Politics

‘వైకాపాలో’ కొత్త జిల్లాల ‘ముసలం’ – TNI ప్రత్యేకం

‘వైకాపాలో’ కొత్త జిల్లాల ‘ముసలం’ – TNI ప్రత్యేకం

కొత్త జిల్లాల ఏర్పాట్లు వైకాపాలో దుమారం లేపుతోంది. ప్రతిపక్షాల కన్నా అధికార పార్టీ నేతలు కార్యకర్తలే బాహాటంగా ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొన్ని చోట్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వైకాపా కొత్త జిల్లాల ఏర్పాట్లను మా ప్రాంతాలకు తీవ్ర అన్యాయం జరుగుతందని, దీనిని మార్పు చేయాలని బాహాటంగానే నిరసనలు వ్యక్తపరుస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాట్ల పట్ల చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు ప్రస్తుతం ఉన్న అన్ని జిల్లాల్లో స్థానిక ప్రజల నుండి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, గుంటూరు తదితర జిల్లాల్లో నిరసనల జోరు రోజురోజుకు తీవ్రమవుతోంది. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ సర్కారుకు వ్యతిరేక గణాలు వినిపిస్తున్నాయి. రాజంపేటలో ప్రజలు చేపట్టిన ఉద్యమం రాష్ట్ర వ్యాపితంగా చర్చకు దారి తీసింది. రాజంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయకపోతే తాము పార్టీని వీడతామని వైకాపా పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద పెద్ద హోర్డింగులు, బ్యానర్లను ప్రదర్శిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఉన్న ముగ్గురు తెదేపా శాసనసభ్యులు కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రకాశం జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రికి బహిరంగంగా లేఖ రాశారు. గుంటూరు జిల్లాలో పెదనందిపాడును తీసుకునివెళ్ళి మారుమూల గురజాలలో కలుపుతామని చేసిన ప్రతిపాదనను గుంటూరు జిల్లా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కృష్ణాజిల్లాలో కొత్తగా ఏర్పడే జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టడం పట్ల భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. కొత్తగా ఏర్పడే జిల్లాలను కృష్ణాజిల్లాలోనే ఉంచాలని ఎన్టీఅర్ స్వస్థలం గుడివాడ ప్రాంతంలో ఉన్నందున అక్కడ ఉన్న పాత జిల్లాకు ఆయన పేరు పెడితే బాగుంటుందని ఆప్రాంత వాసులు కోరుతున్నారు. మొత్తం మీద కొత్త జిల్లాల ఏర్పాటు వైకాపా నాయకత్వానికి, ముఖ్యమంత్రి జగన్ కు తీవ్రమైన తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. వీటన్నిటిని ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.