DailyDose

దేశంలో ఇప్పటివరకు ఎంతమందికి మరణశిక్ష విధించారు? ఎంతమందిని ఉరితీశారు?

దేశంలో ఇప్పటివరకు ఎంతమందికి మరణశిక్ష విధించారు? ఎంతమందిని ఉరితీశారు?

దేశ చరిత్రలో తొలిసారిగా ఇటీవల ఏకకాలంలో 38 మందికి మరణశిక్ష విధించారు. అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో దోషులకు ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. కాగా ఉరిశిక్ష ఖరారు చేసినా దోషులకు ఎందుకు శిక్ష అమలు కావడం లేదనే దానిపై చర్చ జరుగుతోంది. దేశంలో ఇప్పటివరకు ఎంత మందికి మరణశిక్ష విధించారు? ఎంత మందికి ఉరిశిక్ష అమలయ్యిందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.  రాజ్యాంగ నిపుణుడు విరాగ్ గుప్తా భాస్కర్‌లో ప్రచురించిన ఒక కథనంలో ఉరిశిక్షకు సంబంధించి గణాంకాల గురించిన సమాచారం అందించారు. ఈ కథనంలోని నేషనల్ లా యూనివర్సిటీ డెత్ పెనాల్టీ రీసెర్చ్ ప్రాజెక్ట్ ప్రకారం, దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ఐదు వేల మందికి పైగా దోషులకు మరణశిక్ష విధించారని పేర్కొన్నారు. అయితే వీరిలో చాలా తక్కువ మందికే ఉరిశిక్ష అమలయ్యింది. పలు చట్టపరమైన ప్రక్రియల కారణంగా చాలా మంది దోషులకు ఇంకా ఉరిశిక్ష అమలుకాలేదు.

 *****ఇప్పటివరకు 1,414 మందిని మాత్రమే ఉరి తీశారు. దేశంలో మొదటి ఉరిని 1947, సెప్టెంబరు 9 న జబల్‌పూర్ సెంట్రల్ జైలులో అమలు చేశారు. నిర్భయ కేసులో నలుగురు దోషులకు 2020 మార్చి 20న తీహార్ జైలులో చివరిగా ఉరిశిక్ష విధించారు. ఎన్సీఆర్బీ తెలిపిన వివరాల ప్రకారం, దేశంలో డిసెంబర్ 2020 వరకు 442 మంది ఖైదీలకు మరణశిక్ష విధించారు. వారిలో 29 మందిని కోర్టు.. జీవిత ఖైదుగా మార్చింది. 413 మంది ఖైదీలను ఇంకా ఉరితీయాల్సి ఉంది. 2021 సంవత్సరం విషయానికొస్తే 144 మందికి మరణశిక్ష విధించారు. డిసెంబర్ 2021 వరకు జైలులో 557 మంది ఖైదీలు ఉన్నారు, వారికి మరణశిక్ష విధించిన తర్వాత కూడా ఉరి అమలుకాలేదు. దీనికి అనేక కారణాలున్నాయి. వాస్తవానికి దిగువ కోర్టులు మరణశిక్ష విధించినప్పుడు దానిని హైకోర్టు నిర్ధారించాల్సి వుంటుంది. అటువంటి పరిస్థితిలో హైకోర్టు చాలాసార్లు శిక్షను ఖరారు చేస్తుంది. ఇటువంటి కేసులు సుప్రీంకోర్టుకు వెళుతుంటాయి. దీని తర్వాత కాలం గడిచేకొద్దీ, పునఃపరిశీలన, క్యూరేటివ్ పిటిషన్, రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ వంటి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి పలు సాంకేతిక కారణాల వల్ల ఉరిశిక్ష అమలు త్వరితగతిన అమలుకు సాధ్యం కావడం లేదు.