాశీనాథుడు రెంటాలనుండి విడిపోయి కలకత్తా వెళ్ళిపోయి వ్యాపారంచేసి బాగా నష్టపోయి చేసేదేమిలేక బొంబాయి (ముంబాయి) చేరుకొన్నాడు.
బొంబాయిలో విలియం అండ్ కో అనే కంపెనివుండేది. అదో మందుల కంపెని. దాని యాజమానో పాశ్చాత్యుడు. ఆ కంపెనీలో పంతులు ఉద్యోగిగా చేరాడు.
కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు నమ్మకం కష్టపడి పనిచేయడం సత్ప్రవర్తనలలో ఇంగ్లీసు దొరను మెప్పించాడు.ఆ దొర ఐరోపాకు తిరిగివెళ్ళిపోతూ కంపెనీని పంతులకు ఇచ్చివేశాడు.
గతంలోనే మందుల కంపెనీలో పనిచేయడం వలన, స్వంత తెలివితేటలతో పంతులుగారు ఆంగ్లేయుడు ఇచ్చిన కంపెనీలో 1893లో ఒక అంజనాన్ని (బామ్ / మలాం ) తయారుచేసి దానికి అమృతాంజనం అనేపేరు పెట్టాడు. నిజంగా ఈ అంజనం తలనొప్పి వంటి నొప్పులకు అమృతంలా పనిచేసింది.అమృతాంజనమనే పేరు సరిగా సరి పోయింది.
అమృతాంజనం తయారైంది కాని మార్కెటింగ్ ఎలా చేయాలి, అమ్మకాలు ఎలా పెంచాలో తెలియదు. అమృతాంజనంలో విలువైన ఆయుర్వేద ఔషదాలను కలిపాడు, అమృతాంజనం సీసాలకు స్వయంగా భార్యతోకలిసి పేపర్లు చుట్టాడు. అడ్వర్టెజ్ ( ప్రకటనలు ) వినూత్నపద్ధతిలో చేశాడు. ఏదైనా సభాకార్యక్రమం జరిగితే అక్కడ ఉచితంగా అమృతాంజనం పంచాడు. వినూత్నపద్ధతిలో ప్రకటనలు చేయడం వలన వ్యాపారం జోరందుకొంది.అమృతాంజనం అమృతప్రాయమైంది. త్వరలో కంపెని లాభాలబాపట్టింది.లాభాలులక్షలరుపాయలకు చేరుకొంది. లాభాలను స్వంతానికి ఉపయోగించుకోలేదు. మొదటనుండి సంస్కరవాది, స్వతంత్ర్యపిపాసి, వచ్చిన డబ్బు వచ్చినట్లుగానే దేశసేవకు వినియోగించాడు. అందుకే పంతుల గారికి విశ్వదాత, దేశోద్ధారక అనే బిరుదులను ఇచ్చారు.ఆయనస్థాపించినఆంధ్రపత్రికస్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. 1908 సంవత్సరం సెప్టెంబరు 9 తేదీన, తెలుగు కాలమానంలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావుపంతులుఆంధ్రపత్రికనువారపత్రికను బొంబాయినుండి ప్రారంభించారు.
వారపత్రికగా ఆంధ్రపత్రికను 9.9.1908 న ప్రారంభించి దానిని 04-01-1914లో దినపత్రికగా మార్చి మదరాసునుండి ప్రచురించడంజరిగింది.ఇకసాహిత్యసేవకుగానుపంతులుగారుభారతిపత్రికను ప్రారంభించాడు.భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో మరీ ముఖ్యంగా మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న తెలుగు సాహిత్యమాసపత్రిక.భారతితొలిసంచికరుధిరోద్గారినామసంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైంది.ఇలా తన సంపాదనను జాతి అభ్యున్నతికొరకు త్యాగంచేసినకాశీనాథునినాగేశ్వరరావుపంతులుగారు1938లో మరణించాడు.
కాని ఆయన మనకిచ్చిన భారతిపత్రికను కనుమరుగుచేసి,ఆంధ్రపత్రికనుఅమృతాంజనంలను బ్రతికించు కోలేకపోతున్న తెలుగు వాళ్ళం మనం. అమృతాంజనం పోటీ ప్రపంచంలో ఎలాగో ఒకలా నెట్టుకు వస్తోంది. కాశీనాథుని సేవానిరతిని త్యాగాన్ని గుర్తించి, దేశసేవకు పాల్పడిన అమృతాంజనాన్ని మనం తప్పక ఆదరించాలి. మంట పుట్టించే జాండులకన్నా ఔషధాలున్న అమృతాంజనం ఎంతోమిన్న.