DailyDose

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం పై TNI 23 కథనాలు

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం పై TNI  23 కథనాలు

1.ఐదో రోజు కొనసాగుతున్న యుద్ధం.. గగనతలంలో భీకరపోరు
ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధం ఐదోరోజు కూడా కొనసాగుతోంది. గగనతలంలో ఇరుదేశాల బలగాలు భీకరపోరుకు దిగాయి. ఉక్రెయిన్ రాజధాని కైవ్ నగరంపై సోమవారం వైమానిక దాడులు చేస్తామని రష్యా ప్రకటించింది.ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధంపై లైవ్ అప్ డేట్స్ ఇలా ఉన్నాయి..రష్యా సైన్యం జరిపిన దాడితో ఉక్రెయిన్ దేశంలో 352 మంది పౌరులు కూడా మరణించారు.మరో వైపు బెలారస్ సరిహద్దులో రష్యాతో శాంతి చర్చలు జరపడానికి ఉక్రెయిన్ అంగీకరించింది.రష్యా సైనిక దాడికి నిరసనగా యూరోపియన్ దేశాలతోపాటు ఉక్రెయిన్, బెల్జియం, ఫిన్లాండ్, కెనడా దేశాలు రష్యా విమానాలకు తమ గగనతలాన్ని మూసివేశాయి. అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు రష్యాపై కొత్త ఆర్థిక ఆంక్షలను కూడా ప్రకటించాయి.రొమేనియా నుంచి 249 మంది భారతీయులతో బయలుదేరిన విమానం ఢిల్లీలో దిగింది.ఉక్రెయిన్‌లోని చెర్నిహివ్‌లోని రెసిడెన్షియల్ భవనంపై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో భవనంలోని రెండు అంతస్తుల్లో మంటలు చెలరేగాయి.అమెరికా అధ్యక్షుడు బిడెన్ ఉక్రెయిన్‌పై సోమవారం నాటో నేతలతో సమావేశం కానున్నారు.యూరోపియన్ యూనియన్ తన భూభాగంలో ల్యాండింగ్, టేకాఫ్, ఎగురుతున్న రష్యన్ విమానాలను నిషేధించింది.సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ రష్యా ఆస్తుల నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాలను యూరోపియన్ యూనియన్ నిషేధించింది.ఉక్రెయిన్ రాజధాని కైవ్, ఖార్కివ్‌లలో పేలుళ్లు వినిపించాయని ప్రభుత్వ ఏజెన్సీ తెలిపింది.
02282022141728n42
2. ఉక్రెయిన్ ఉదంతం ప్రపంచ ప్రజలకో గుణపాఠం
ఉక్రెయిన్ పై రష్యా స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ జరుపుతోంది. ఒళ్ళు గగుర్పొడిచే భయానక దృశ్యాలు మనకు కనబడుతున్నాయ్. కేవలం 48 గంటల్లోనే ప్రశాంతంగా ఉండే ఉక్రెయిన్ దేశం చిన్నాభిన్నమైపోయింది. ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ ఎక్కడో బంకర్లో తలదాచుకుని ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. దేశాధ్యక్షుల పరిస్థితి దేవుడెరుగు. సాధారణ జనజీవనం మాత్రం అల్లకల్లోలమైపోయింది. జనం ప్రాణభయంతో పరాయి దేశాలకు చేరుకుంటున్నారు. ఇంతటి విధ్వంసానికి, వినాశనానికి, జన హననానికి ముమ్మాటికీ ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీయే కారణం. ఇంతటి నష్టం జరుగుతుందని ఒక దేశాధ్యక్షుడిగా జెలెన్ స్కీకి తెలీదా? తన శక్తి సామర్ధ్యాలేవిటో, తాను కయ్యానికి కాలు దువ్వుతున్న రష్యా శక్తిసామర్థ్యాలేవిటో ఆయనకు తెలీదా? తనపై తనకు అతి విశ్వాసమా? నాటో దేశాల మద్దతు లభిస్తుందన్న అత్యాశా? ఏది ఆయనను యుద్ధం దిశగా నడిపించి ఉంటుంది?