Business

రైల్వేలో కిళ్లీ మరకలకు ఇక కాలం చెల్లనుంది-తాజావార్తలు

రైల్వేలో కిళ్లీ మరకలకు ఇక కాలం చెల్లనుంది-తాజావార్తలు

* తెలంగాణ రాష్ట్రంలో గత 24గంటల్లో 33,506 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 162 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,67,887కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,930కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 214 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,235 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

* ఏపీ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ఈనెల 13న బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జస్టిస్‌ మిశ్రాతో రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. జస్టిస్‌ పి.కె.మిశ్రా ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతూ.. అక్కడే ఇటీవల తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టుకు బదిలీ కావడంతో ఈరోజు హైకోర్టులో వీడ్కోలు పలికారు. ఇవాళ సాయంత్రం ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా విజయవాడ చేరుకున్నారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై సీఎం కార్యదర్శి ముత్యాలరాజు, కృష్ణాజిల్లా కలెక్టర్ జె.నివాస్‌, నగర పోలీసు కమిషనర్‌ బి.శ్రీనివాసులు సమీక్షించారు. సీఎం జగన్‌తో పాటు శాసనసభ స్పీకర్‌, శాసనమండలి ఛైర్మన్‌, మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు.. మొత్తం 200 మంది వరకు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

* నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఫెస్టివల్ మేళా, మినీ నుమాయిష్‌ను నిర్వహించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది. దసరా, దీపావళి పండుగల దృష్ట్యా ఫెస్టివల్ మేళా నిర్వహించబోతున్నామని సొసైటీ కార్యదర్శి ప్రభాశంకర్ తెలిపారు. ఈ నెల 11 నుంచి 31వ తేదీ వరకు 20 రోజుల పాటు ఈ మేళా ఉంటుందన్నారు. ఈ సంవత్సరం నుమాయిష్ నిర్వహించకపోవడంతో కరోనా కష్టాలలో ఉన్న చిన్న పరిశ్రమలు, చేతి వృత్తుల వారికి అవకాశం కల్పించేందుకు ఈ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేళాను 300 స్టాల్స్ తో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఫుడ్ కోర్ట్, కిడ్స్ ప్లేయింగ్ గేమ్స్, హ్యాండ్లూమ్స్, కశ్మీర్, రాజస్థాని డ్రెస్సెస్‌కు సంబంధించిన స్టాల్స్‌ అందుబాటులో ఉంటాయన్నారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అక్టోబర్ 11న సాయంత్రం 5 గంటలకు ఈ మేళాను ప్రారంభించనున్నారని ప్రభా శంకర్ తెలిపారు.

* పాకిస్థాన్ ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ ఖదీర్ ఖాన్ ఆదివారం కన్నుమూశారు. పాక్‌ అణుశాస్త్ర పితామహుడిగా గుర్తింపు తెచ్చుకున్న 85 ఏళ్ల ఖదీర్ ఖాన్ అనారోగ్యం కారణంగా ఇస్లామాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పాక్‌ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్‌ రషీద్‌ఖాన్‌ వెల్లడించారు. ఆయనకు కొవిడ్‌ లక్షణాలు కూడా ఉన్నట్లు తెలిపారు. ముస్లిం దేశాల్లో మొదటి అణ్వాయుధ దేశంగా పాకిస్థాన్‌ను తీర్చిదిద్దడంలో ఖాన్‌ కీలకపాత్ర పోషించారు. ఖదీర్ ఖాన్ మృతికి సంతాపం తెలిపిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్విటర్‌ వేదికగా ఆయన సేవల్ని కొనియాడారు.

* రైల్వేలను ప్రధానంగా వేదిస్తున్న సమస్యల్లో ఉమ్మివేతలు ఒకటి. బోగీల్లో ఎక్కడ చూసినా వాటి మరకలే ఉంటాయి. వీటిని తొలగించేందుకు రైల్వే శాఖ దాదాపు ఏటా రూ.1200 కోట్లు, వేల లీటర్ల నీటిని వినియోగించాల్సి వస్తోంది. అటు రైల్వేతో ఇటు ప్రయాణికులూ ఉమ్మివేతల వల్ల ఇబ్బంది పడుతుంటారు. గుట్కా, పాన్‌ మసాలా వాడే అలవాటు ఉన్నవారు ఆ బోగీలో ఉంటే అందులో ప్రయాణించే తోటి ప్రయాణికుల పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ముఖ్యంగా కరోనా వేళ ఇదో పెద్ద సమస్యగా మారింది. దీనికి చరమగీతం పాడేందుకు రైల్వే శాఖ సమాయత్తమైంది. బహిరంగంగా ఉమ్మివేతలను నివారించేందుకు చిన్నపాటి పౌచ్‌లను విక్రయించే వెండింగ్‌ మెషీన్లు, కియోస్క్‌లను పశ్చిమ, ఉత్తర, సెంట్రల్‌ రైల్వే జోన్‌ పరిధిలోని 42 స్టేషన్లలో ఏర్పాటు చేస్తోంది. ఒక్కో పౌచ్‌ ధర రూ.5 నుంచి రూ.10గా ఉంటుంది.

