ScienceAndTech

డిజిటల్ కరెన్సీలో ఇండియాకు 5వ స్థానం

డిజిటల్ కరెన్సీ దిశగా ప్రపంచ దేశాలు ముందుకు వెళ్తున్నాయి.సుమారు 81 దేశాలలో వినియోగం వేగవంతమైనట్లు డిజిటల్ కరెన్సీ ట్రాకర్ నివేదికలు చెబుతున్నాయి.నాలుగు అతి పెద్ద బ్యాంకులు యు ఎస్ ఫెడరల్ రిజర్వ్,యురోపియన్ సెంట్రల్ బ్యాంక్,బ్యాంక్ అఫ్ జపాన్, బ్యాంక్ అఫ్ ఇంగ్లాండ్ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది.బహమాస్,కిట్స్ & నేవిస్,ఆంటిగ్వా & బార్బుడా,సెయింట్ లూసియా, గ్రెనడా దేశాలలో డిజిటల్ కరెన్సీ వ్యవస్థ సంపూర్ణంగా అందుబాటులోకి వచ్చింది. స్వీడన్,దక్షిణా కొరియా మొదలైన 14 దేశాలు పూర్తి వాడకం దిశగా అడుగులు వేస్తున్నాయి.కరోనా కాలానికి ముందు సిద్ధాంతానికే (థియరీ) పరిమితమనుకున్న ఈ వ్యవస్థ ఇప్పుడు కొత్తరూపు తీసుకుంటోంది.దీనికి తోడు క్రిప్టో కరెన్సీ ప్రవాహం పెరుగుతోంది.మన దేశంలోనే సుమారు పది కోట్లమందికి పైగా క్రిప్టో కరెన్సీ కలిగివున్నారంటే! వినియోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.కొన్ని దేశాల్లో ఈ కరెన్సీని అధికారికం చేశారు. చాలా దేశాల్లో వీటిని కొనుగోలు చేయడాన్ని చట్టరీత్యా నేరంగానే భావిస్తున్నారు.మన దేశంలో,2018లో రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా క్రిప్టో కరెన్సీని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.ఐతే,సుప్రీం కోర్టు ఆర్ బి ఐ నిర్ణయాన్ని తోసిపుచ్చింది.క్రిప్టో కరెన్సీని ఆమోదించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.’క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ అఫ్ అఫీసియల్ డిజిటల్ కరెన్సీ’ బిల్లు త్వరలో ఆమోదం పొందే అవకాశాలు ఉన్నాయి.

బిల్లు రూపకరణ జరుగుతోంది.ప్రస్తుతం ప్రపంచంలోనే క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేస్తున్న దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది.దీనిని బట్టి డిజిటల్ కరెన్సీ యుగం వైపు మన ప్రయాణం ఎంత వేగవంతం అవుతోందో తెలుస్తూనే ఉంది.10.7కోట్లమంది భారతీయులు క్రిప్టో కరెన్సీని కలిగిఉన్నట్లు బ్రోకర్ చూస్ అనే సంస్థ తెలియపరిచింది.ఉక్రెయిన్, రష్యా,కెన్యా,యూ ఎస్ ఏ తర్వాత ఐదవ స్థానంలో భారత్ ఉంది ( జనాభా శాతం ప్రకారం).సంఖ్య ప్రకారమైతే మనమే ప్రథమ స్థానంలో ఉన్నాము.ఈ కరెన్సీని అందిపుచ్చుకోవడం,అలవాటు పడడం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు మంచిది కాదని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐ ఎం ఎఫ్ ) వ్యాఖ్యానిస్తోంది.రిస్క్ లు కూడా ఎక్కువగా ఉంటాయని చెబుతోంది.హాకింగ్ కు గురికావడం,నాణేల పంపకంలో పారదర్శకత లోపించడం మొదలైనవి జరిగే ప్రమాదాలు ఉన్నాయని హెచ్చరిస్తోంది.ఇందులో పెట్టుబడి పెట్టేవారికి భద్రత కూడా ప్రశ్నార్ధకం అంటోంది.మొత్తంమీద,క్రిప్టో కరెన్సీపై ఐ ఎం ఎఫ్ అనేక సందేహాలను,అనుమానాలను వ్యక్తం చేస్తోంది.దేశంలో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టే విషయమై,ఆ మధ్య రిజర్వ్ బ్యాంక్ తన నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తామని ప్రకటించింది.అవసరాలు, అవకాశాలు,మంచిచెడు మొదలైన అంశాలపై ఆర్ బి ఐ అంతర్గత కమిటీ అధ్యయనం ఆరంభించింది.బిట్ కాయిన్స్, వర్చువల్ కరెన్సీలకు దేశంలో ఆదరణ పెరుగుతోంది.వీటి వల్ల ఇబ్బందులు,కొత్త తలనొప్పులు లేకపోలేదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

వివిధ ప్రభుత్వాలు,ద్రవ్య నియంత్రణ సంస్థలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టేవారిని లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్ళు పెరుగుతున్నారు.యాప్ లను రూపొందించి వినియోగదారుల ఖాతాలను కొల్లగొడుతున్నారు.ట్రెండ్ మైక్రో అందించే నివేదిక ప్రకారం ప్లేస్టోర్ లో 120 నకిలీ క్రిప్టో కరెన్సీ యాప్ లు ఉన్నట్లు తెలుస్తోంది.బిట్ కాయిన్ అంటే? ఇది ఏ దేశానికీ చెందిన కరెన్సీ కాదు.ఏ నియంత్రణ పరిధిలోకి కూడా రాదు.ఇది అంతర్జాల వర్చువల్ కరెన్సీ. దీనిని ప్రైవేట్ కరెన్సీగానూ పిలుచుకుంటారు.ఎక్కువ లాభాలు వస్తాయని పెట్టుబడి పెట్టేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.ఎన్ ఎఫ్ టీ, కాయిన్ బేస్ మొదలైనవి కూడా మార్కెట్ లో చలామణిలో ఉన్నాయి.వీటి వల్ల నష్టపోతున్నవారి సంఖ్య కూడా చాలా ఎక్కువే.చరిత్రలో, డబ్బు అనేక రూపాలను సంతరించుకుంటోంది.డిజిటల్ రూపం నేటికి అత్యాధునికం.భవిష్యత్తులో మరెన్ని రూపాలు వస్తాయో? మనిషి ఆదాయాన్ని పెంచుకొనే మార్గంలో చేస్తున్న అన్వేషణలో నేడు క్రిప్టో కరెన్సీ వంటివి రాజ్యమేలుతున్నాయి. తాత్కాలిక లాభాలను దృష్టిలో పెట్టుకోకుండా,భవిష్యత్, భద్రత,నికరవృద్ధి మొదలైనవాటిని పరిగణలోకి తీసుకోవాలి.పారదర్శకత, బాధ్యతాయుతమైన విధానాలు ముఖ్యం. ఆధునికత దిశగా జరుగుతున్న ప్రయాణంలో అసలుకు మోసం రాకూడదు.