నిజానికి ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ ఫక్తు రాజకీయవేత్త కాదు. ఆయన ఒక సినిమా నటుడు. అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక కమెడియన్. ఒక దేశాన్ని పాలించడం అంటే సినిమాల్లో కామెడీ చేసినట్టు కాదు కదా? రాజకీయాలలో, దేశ పాలనలో, ప్రపంచ పరిస్థితుల్లో ఎన్నో విషయాలను అనుక్షణం గమనిస్తూ, బేరీజు వేసుకుంటూ, గతాన్ని పరిశీలించుకుంటూ, వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ, భవిష్యత్తును అంచనా వేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. ఎందరితోనో, ఎన్నో విధాలుగా డీల్ చేయాల్సి ఉంటుంది. అవగానా రాహిత్యమో, అతి విశ్వాసమో, వారిపై వల్లమాలిన అభిమానమో తెలీదుగానీ ఏమాత్రం పాలనానుభావం లేని సినీ పరిశ్రమకు చెందిన వారినే ఆయన తన సలహాదారులుగా, మంత్రివర్గ సభ్యులుగా పెట్టుకున్నారు.అందునా ఉక్రెయిన్, శక్తిమంతమైన ఈయూ, రష్యాల మధ్యన ఉన్నది. ఇరు పక్షాలతోనూ సయోధ్యతో మెలగడమే సరియైన విదేశాంగ విధానం. ఏ ఒక్క పక్షాన చేరినా రెండవ పక్షానికి విరోధులవుతాం కదా? ఇద్దరు బలవంతుల మధ్య ఒక బలహీనుడు ఇద్దరితో అణకువగా మసలుకుంటేనే కదా? లేకపోతే ఏదో ఒకనాడు ఎవరో ఒకరి చేతిలో తన్నులు తినక తప్పదు కదా? ఇది సహజమైన జీవన నియమమే కదా? మరి అంతటి దేశాధ్యక్షుడు ఇంత చిన్న లాజిక్ మిస్సయితే ఎలా?సరే పోనీ… ఎవరి బలాన్నో నమ్ముకుని ఈయన హద్దులు మరచి రంకెలు వేశాడనుకుందాం…. మరి వారెవరైనా ప్రత్యక్షంగా రంగంలోకి దిగారా? అండగా నిలిచి ఆదుకున్నారా? ఒక బలమైన వాడితో ప్రత్యక్ష వైరం పెట్టుకోవాలంటే అవతలి వాడు కూడాఎంతటి శక్తిమంతుడైనా ఎంతో కొంత ఆలోచిస్తాడు కదా? నిజానికి రష్యా వంటి శక్తివంతమైన దేశాన్ని ఢీకొట్టే స్థితిలో ప్రస్తుతం అమెరికా కూడా లేనట్టే. అమెరికా కూడా పైపైన పటాటోపం ప్రదర్శించడం మినహా ఎప్పుడూ ఎక్కడా తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించిన పాపాన పోలేదు. సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్ వంటి వారి ఆచూకీ తెలుసుకుని వారిని మట్టుబెట్టడానికే అమెరికా ఎంతో సమయాన్ని, శక్తిసామర్ధ్యాలను, ధనాన్ని వెచ్చించవలసి వచ్చింది. వియత్నాం, సిరియా, లిబియా, ఇరాక్ లలో పరిస్థితులు చక్కబెడతానంటూ వెళ్లి మరింత సంక్లిష్టం చేసొచ్చింది. ఇక ఆఫ్ఘనిస్థాన్లో అమెరికా చేసిన నిర్వాకం మనందరికీ తెలిసిందే. ఏడు సముద్రాలు ఈది ఏటి కాలువలో మునిగిన చందాన దశాబ్దాలపాటు ఆఫ్ఘనిస్థాన్లో తిష్ట వేసుకు కూర్చుని చివరికి ఆ తాలిబన్ల చేతికే ఆఫ్ఘన్ ను అప్పగించి వచ్చిన ఘన చరిత్ర అమెరికాది. అమెరికా ఇప్పుడు ఆర్థికంగా కూడా రష్యాను ఢీకొట్టే స్థితిలో లేదు. మరి అలాంటి అమెరికా తనకు యుద్ధంలో తోడుగా నిలుస్తుందని జెలెన్ స్కీ ఆశలు పెట్టుకుని ఉంటే… అంతకంటే అమాయకత్వం మరొకటి లేదనే చెప్పాలి. ఇప్పుడు అమెరికా అయుధాలందిస్తానన్నా ఉక్రెయిన్ అందుకునే స్థితిలో లేదే? అందుకోడానికి ఉక్రెయిన్ చేతిలో సైనికులే లేరే?
