DailyDoseNRI-NRT

భారత్ లో భారీగా పెరిగిన బిలియనీర్ లు

భారత్ లో భారీగా పెరిగిన బిలియనీర్ లు

దేశంలో డాలర్ మిలియనీర్లు (రూ.7.5 కోట్ల వ్యక్తిగత సంపద ఉన్నవారు) పెరిగారు. గతేడాది 11 శాతం పెరిగినట్టు ఓ తాజా సర్వేలో తేలింది. కరోనా ప్రభావంలోనూ భారత్లో డాలర్ మిలియనీర్ల సంఖ్య 4.58 లక్షలను తాకినట్టు హురున్ రిపోర్ట్ వెల్లడించింది. అయితే 130 కోట్లకుపైగా జనాభా ఉన్న ఈ దేశంలో పెరుగుతున్న అసమానతలపై ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ఈ రిపోర్ట్ రావడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. ఇటీవల ఆక్స్ఫామ్ విడుదల చేసిన ఓ నివేదికలో టాప్-100 భారతీయుల సంపద 775 బిలియన్ డాలర్లకు ఎగిసిందని తేలింది. అలాగే గతేడాది 4.6 కోట్ల మంది కటిక పేదరికంలోకి జారుకున్నారని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 2021లో తీవ్ర దారిద్య్రంలోకి వెళ్లిన జనాభాలో ఇది సగానికి సమానం కావడం గమనార్హం. దీంతో సంపన్నులు మరింత సంపదను పోగు చేసుకుంటున్నారని, పేదలు ఇంకా పేదరికంలోకి వెళ్తున్నారన్న ఆందోళనలు రేకెత్తాయి. ఈ క్రమంలో హురున్ రిప్టోర్ట్ కూడా ఈ ఆందోళనల్ని మరింత పెంచేలా ఉన్నాయి.

*దాతృత్వానికి దూరంగా..
సర్వేలో కేవలం 19 శాతం డాలర్ మిలియనీర్లే సమాజానికి తమ సంపదలో ఎంతోకొంత తిరిగిచ్చేయాలని భావిస్తున్నారు. విప్రో అజీం ప్రేమ్జీ వంటివారు మెజారిటీ సంపదను దాతృత్వానికే వెచ్చిస్తున్న నేపథ్యంలో ఇది మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకున్నది. పన్నుల చెల్లింపునూ సామాజిక బాధ్యతగా అనుకుంటున్నవారు కూడా తక్కువే ఉండటం ఆందోళనకరంగా హురున్ పేర్కొనడం గమనార్హం. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడుల్లో రిస్క్లు తీసుకోలేమనీ వీరు చెప్తున్నారు.

**2026 నాటికి 6 లక్షలకు..
2026 నాటికి దేశంలో డాలర్ మిలియనీర్ల సంఖ్య 30 శాతం ఎగబాకి 6 లక్షలను తాకవచ్చని హురున్ రిపోర్ట్ అంచనా వేసింది. కాగా, ముంబైలో అత్యధికంగా 20,300 మంది డాలర్ మిలియనీర్లు ఉన్నట్టు హురున్ తెలియజేసింది. ఆ తర్వాత ఢిల్లీలో 17,400, కోల్కతాలో 10,500 మంది ఉన్నారు. ఇదిలావుంటే 2020తో పోల్చితే 2021లో వ్యక్తిగత, వృత్తిగత జీవితాల్లో సంతోషంగా ఉన్నామనుకునేవారి సంఖ్య 72 శాతం నుంచి 66 శాతానికి తగ్గింది. 350 మంది డాలర్ మిమిలియనీర్ల అభిప్రాయాలతో హురున్ ఓ సర్వే చేపట్టింది. ఇందులో ముగ్గురిలో ఇద్దరు తమ పిల్లలను చదువు కోసం విదేశాలకు పంపుతామన్నారు. వీరిలో అమెరికాకు తొలి ప్రాధాన్యం ఉండగా, ఆ తర్వాత బ్రిటన్, న్యూజిలాండ్, జర్మనీ దేశాలున్నాయి. అలాగే మూడేండ్లకోసారి తమ కార్లను మార్చేసి కొత్తవి కొంటున్నారు.