Movies

విచారపూర్వక ఆశీస్సులు అందించిన నాగార్జున-తాజావార్తలు

విచారపూర్వక ఆశీస్సులు అందించిన నాగార్జున-తాజావార్తలు

* కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌సైరన్‌’ ర్యాలీకి వెళ్లకుండా రేవంత్‌రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దిల్‌సుఖ్ నగర్‌ వెళ్లేందుకు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన రేవంత్‌ను గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ శ్రేణులు నినాదాలు చేశారు. గాంధీ జయంతి రోజున నా ఇంటి వద్ద ఎందుకు అడ్డుకుంటున్నారని ఏసీపీని రేవంత్‌ ప్రశ్నించారు. గృహనిర్బంధం చేస్తే ఆర్డర్‌ కాపీ చూపించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణకోసం అమరుడైన శ్రీకాంత్‌ చారికి గాంధీజీ జయంతి రోజున నివాళులు అర్పించే హక్కు కూడా లేదా? అని ప్రశ్నించారు.

* నాగచైతన్య, సమంతలు విడిపోవటం నిజంగా దురదృష్టకరమని సినీ నటుడు, నాగచైతన్య తండ్రి అక్కినేని నాగార్జున విచారం వ్యక్తం చేశారు. చై-సామ్‌లు విడిపోతున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరువురు తెలిపారు. ఈ నేపథ్యంలో నాగార్జున ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘ఎంతో బరువైన హృదయంతో ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తోంది. సామ్‌, చైలు విడిపోవటం నిజంగా దురదృష్టకరం. భార్యాభర్తల మధ్య ఏం జరిగినా అది వాళ్ల వ్యక్తిగతం. సమంత, నాగచైతన్య ఇద్దరూ నాకెంతో దగ్గరి వారు. సమంతతో నా కుటుంబం గడిపిన ప్రతి క్షణం ఎంతో మధురమైంది. ఆమె మా కుటుంబానికి చాలా దగ్గరైంది. దేవుడు వాళ్లిద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. వారికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి’’

* తొక్కే కొద్దీ పైకి లేస్తాం తప్ప వంగేది లేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రాజమహేంద్రవరంలో పార్టీ కార్యకర్తలతో కలిసి శ్రమదానం చేశారు. అనంతరం బాలాజీపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ‘‘పనులు జరగనప్పుడు ప్రశ్నించే హక్కు ఉంది. ప్రజలకు ఉన్న హక్కునూ ఎవరూ ఆపలేరు. రాజ్యాంగం కల్పించిన హక్కును అడ్డుకోలేరు. వీర మహిళలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కుల, మత, వర్గ రహిత సమాజం నిర్మించడం మన ఆకాంక్ష. రాజకీయ సాధికారత కోసం పోరాటం చేస్తున్నా. ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు అండగా ఉండాలని వచ్చా.

* ‘మా’ ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్ష పదవికి బరిలో నిలిచిన సీనియర్‌ నటుడు సీవీఎల్‌ నరసింహారావు చివరి నిమిషంలో తాను పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు. అన్ని వివరాలు రెండ్రోజుల్లో మీడియాకు వెల్లడిస్తానని చెప్పారు. అధ్యక్ష పదవి కంటే.. తనకి ‘మా’ సభ్యుల సంక్షేమమే ముఖ్యమని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం పోటీలో ఉన్న రెండు ప్యానళ్లలో తాను ఎవ్వరికీ మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.

* తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సరిగ్గా నిమిషంన్నర పాటు శ్రమదానం చేసి రోడ్డు వేసేసిన పవన్‌ కల్యాణ్‌ను చూసి అంతా నవ్వుకుంటున్నారని ఏపీ మంత్రి కన్నబాబు అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీపై ఏమని యుద్ధం ప్రకటించారో పవన్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

* ఎల్‌బీనగర్‌ కూడలిలో కాంగ్రెస్‌ కార్యకర్త ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌’ ర్యాలీ సందర్భంగా ఎల్బీనగర్‌లోని శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులర్పించేందుకు కాంగ్రెస్‌ నేతలు, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు భారీగా తరలివచ్చారు. ఈక్రమంలో కాంగ్రెస్‌ కార్యకర్త, విద్యా్ర్థి కల్యాణ్‌ పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై అడ్డుకున్నారు. కాంగ్రెస్‌ నేతలను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈక్రమంలో ఎల్బీనగర్‌- ఉప్పల్‌ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది.