ఉక్రెయిన్ ను నాటో దేశాల సరసన కూర్చుండబెడితే రష్యా దూకుడుగా స్పందిస్తుందని ఫ్రాన్స్, జర్మనీలతో సహా ఐక్యరాజ్యసమితిలోని దేశాలన్నీ ఆది నుంచి అమెరికాను హెచ్చరిస్తూనే ఉన్నాయ్. అయినా ఆ హెచ్చరికలన్నిటినీ తోసిరాజని అమెరికా ఉక్రెయిన్ ను నాటో అక్కున చేర్చే ప్రయత్నం చేసింది. అదే ఇప్పుడు ఇంతటి విధ్వంసానికి కారణం అయ్యింది.ఉదాహరణకు చైనా తన మిలిటరీ బేస్ ను అమెరికా పొరుగునున్న కెనడాలోనో, మెక్సికోలోనో పెడతానంటే అమెరికా సైతం ఆ దేశాలపైకి యుద్ధానికి వెళ్లకుండా ఉంటుందా? ఏ దేశానికైనా తమ దేశ భవిష్యత్తు, భద్రత, సంక్షేమమే కదా ప్రధానం? ఇప్పుడు రష్యా కూడా సరిగ్గా అదే చేసింది. తనకు గిట్టని దేశాలతో స్నేహం కొనసాగిస్తూ తనకు పక్కలో బల్లెంలా మారిన ఉక్రెయిన్ పై ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తోంది.అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ వ్యవహరించిన తీరే అత్యంత అవగాహనా రహితమైనది, బాధ్యతారహితమైనది, విచారకరమైనది. జెలెన్ స్కీ తలచుకుంటే…. యుద్ధం జరుగకుండా ఆపే అవకాశం ఆయనకు చివరి క్షణం వరకూ ఉండింది. చర్చలు జరిపే అవకాశం ఉండింది. కానీ ఆయన ఆ దిశగా ప్రయత్నమే చెయ్యలేదు. సినిమాల్లోలా హీరోయిజం ప్రదర్శించాలని, ప్రజలలో తనకున్న జనాకర్షణను మరింతగా ఇనుమడింపజేసుకోవాలని భావించాడో ఏమిటో తెలీదు. ఇంత చేస్తాం, అంత చేస్తాం, అంతు చూస్తాం అంటూ ప్రగల్భాలు పలికాడు. ఇప్పుడు రష్యాను ఏదో విధంగా చర్చలకు ఒప్పించాల్సిందిగా అందరినీ ప్రాధేయపడుతున్నాడు. ఈ జ్ఞానమేదో మొదటే ఉండుంటే ఇంత అనర్థం జరుగకపోను కదా? అది కూడా ఓసారి చర్చలకు సిద్దమనీ, మరోసారి కాదనీ ఇలా పూటకోమాట మాట్లాడుతున్నారు. తెలివైన రాజకీయవేత్త ఎవరూ ఇలా ప్రవర్తించరు. ఈయూలోనో, రష్యాలోనో చేరే విషయమై మేం మరో పదేళ్ళ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పి సమస్యను ఓ దశాబ్దం పాటు వాయిదా వేసుండేవారు. అసలు విషయం ఏంటంటే….. ఇంతకముందు ఉన్న అధ్యక్షుడితో ఈ విషయంలోనే విభేదించి, ఈయూలో కలుద్దామనుకుంటున్న ప్రజల అభీష్టానికి విరుద్ధంగా అధ్యక్షుడు వ్యవహరిస్తున్నాడంటూ ప్రజలను రెచ్చగొట్టి, తాను వారి కలలను నిజం చేస్తానంటూ ఓ పిచ్చి హామీ ఇచ్చి ఈయన అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆ హామీలను నిలబెట్టుకునే వెఱ్ఱి ప్రయత్నంలో ఇలా దేశాన్ని కష్టాల కొలిమిలోకి నెట్టేశాడు. ఇది ఆయన అపరిపక్వకు నిదర్శనం.అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఉక్రెయిన్ దేశ ప్రజలతో పాటుగా, ప్రపంచ దేశాల ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే…. దేశాన్ని నడిపించే నాయకులకు కావాల్సింది గ్లామరో, గ్రామరో, హ్యూమరో కాదు. తన దేశం పట్ల అపారమైన ప్రేమ, తన దేశ ప్రయోజనాల పట్ల రాజీ లేని తత్వం, ప్రపంచ పరిస్థితుల పట్ల అవగాహన. ఎవరితో ఎలా మెలిగితే తన దేశానికి ప్రయోజనమో తెలిసిన నేర్పు, ఓర్పు, పట్టువిడుపు ఉన్నవాడు, పరిస్థితులకు తగ్గట్టుగా జనాన్ని కన్విన్స్ చెయ్యగలిగినవాడే నిజమైన నాయకుడు అవగలుగుతాడు. వ్యక్తిగతమైన భేషజానికో, ప్రతిష్ఠకో ప్రాకులాడి దేశ రక్షణను, ప్రయోజనాలను ఫణంగా పెట్టేవాడు కాదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంయమనం కోల్పోకుండా తన దేశ హితమే పరమార్థంగా పనిచేసేవాడు, ఎక్కడ నెగ్గాలో…. ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడు మాత్రమే ఏ దేశాన్నైనా ప్రగతి పథంలో నడుపగలుగుతాడు. ప్రజలు కూడా సినీ, క్రీడా గ్లామర్ కో, కులానికో, వర్గానికో, ప్రాంతానికో, భాషకో, మతానికో ప్రాధాన్యం ఇవ్వక దేశ హితమే పరమ లక్ష్యంగా భావించి, ఆలోచించి తమ నేతను ఎన్నుకున్నప్పుడే ప్రజాస్వామ్యం సఫలమవుతుంది.
