Business

రెట్టింపైన D-Mart లాభాలు-వాణిజ్యం

రెట్టింపైన D-Mart లాభాలు-వాణిజ్యం

* డి-మార్ట్‌ విక్రయ కేంద్రాలు నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ జులై‌- సెప్టెంబరు త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.417.76 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కిందటేడాది ఇదే సమయంలో నమోదైన రూ.198.53 కోట్లతో పోలిస్తే లాభం రెట్టింపునకు పైగా పెరగడం గమనార్హం. కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ.5,306.20 కోట్ల నుంచి 46.79 శాతం పెరిగి రూ.7,788.94 కోట్లకు చేరింది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం వ్యయాలు రూ.7,248.74 కోట్లుగా నమోదయ్యాయి. ఏడాది క్రితం ఇదే సమయంలో ఇవి రూ.5,046.69 కోట్లుగా ఉన్నాయి. స్టాండలోన్‌ పద్ధతిలో ఆదాయం రూ.5,218.15 కోట్ల నుంచి రూ.7,649.64 కోట్లకు పెరిగింది. ఏడాదిక్రితం ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఆదాయాల్లో 46.6 శాతం వృద్ధి ఉంది.

* మనం ఏదైనా ఏటీఎంకు వెళ్లి నగదు విత్‌ డ్రా చేసినప్పుడో, లేదా దుకాణంలో వస్తువులు కొనుగోలు చేసినప్పుడో మనకు చిరిగిన నోట్లు, మురికిగా ఉన్న కరెన్సీ నోట్లు రావడం అనేక సందర్భాల్లో జరుగుతుంటుంది. బయట ఎవరికి ఇచ్చినా వాటిని తీసుకోరు. ఈ క్రమంలో మనం చాలా అవస్థలు ఎదుర్కొంటుంటాం. అయితే, ఇలాంటి కరెన్సీ నోట్లు వస్తే ఏం చేయాలి? ఎలా మార్చుకోవాలనే అంశంపై ఆర్‌బీఐ పలు నిబంధనలు సూచించింది. వాటి ప్రకారం మీ వద్ద ఉన్న ఖరాబైన నోట్లను మార్చుకొని కొత్త నోట్లు పొందొచ్చు.

* ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. చిరిగిపోయిన/ఖరాబైన నోట్లను బ్యాంకుల వద్ద సులభంగా మార్చుకోవచ్చు. ఒకవేళ అవి నకిలీ నోట్లు అయితే తప్ప బ్యాంకులు వాటిని తీసుకొనేందుకు నిరాకరించడానికి వీల్లేదు. ఏ బ్యాంకు అయినా చిరిగిన నోట్లను తీసుకోకపోతే మీరు నేరుగా ఆర్‌బీఐకి ఫిర్యాదు చేయవచ్చు. అలాగైతే, ఆ బ్యాంకులపై చర్యలు ఉంటాయి.

* కరెన్సీ నోట్లు చిన్న ముక్కలుగా ఉన్నా.. చిరిగిపోయిన నోట్‌లో ఏదైనా భాగం మిస్‌ అయినా కూడా ఏ బ్యాంకులో అయినా మార్చుకోవచ్చు. సాధారణంగా చిరిగిన నోట్లను కూడా ఏదైనా బ్యాంకు శాఖలో, ఆర్‌బీఐ కార్యాలయంలో మార్చుకొనే వీలు ఉంది. ఇందుకోసం ఎలాంటి ఫారం కూడా నింపాల్సిన అవసరం లేదు.

* కరెన్సీ నోటుకు పెద్దగా దెబ్బతినకుండా ఎక్కడో చిన్న చిన్న ముక్కలుగా చిరిగితే వాటిని మార్చుకొని పూర్తి మొత్తంలో డబ్బును పొందొచ్చు. అదే, అదే పూర్తిగా చిరిగిన నోట్లకు మాత్రం మన వద్ద ఉన్న కరెన్సీ మొత్తం విలువలో కొంత శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

* అయితే, ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. రూ.1 నుండి రూ.20 వరకు నోట్ల విషయంలో మాత్రం సగం మొత్తం ఇచ్చే నిబంధన ఏమీ వర్తించదు. అందువల్ల ఈ నోట్లకు పూర్తిగా చెల్లిస్తారు.

