Editorials

న్యాయం కోసం యువత పోరాడాలి-CJI

న్యాయం కోసం యువత పోరాడాలి-CJI

పేదలకు న్యాయం అందడమే అంతిమ లక్ష్యంగా ఉండాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. హైదరాబాద్‌లోని నల్సార్‌ విశ్వవిద్యాలయం 18వ స్నాతకోత్సవానికి జస్టిస్‌ ఎన్వీరమణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భాష ఏదైనా సమాచార మార్పిడి సమర్థంగా, ఆకర్షణీయంగా ఉండాలని సూచించారు. హక్కులు, న్యాయం కోసం పోరాడేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తమ శక్తిని వినియోగించుకునే మార్గమే యువత భవిష్యత్‌ను నిర్దేశిస్తుందన్నారు. న్యాయ సమానత్వం కోసం న్యాయవాదులు కృషి చేయాలని కోరారు. న్యాయ విద్యార్థులు క్షేత్రస్థాయిలో ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. నల్సార్‌ న్యాయవిశ్వవిద్యాలయంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, బర్కత్‌పురాలో చిన్న భవనంలో ప్రారంభమైన కళాశాల నేడు అత్యున్నత స్థాయికి ఎదిగిందన్నారు. తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ సతీశ్‌చంద్ర, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు స్నాతకోత్సవానికి హాజరయ్యారు.

వరంగల్‌తో తనకు అవినాభావ సంబంధం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. హనుమకొండలో పది కోర్టుల భవన సముదాయం ప్రారంభించిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాళోజీ స్ఫూర్తితో తెలుగులో మాట్లాడుతున్నానని చెప్పారు. ‘‘కవులు, స్వాతంత్ర్య పోరాట యోధులు, విప్లవకారులు తిరిగిన నేల ఓరుగల్లు. వరంగల్‌తో నాకు అవినాభావ సంబంధం ఉంది. గతంలో ఇక్కడ ఆర్‌ఈసీలో కార్యక్రమాలకు హాజరయ్యా. ఇక్కడ నాకు బంధువులు, మిత్రులు ఉన్నారు. దేశానికి ప్రధానిని ప్రసాదించిన ప్రాంతం ఓరుగల్లు. నియంతృత్వ, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటాలకు ఇది పుట్టినిల్లు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు దాశరథి. ఆయన గర్జన పరపీడన విముక్తికి, పోరాటాలకు ఊపిరినిచ్చింది. పోరుగల్లుకు.. ఓరుగల్లుకు.. వరంగల్లుకు వందనం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దివ్యక్షేత్రాన్ని సందర్శించి ఆనందించి మురిసిపోయా. మనకున్న గొప్ప చారిత్రక సంపదను యునెస్కో గుర్తించింది. ఇది అందరూ గర్వించాల్సిన విషయం. వేయి స్తంభాల ఆలయం శిలా, కళా వైభవానికి ఖ్యాతి. ఈ ఆలయం చూసేందుకు రెండు కళ్లూ చాలవు’’ అని సీజేఐ అన్నారు.