Belars
3. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ… గురించి తెలుసుకుందామా ?????
ఒకప్పుడు కామెడీ షోలతో యుక్రెయిన్ ప్రజల గుండెల్లో గిలిగింతలు పెట్టిన ఆయన.. ఇప్పుడు అదే గుండెల్లో పొంగిపొర్లే లావా రగిలిస్తున్నారు..! చరిత్రలో తన పేరు నిలిచిపోయెలా చేసుకున్నారు..! అవును..! యుక్రెయిన్‌ అధ్యక్షడు జెలెన్‌స్కీ ఇప్పుడు వరల్డ్‌వైడ్‌ సెన్సేషన్..! ఆయనో రోల్‌మోడల్‌..! ఆయనో స్ఫూర్తి..!ప్రపంచాన్ని శాశిస్తున్న నియంతలకు కూడా తలగ్గొని హీరో ఆయన..! ఒక్క చూపుతో ప్రపంచంపై ఆధిపత్యం చలాయించే అగ్ర దేశాధినేతలను సైతం ఎదిరించగల బాహుబలి ఆయన..! తానే పెద్ద మోనార్క్‌నంటూ విర్రవీగే రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు కూడా చుక్కలు చూపించిన ప్రెసిడెంట్‌ ఆయన..! యుక్రెయిన్‌-రష్యా యుద్ధ సమయంలో ప్రపంచం ఒక హీరోని గుర్తించింది..! కమెడియన్‌ కాదు. అప్పుడు నవ్వించాడు. ఇప్పుడు దేశాన్ని ముందుండి నడిపిస్తున్నాడు.! నాడు ఆనందం పంచాడు.. నేడు దేశ ప్రజల్లో యుద్ధ ఉత్సాహాన్ని నింపుతున్నాడు. తగ్గేదేలేదు అంటూ రణరంగంలో సైనిక అవతారమెత్తాడు.! యుక్రెయిన్‌లో 2014 వరకు ఉన్నది రష్యా అనుకూల ప్రభుత్వాలు. కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. కానీ ఇవాళ యుక్రెయిన్‌ ప్రజలకు ఓ రాజు ఉన్నాడు. రీల్ లైఫ్‌లో జోకర్‌ అయిన ఆయన, రియల్‌ లైఫ్‌లో మాత్రం అసలు సిసలైన హీరో..! అతనే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ.రాజంటే రాజసాన్ని ప్రదర్శించేవాడు కాదు. తన రాజ్యాన్ని కంటికి రెప్పలా కాచుకునేవాడు. రాజంటే రాజభోగాలు అనుభవించేవాడు కాదు. తనను నమ్మిన ప్రజలకు ఆపద ఎదురైతే తానున్నానంటూ ముందు నిలిచేవాడు. పోరాడే సమయంలో పారిపోయాడిని పిరికివాడు అంటారు.. అదే పోరాటంలో తానే ముందుకు దూకితే వీరుడంటారు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని కూడా అలాంటి వీరుడే.రష్యన్ ఆర్మీ బాంబు దాడులను వెరవకుండా సైనికుడిగా మారారు జెలెన్‌స్కీ. అయితే శుత్రువులకు చిక్కకుండా తన ఉనికిని రహస్యంగా ఉంచుతూ వ్యూహాత్మకంగా దూసుకెళ్తున్నారు. అధ్యక్షుడిగా కుర్చీకే పరిమితం కాకుండా ప్రజా రక్షణకు కదనరంగంలోకి దూకారు. సైనికులతో కలిసి రష్యన్ బలగాలను ఎదిరిస్తున్నారు ఈ యుక్రెయిన్‌ బాహుబలి.తమకంటే ఎన్నోరెట్లు బలమైన రష్యాతో తలపడుతున్న జెలెన్‌స్కీ ఒకప్పుడు టీవీ సీరియళ్లలో హాస్యనటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. నటుడిగా, స్క్రిప్ట్‌ రైటర్‌గా, నిర్మాతగా వినోద రంగంలో రాణించారు. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. నటులు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడం కొత్తేమీ కాకపోయినా ఆయన ప్రస్థానం నిజంగా ఆసక్తికరం.