* ఒకవేళ బాగా కాలిపోయిన, పూర్తిగా నలిగి ముక్కలైన కరెన్సీ నోట్లను మాత్రం మార్చుకోవడం కుదరదని ఆర్‌బీఐ నిబంధన పేర్కొంటోంది. అలాంటి కరెన్సీని ఆర్‌బీఐ ప్రత్యేకంగా జారీచేసే కార్యాలయాల్లో మాత్రమే డిపాజిట్‌ చేసే వీలు ఉంటుంది. ఇలాంటి కరెన్సీ నోట్లతో బ్యాంకుల్లో మీరు మీ బిల్లులు లేదా పన్నులు చెల్లించుకోవచ్చు.

* ప్ర‌స్తుత ఆర్ధిక సంవ‌త్స‌రం తొలి ఆరు నెల‌ల్లో నాలుగు దేశీ ఐటీ దిగ్గ‌జాలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాల‌జీస్ ఏకంగా ల‌క్ష మంది ఉద్యోగుల‌ను హైర్ చేసుకున్నాయి. 2019-20తో పోలిస్తే ఈ నియామ‌కాలు రెట్టింపు కాగా, కరోనా మ‌హ‌మ్మారి ప్ర‌బ‌లంగా ఉన్న 2020-21 ఆర్ధిక సంవ‌త్స‌రంతో పోలిస్తే ఇది ఏకంగా 13 రెట్లు అధికం. ప్ర‌స్తుత ఆర్ధిక సంవ‌త్స‌రం ప్ర‌ధ‌మార్ధంలో నాలుగు ఐటీ కంపెనీలు క‌లిసి 1,02,234 మందిని రిక్రూట్ చేసుకున్నాయి. ఐటీ సేవ‌ల‌కు డిమాండ్ గ‌ణ‌నీయంగా మెరుగుప‌డింద‌నేందుకు నూత‌న టెకీల నియామ‌కం విస్ప‌ష్ట సంకేత‌మ‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

* అమెరికా ముడి చ‌మురు బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధ‌ర బ్రిట‌న్‌లో 85 డాల‌ర్లు దాటింది. 2018 త‌ర్వాత బ్రెంట్ క్రూడ్ ధ‌ర ఈ స్థాయికి చేరుకోవ‌డం ఇదే మొద‌టిసారి. గ్లోబ‌ల్ ఎన‌ర్జీలో ఇది తాజా మైలురాయి. విద్యుత్ మార్కెట్ కోసం బొగ్గు, స‌హ‌జ‌వాయువు కోసం అద‌న‌పు డిమాండ్ పెరిగిపోయిన నేప‌థ్యంలో శుక్ర‌వారం ఇంట్రాట్రేడింగ్‌లో బ్రెంట్ క్రూడ్ ఈ స్థాయికి పెరిగింది. బ్రెంట్ క్రూడ్ వ‌రుస‌గా ఆరోవారం లాభాలు పొందింది. మ‌రోవైపు అధిక క్రూడ్ కొనుగోలు చేయ‌డానికి ప్రైవేట్ రిఫైన‌రీల‌కు చైనా అనుమ‌తి ఇచ్చింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రంట్ కొర‌త దూసుకొస్తున్న‌ది. యూర‌ప్ దేశాల్లో విద్యుత్ ఉత్ప‌త్తి కోసం వినియోగించే లిక్విఫైడ్ నాచుర‌ల్ గ్యాస్ ధ‌ర 500 రెట్లు పెరిగాయి. గ‌తనెల‌తో పోలిస్తే 130 శాతం పెరిగాయి. దీంతో యూర‌ప్ దేశాల్లో ఫ‌ర్టిలైజ‌ర్స్ ఉత్ప‌త్తిలో కోత విధించాయి. మ‌రోవైపు ఆసియా దేశాలు రికార్డుస్థాయిలో డ‌బ్బు చెల్లించి గ్యాస్ కొనుగోలు చేయాల్సి వ‌స్తోంది.