* కరోనా వైరస్‌ మహమ్మారిపై జరుగుతోన్న పోరులో భారత్‌ మరో మైలు రాయిని అధిగమించింది. కరోనా వైరస్‌ను నివారించే టీకాల పంపిణీలో అత్యంత వేగంగా 95 కోట్ల వ్యాక్సిన్‌ పంపిణీలను పూర్తి చేసుకొని 100 కోట్ల దిశగా అడుగులు వేస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్విటర్‌లో వెల్లడించారు. ‘‘భారత్‌ 95 కోట్ల కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ డోసుల పంపిణీని త్వరితగతిన పూర్తి చేసింది. 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించే దిశగా అడుగులు వేస్తోంది. మీరు త్వరగా వ్యాక్సిన్‌ తీసుకొని ఇతరులనూ ప్రోత్సహించండి’’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

* డ్రగ్స్‌ దందాను పోలీసులు ఎన్నిరకాలుగా అడ్డుకున్నా.. ముఠా సభ్యులు పలు విధాలుగా సరఫరా చేస్తూనే ఉన్నారు. తాజాగా ముంబయి క్రూజ్‌ నౌకలో జరిగిన రేవ్‌ పార్టీలో ఓ మహిళా నిందితురాలు శానిటరీ న్యాప్‌కిన్‌లో డ్రగ్స్‌ తీసుకెళ్లినట్లు తేలింది. ఆమెనుంచి ఐదు గ్రాముల డ్రగ్స్‌ను నార్కొటిక్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు మొత్తం 19మందిని అరెస్టు చేసినట్లు ఎన్‌సీబీ అధికారులు తెలిపారు.

* రొమ్ము క్యాన్సర్‌ పట్ల అవగాహన కల్పించడంతో పాటు పరీక్షలను చేయించుకునే విధంగా ప్రోత్సహించేలా స్కానింగ్‌ సేంటర్లను ఏర్పాటు చేయాలని ప్రముఖ సినీ నటుడు రానా దగ్గుబాటి అన్నారు. గచ్చిబౌలిలోని ఆంకో క్యాన్సర్ సేంటర్‌లో పింక్‌ కాన్వాస్‌ పేరిట నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రానా.. పింక్ క్యాన్వాస్ బ్రోచర్‌ను విడుదల చేశారు. అనంతరం రానా మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో అతి ముఖ్యమైన ప్రజారోగ్య సమస్యగా రొమ్ము క్యాన్సర్‌ నిలుస్తుంది. హైదరాబాద్‌ లాంటి మెట్రో నగరాల్లో రొమ్ము క్యాన్సర్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. 45 సంవత్సరాలు దాటిన మహిళలు తప్పనిసరిగా క్యాన్సర్‌ పరీక్షలు చేయించుకోవాలి. ఈ కార్యక్రమంలో ఆంకో డాట్‌ కామ్‌ సహ వ్యవస్థాపకులు, చీఫ్‌ ఆంకాలజిస్ట్‌ డా. అమిత్‌ జొత్వానీ, డా. శిఖర్‌ కుమార్‌ (మెడికల్‌ ఆంకాలజిస్ట్‌), డా. రవిచంద్ర.వి (సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌), డా. లలితా రెడ్డి.కె (రేడియేషన్‌ ఆంకాలజిస్ట్‌) తదితరులు పాల్గొన్నారు.

* యూపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. విజయవాడలో 29 కేంద్రాలు ఏర్పాటు చేయగా 18,674 అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ఓ పరీక్ష పూర్తయింది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు మరో పరీక్ష జరగనుంది. ఈ-అడ్మిట్ కార్డుతో పాటు గుర్తింపు పత్రం తెచ్చుకున్న అభ్యర్థులనే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. సెల్‌ఫోన్‌, బ్లూటూత్, క్యాలిక్యులేటర్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించలేదు. కొవిడ్ నేపథ్యంలో మాస్కులు ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించడం తదితర చర్యలను అధికారులు పక్కాగా చేపట్టారు.