జెలెన్‌స్కీ 1978 జనవరి 25న అప్పటి సోవియన్‌ యూనియన్‌లోని క్రైవీ రిహ్‌ పట్టణంలో యూదు కుటుంబంలో జన్మించారు. ప్రస్తుతం ఈ పట్టణం దక్షిణ యుక్రెయిన్‌లో ఉంది. ఆయన మాతృభాష రష్యన్‌ అయినప్పటికీ యుక్రెయినియన్, ఇంగ్లీష్ భాషల్లోనూ మంచి పట్టు సాధించారు. ప్రాథమిక, కళాశాల విద్య అనంతరం 2000వ సంవత్సరంలో కీవ్‌ నేషనల్‌ ఎకనామిక్‌ యూనివర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించేందుకు అర్హత ఉన్నప్పటికీ అటువైపు మొగ్గు చూపలేదు.17 ఏళ్లకే కామెడీ షోల్లో పాల్గొని సత్తా చాటారు జెలెన్‌స్కీ. తర్వాత 1997లో క్వర్తల్‌-95 అనే సంస్థను నెలకొల్పారు. ఈ క్వర్తల్-95 ప్రఖ్యాత కామెడీ గ్రూప్‌గా పేరుపొందింది. ఈ హాస్య బృందంలో సభ్యుడిగా ఉంటూ ఒకప్పటి సోవియట్ యూనియన్ దేశాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రదర్శనలు ఇచ్చారు జెలెన్‌స్కీ. 2003లో టీవీ షో నిర్మాతగా, తర్వాత 2008లో నటుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు.2014లో యుక్రెయిన్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దేశంలోని రష్యన్ కళాకారులను నిషేధించాలి అనుకున్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకించారు. 2015లో రష్యా కళాకారులు, ప్రదర్శనలు, వారి సాంస్కృతిక ఆనవాళ్లను యుక్రెయిన్ ప్రభుత్వం నిషేధించింది. దీంతో తన దృష్టిని రాజకీయాలవైపు పెట్టారు జెలెన్‌స్కీ. మరోవైపు సినిమాల్లో ఇటు టీవీ షోల్లో నటిస్తూ, షోలు నిర్మిస్తూ మంచి పేరు సంపాదించారు జెలెన్ స్కీ. అదే సమయంలో తన ప్రదర్శనలతో ప్రభుత్వ విధానాలను విమర్శించారు.2015-2019 మధ్య ప్రసారమైన ‘సర్వెంట్ ఆఫ్ ది పీపుల్‌’ అనే టీవీ షో జెలెన్‌స్కీ జీవితాన్ని మ‌లుపు తిప్పింది. ఈ షోలో జెలెన్‌స్కీ ఓ హైస్కూల్ హిస్టరీ టీచర్‌గా నటించాడు. అప్పటి యుక్రెయిన్ ప్రభుత్వ వైఖ‌రిని క‌డిగిపారేసిన షో అది. ప్రభుత్వంలో అవినీతిని బ‌హిర్గతం చేసి ఉతికారేసిన ఆ షో దేశ‌వ్యాప్తంగా సూప‌ర్ హిట్ అయ్యింది. ఆ వీడియోలు దేశ ప్రజ‌ల్ని ఎంతో ప్రభావితం చేశాయి.
Belarus
4. ఉక్రెయిన్ వ్యూహంతో రష్యా కకావికలం
ఉక్రెయినను సునాయాసంగా చేజిక్కించుకుందామనుకున్న రష్యా ఆశ నెరవేరడం అంత సులువు కాదనే విషయం ఆ దేశానికి అర్థమైంది. భారీగా యుద్ధట్యాంకులు, క్షిపణి దాడులు, వైమానిక దాడులతో రష్యా విరుచుకుపడింది.
రష్యాతో పోలిస్తే ఉక్రెయిన్ వద్ద ఉన్న ఆయుధ సామగ్రి అతి స్వల్పం అయినప్పటికీ గుండె ధైర్యంతో పోరాడింది. రాజధాని కీప్ సరిహద్దుల్లోనే రష్యా సేనలను నిలువరించింది. భీకరంగా పోరాడి రష్యా సైన్యంలో అత్యంత శక్తివంతమైన కమాండర్లను మట్టుబెట్టింది. ఇక ఆ దేశంలో రెండో అతి పెద్దనగరం ఖార్కీవ్ ను రష్యా సేనలు స్వాధీనం చేసుకున్నాయి. కొద్దిసేపట్లోనే తిరిగి ఉక్రెయిన్ తమ స్వాధీనంలోకి తెచ్చుకుంది.ఈ క్రమంలో ఆ దేశం అనుసరించిన వ్యూహం వింటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. రహదారులపై మార్గాలను తెలిపే సూచిక బోర్డులను మార్చేసింది. ఫలితంగా ఆ నగరంలోకి వచ్చిన రష్యా సేనలు దారి తప్పాయి. ఈలోపు అన్ని వైపుల నుంచి దాడి చేసి, తమ నగరానికి తిరిగి స్వాధీనం చేసుకున్నాయి ఉక్రెయిన్ సేనలు.