* చార్‌ధామ్‌ యాత్రకు వచ్చే భక్తుల సంఖ్యపై రోజువారీ పరిమితిని ఎత్తివేయాలని, ఇది కుదరని పక్షంలో మరింత మందిని అనుమతించాలని కోరుతూ ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. గత నెలలో చార్‌ధామ్‌ యాత్రపై స్టే ఎత్తివేసిన కోర్టు.. కొవిడ్‌ను దృష్టిలో ఉంచుకుని భక్తుల సంఖ్యపై పరిమితి విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బద్రీనాథ్‌కు రోజుకు వెయ్యి మంది భక్తులు, కేదార్‌నాథ్‌కు 800, గంగోత్రికి 600, యమునోత్రికి 400 మందికి మాత్రమే అనుమతి ఉంది. ఈ ఆంక్షలు సడలించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సవరణ దరఖాస్తు దాఖలు చేసింది. పరిమితిని పూర్తిగా తొలగించలేని పక్షంలో.. బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌కు రోజుకు మూడు వేల మంది భక్తులను, గంగోత్రికి వెయ్యి మందిని, యమునోత్రికి 700 మందిని అనుమతించాలని కోరింది. ఇప్పటికే ఆలస్యంగా ప్రారంభమైన ఈ యాత్ర నవంబరు మధ్య వరకే కొనసాగుతుందని, ప్రస్తుతం భక్తుల సంఖ్యపై పరిమితి కారణంగా యాత్రికులపై ఆధారపడి ఉన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతోందని రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది.

* రైతులపై నమోదైన కేసుల విషయంలో పంజాబ్‌ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ట్రాక్‌లపై నిరసన తెలిపిన అన్నదాతలపై కేసులను ఉపసంహరించుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్ చన్నీ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్)కు లేఖ రాశారు. తమ ఆదేశాలను ఆర్‌పీఎఫ్ ఛైర్మన్ వెంటనే పాటించాలని.. నిరసన తెలిపిన రైతులపై కేసులను ఉపసంహరించుకోవాలని సీఎం చన్నీ ఆదేశించారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన మరుసటి రోజే పంజాబ్‌ సీఎం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

* సాధారణంగా మనదగ్గర కిలో ఉప్పు రూ.20 నుంచి రూ.30 ఉంటుంది. కానీ ఉత్తరాఖండ్‌లోని కొన్ని గ్రామాల్లో ఉప్పు ధర రూ.130కి చేరింది. ఇదేకాదు.. అక్కడ చక్కెర, పిండి ఇతరత్రా సరుకుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని పిథోరాగఢ్‌ జిల్లాకు సమీపంలో ఉండే పలు హిమాలయ పర్వత ప్రాంత గ్రామాల్లో గత కొన్ని రోజులుగా నిత్యావసరాల ధరలు మోత మోగుతున్నాయి. కిలో చక్కెర రూ.150, వంట నూనె ధర రూ.275 నుంచి రూ.300, పిండి రూ.150, ఎర్ర కందిపప్పు కిలో రూ.200 పలుకుతోంది. బియ్యం ధర కూడా కిలోకు రూ.150 ఉండగా.. కేజీ ఉల్లిగడ్డ రూ.125కి చేరింది.

* గాంధీ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. లంగర్‌హౌస్‌లోని బాపుఘాట్‌లో గవర్నర్‌ తమిళిసై మహాత్ముడికి నివాళులు అర్పించారు. సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రులు మహమూద్‌ అలీ, కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, సత్యవతి రాఠోడ్‌ తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతిపిత సేవలను నేతలు కొనియాడారు.

* విశాఖ నగరంపై సీఎం జగన్‌ కక్ష కట్టారని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. నగరాన్ని అస్తవ్యస్తం చేయడానికే కంకణం కట్టుకున్నారన్నారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరాన్ని తాకట్టు పెట్టడానికి సైతం చూస్తున్నారని అచ్చెన్న మండిపడ్డారు. నగరానికి కొత్తగా ఏమీ చేయకపోయినా ఉన్న పథకాలను పూర్తి చేయాలని విన్నవించుకున్నామన్నారు. అయితే సీఎం మాత్రం ఉన్నవాటినే నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.