* ఆస్ట్రేలియా-భారత్‌ మధ్య శనివారం రాత్రి జరిగిన రెండో టీ20లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. ఆసీస్‌ ఛేదనలో భారత పేసర్‌ శిఖా పాండే వేసిన ఓ బంతి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లో ఆమె వేసిన రెండో బంతికి ఆస్ట్రేలియా బ్యాటర్‌ అలీసా హేలీ క్లీన్‌బౌల్డ్‌ అయింది. ఆఫ్‌ స్టంప్‌ ఆవల పడిన బంతి వికెట్లకు దూరంగా వెళుతుందని అనిపించినా.. అనూహ్యంగా ఇన్‌స్వింగై వికెట్లను ఎగరగొట్టింది. దీంతో అక్కడున్న వారే కాకుండా మ్యాచ్‌ చూస్తున్నవారూ ఆశ్చర్యపోయారు. గొప్పగా ఇన్‌ స్వింగ్‌ వేశావంటూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ వసీమ్‌ జాఫర్‌ దీన్ని ‘బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ’గా అభివర్ణించాడు. మరికొందరు కూడా ఇదే వ్యాఖ్యలు చేస్తూ నమ్మశక్యంగా లేదంటూ కొనియాడుతున్నారు.

* దసరా పండుగ సందర్భంగా నడిపే బస్సులకు ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. గడిచిన ఐదు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1.30 కోట్ల మంది ప్రయాణికులను టీఎస్ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసిందన్నారు. ప్రయాణికుల సౌకర్యం, వారి భద్రతే ధ్యేయంగా ఆర్టీసీ సేవలు అందిస్తోందని వెల్లడించారు. ఆర్టీసీలో ప్రయాణిస్తూ ప్రయాణికులు చూపించే ఆదరాభిమానాలే సంస్థ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తాయని సజ్జనార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.

* ట్రంప్‌ మూర్ఖుడు.. వాచాలత్వం ఎక్కువ.. తిక్క నిర్ణయాలు.. ఇలా వెక్కిరించిన వారంతా ఒక్క విషయంలో ఆయన్ని మెచ్చుకొంటారు. చైనాతో ఎలా వ్యవహరించాలో అమెరికాకు నేర్పించారు.. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసిన ఓ పని తాజాగా వెలుగులోకి వచ్చింది.. ఇది తెలుసుకొన్న చైనాకు గొంతులో తడారిపోయింది..! డ్రాగన్‌ను అంత ఆందోళనకు గురిచేసిన ట్రంప్‌ నిర్ణయం ఏమిటో తెలుసా..? తైవాన్‌కు అమెరికా సైన్యాన్ని పంపించడం..! తాజాగా వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఇటీవల ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. విషయం తెలుసుకొన్న చైనా గగ్గోలు పెట్టడం మొదలుపెట్టింది. అమెరికాకు చెందిన ఒక స్పెషల్‌ ఆపరేషన్స్‌ యూనిట్‌ సైనికులు, ఒక గ్రూపు మెరైన్స్‌ సిబ్బంది దాదాపు ఏడాది నుంచి తైవాన్‌లో ఉంటున్నారు. వీరు అక్కడి సైనికులకు, మెరైన్‌ సిబ్బందికి యుద్ధవ్యూహాలపై శిక్షణ ఇస్తున్నారు. వీరిలో డజను మంది కమాండోలు, గుర్తుతెలియని సంఖ్యలో మెరైన్లు ఉన్నారు. కొన్నేళ్లుగా దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌ దూకుడు పెరిగిపోవడం, తైవాన్ ఎయిర్‌ డిఫెన్స్‌ జోన్‌లోకి విమానాలను పంపడం వంటి దౌర్జన్యపూరిత చర్యలతో అమెరికా ఈ నిర్ణయం తీసుకొంది. ట్రంప్‌ హయాంలో కమాండోలను తైవాన్‌కు పంపించారు. ప్రస్తుతం వారు అక్కడ పనిచేస్తున్నారా..? లేదా..? అన్న విషయం బయటకు వెల్లడికాలేదు. కానీ, మెరైన్స్‌ మాత్రం ఇప్పటికీ అక్కడే ఉన్నట్లు సమాచారం.