Defence
5. ఉక్రెయిన్‌లో భారతీయులు.. కేంద్రం కీలక నిర్ణయం
ఉక్రెయిన్‌ పరిణామాలు, ముఖ్యంగా అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల తరలింపే ఎజెండాగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సోమవారం హై లెవల్‌ మీటింగ్‌ జరిగింది. ఇప్పటికే ఆపరేషన్‌ గంగ పేరుతో భారతీయులను స్వదేశానికి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా భేటీలో.. కేంద్రమంత్రులు స్వయంగా ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాలకు వెళ్లి తరలింపు ప్రక్రియను పర్యవేక్షించాలని ప్రధాని మోదీ నిర్ణయించినట్లు సమాచారం. కేంద్ర మంత్రులు హర్దీప్‌ సింగ్‌ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరెన్‌ రిజ్జు, జనరల్‌(రిటైర్డ్‌) వీకే సింగ్‌ ఇందులో పాల్గొననున్నట్లు అధికార వర్గాల సమాచారం. వీళ్లు హంగేరి, రొమేనియా, పోల్యాండ్‌, స్లొవేకియా దేశాలకు వెళ్తారు. అక్కడే ఉండి పరిస్థితి సమీక్షిస్తూ.. భారతీయుల తరలింపును వేగవంతం చేస్తారు. భారతీయులను సురక్షితంగా, త్వరగతిన స్వదేశానికి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశంగా ఈ మిషన్‌ను చేపట్టింది కేంద్రం. మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ ఉన్నత స్థాయి సమావేశంలో.. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సహా పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు.ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌ నుంచి పోల్యాండ్‌కు వలసలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ తరుణంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటుండగా.. భారతీయులపై స్థానిక పోలీసులు దాడి చేసిన వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఉక్రెయిన్‌లో సుమారు పదిహేను వేల మంది దాకా భారతీయులు ఉన్నట్లు కేంద్రం అంచనా వేస్తోంది.
KYIV-ARMED-CIVIL-DEFENCE
6. ఉక్రెయిన్‌ అధ్యక్షుడి హత్యకు రష్యా స్కెచ్‌.. రంగంలోకి దిగిన వాగ్నర్‌ గ్రూప్‌!
ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీని అంతమొందించడానికి రష్యా వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. సుమారు 400 మంది కిరాయి సైనికులను రష్యా.. ఉక్రెయిన్‌కు పంపించినట్లు సమాచారం. వాగ్నర్‌ గ్రూప్‌ ఉక్రెయిన్‌ భూభాగంలోకి ప్రవేశించింది. అధ్యక్షుడు జెలెన్‌స్కీతోపాటు 20 మంది ఎంపీలను హత్యచేయడానికి రష్యా కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ పథకం అమలు చేయడానికి వాగ్నర్‌ గ్రూప్‌ జనవరిలోనే ఉక్రెయిన్‌లో దిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉక్రెతయిన్‌లో రెండు నుంచి నాలుగు వేల మంది రష్యా కిరాయి సైనికులు చొరబడినట్లు తెలుస్తోంది. మరోవైపు వాగ్నర్‌ గ్రూప్‌ను పట్టుకోవడానికి ఉక్రెయిన్‌ సైన్యం ప్రయత్నాలు చేస్తోంది.మరోవైపు రష్యా సైన్యం శాంతి చర్చలు అంటూనే ఉక్రెయిన్‌పై సైనిక దాడులు కొనసాగిస్తోంది. బెలారస్‌ సరిహద్దుల్లో రష్యా-ఉక్రెయిన్‌ మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో రష్యా-ఉక్రెయిన్‌ ప్రతినిధులు పాల్గొననున్నారు
Ukraine-Beer-Bottles-Attack
7. సారీ అమ్మా.. నేను భారత్‌కు రాలేను! దేశం కోసం నేహ తండ్రి బలయ్యాడు! అందుకే..
ఉక్రెయిన్‌ యుద్ధ వాతావరణంతో అక్కడి పౌరులు సైతం ఆయుధాలు చేతబడ్డి కదనరంగంలోకి దూకారు. ఇక విదేశీ పౌరులేమో ప్రాణాల కోసం పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు భారత్‌కు క్షేమంగా చేరుకున్నారు. మరికొందరిని రప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇంకొందరు బంకర్లలో(అండర్‌ గ్రౌండ్‌ల్లో) తలదాచుకుని సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఓ విద్యార్థిని చేసిన పని.. ఆమె కుటుంబంలో ఆందోళన కలిగిస్తుండగా.. మిగిలిన వాళ్లంతా శెభాష్‌ అని మెచ్చుకుంటున్నారు. హర్యానాకు చెందిన నేహా .. మెడిసిన్‌ కోసం ఉక్రెయిన్‌ వెళ్లింది. కొన్నాళ్లు హాస్టల్‌లో ఉన్న ఆమె ఆ తర్వాత ఉక్రెయిన్‌కు చెందిన ఒక సివిల్‌ ఇంజనీర్‌ ఇంట్లో ఆశ్రయం పొందింది. ప్రస్తుత పరిస్థితుల్లో.. కావాలంటే ఆమె భారత్‌కు తిరిగి వచ్చేది. కానీ, ఆమె ఉంటున్న ఇంటి యజమాని యుద్ధం కోసం సైన్యంలో చేరాడు. ఈ పరిస్థితుల్లో ఆ ఇంటిని వీడేందుకు నేహ నిరాకరించింది. తనకు అన్నం పెట్టిన కుటుంబం ఆపదలో ఉంటే ఎలా రావాలంటూ.. అక్కడే ఉండిపోయింది. అదే ఇంట్లోనే ఉండి పిల్లలను చూసుకోవడంలో ఆయన భార్యకు సాయం చేయాలని నిర్ణయించుకుంది. 17 ఏళ్ల నేహా ప్రస్తుతం సదరు ఇంజనీర్‌ భార్య, ఆయన ముగ్గురు పిల్లలతో కలిసి బంకర్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. నేహా కుటుంబం మాతృభూమి కోసం ఎంతో త్యాగం చేసింది. ఆమె తండ్రి ఇండియన్‌ ఆర్మీలో పనిచేసేవాళ్లు. కొన్నేళ్ల కిందట యుద్ధంలో ఆయన కన్నుమూశారు. అప్పటి నుంచి తల్లి బాధ్యతగా ముందుకెళ్తోంది. ఆమె ప్రస్తుతం హర్యానాలోని చర్కీ దాద్రీ జిల్లాలో టీచర్‌గా పని చేస్తున్నారు. తన కూతురిని ఉక్రెయిన్ నుంచి రప్పించేందుకు నేహా తల్లి ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ, నేహ మాత్రం ససేమిరా అంది. ‘నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు కానీ.. ఈ పిల్లలను వదిలి రాలేను. నాకు జన్మనిచ్చిన తండ్రి దేశం కోసం అమరుడయ్యాడు. తండ్రి లాంటి వ్యక్తి దేశం కోసం పోరాటంలో ఉన్నారు. అన్నం పెట్టిన ఈ అమ్మను ఇలాంటి పరిస్థితిలో వదిలిపెట్టలేను’ అంటూ తన తల్లితో చెప్పేసింది. ఈ విషయాన్ని నేహ కుటుంబానికి దగ్గరైన సవితా జాఖర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.
Ukraine-Neha-Haryana
8. అది ఒక బీర్.. కానీ, ఇప్పుడు అదే ఉక్రెయిన్‌ ‘ఆయుధం’!
ఉక్రెయిన్‌ నగరం లీవ్‌.. పోలాండ్‌ బార్డర్‌కి 70 కిలోమీటర్ల దూరం. ఆ భూభాగంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తున్న రష్యా దళాలకు రెండు రోజులుగా ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. సైన్యం తుటాలు, బాంబులతో పాటు గాల్లోంచి పడుతున్న బీర్‌ సీసాలు.. భారీ శబ్ధాలతో పేలిపోతున్నాయి. దీంతో రష్యా బలగాలు అక్కడే ఆగిపోయాయి. ఇంతకీ ఆ బీర్‌.. ఎందుకలా పేలిపోతున్నాయో చెప్తున్నారు ప్రావ్డా బ్రూవరీ యజమాని యూరై జాస్టనీ. ఉక్రెయిన్ లోని లివ్ పట్టణానికి చెందిన ప్రావ్డా బ్రూవరీ బీర్ల తయారీకి ప్రసిద్ధి. కానీ, యుద్ధం నేపథ్యంలో బీర్ల తయారీని ఆపేసింది ఈ కంపెనీ. అందుకు బదులుగా రష్యా సైన్యం కోసం ప్రత్యేకంగా ‘మొలటోవ్ కాక్ టెయిల్’ తయారు చేస్తోంది. తాగడానికి కాదు.. లేపేయడానికి!. ప్రస్తుతం ఈ కంపెనీలో ఉద్యోగులు హుషారుగా ఈ బాటిల్‌ బాంబులను తయారు చేస్తున్నారు. ఈ బీర్‌ బాటిళ్లలో ఆయిల్‌, పెట్రోల్‌ మిక్స్‌ చేసి వాడేస్తున్నారు. అందులో గుడ్డను ముంచి రష్యా బలగాల వైపునకు విసిరేస్తున్నారు. లోపల ఉండే కాక్ టెయిల్ పెట్రోల్, ఆల్కహాల్ మాదిరే మండే స్వభావంతో ఉంటుంది. సీసా మూతభాగంలో ఉన్న వస్త్రానికి అగ్గి రాజేసి శుత్రు సేనలపై విసిరి కొడితే అవతలి వాళ్ల పని మటాషే!. ఉక్రెనియన్‌ టెర్రిటోరియల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ల కోసం శనివారం నుంచి తయారు చేస్తున్నారు
ukraine11
9. మా ప్రజలు హింసకు గురవుతుంటే అలా వదిలేయ లేం: Rahul Gandhi
ఉక్రెయిన్ సంక్షోభంపై ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ కీలక సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. తరలింపు కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించడమే కాక ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితిపై విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా ప్రధానమంత్రికి ప్రెజెంటేషన్ ఇచ్చారని అధికారిక వర్గాలు తెలిపాయి. అంతేకాదు తరలింపు ప్రయత్నాల మధ్య సుమారు 2 వేల మంది భారతీయులను తిరిగి తీసుకువచ్చినట్లు కూడా ప్రభుత్వం ఆదివారం తెలిపింది. అయితే ఇంకా కొంతమంది విద్యార్థులు ఉక్రెయిన్‌ సరిహద్దుల వద్ద చిక్కుకుపోయారు.అంతేకాదు ఆ సరిహద్దు వద్ద ఉన్న గార్డులు భారతీయ విద్యార్థులను హింసకు గురిచేస్తున్నారు. అమ్మాయిలని కనికరం కూడా లేకుండా దారుణంగా కొడుతున్నారు. కొంతమంది విద్యార్థులను సరిహద్దుల నుంచి నెట్టివేయడంతో అక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగానూ, గందరగోళంగానూ ఉంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఆయన అక్కడ పరిస్థితిపై ఆందోళన చెందుతూ దయచేసి ప్రభుత్వం త్వరితగతిన భారతీయ విద్యార్థులను తరలించాలని కోరారు. హింసకు గురువుతున్న భారతీయ విద్యార్థులు వారి కుటుంబాలను చూస్తుంటే హృదయం విలవిలాడిపోతుందని అన్నారు.అంతేకాదు తరలింపు చర్యలు మరింత ముమ్మరంగా సాగించాలని ప్రభుత్వానికి విజ్క్ష ప్తి చేశారు. నివేదికల ప్రకారం విద్యార్థులు పోలాండ్ దాటడానికి ప్రయత్నించినప్పుడు వేధింపులకు గురవుత్ను వీడియో అని తెలుస్తోంది. అయితే ఉక్రెయిన్ గగనతలం మూసివేయబడినందున, కేంద్ర ప్రభుత్వం గత వారం హంగరీ, పోలాండ్, రొమేనియ, స్లోవేకియా రిపబ్లిక్ సహాయంతో ప్రత్యామ్నాయ తరలింపు ప్రణాళికలను రూపొందించింది. పైగా సంబంధిత అధికారులతో సమన్వయం లేకుండా సరిహద్దు ప్రాంతాలకు చేరుకోవద్దని ప్రభుత్వం ఒక ప్రకటనలో విద్యార్థులకు తెలిపింది కూడా
ukraine-president
10. రష్యాతో జతకట్టనున్న బెలారస్‌!
ఐక్యరాజ్యసమితిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన పలు వాదనలు వినిపించాయి. గత వారం రష్యా దాడి ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 3 వేల మంది రష్యన్‌ సైనికులు మరణించారని, దాదాపు 200 మంది సైనికులను యుద్ధ ఖైదీలుగా పట్టుకున్నామని ఉక్రెయిన్‌ పేర్కొం ది . అయితే వాటిని క్రెమ్లిన్‌ తిరస్కరించింది.ముందస్తు షరతులు లేకుండా చర్చలు జరపడానికి ఇరు దేశాలు అంగీకరించాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ చెప్పారు. అయితే ఇప్పటి వరకు మాస్కో ఉక్రెయిన్‌ పై జరిపిన దాడిలో 14 మంది చిన్నారులతో సహా 352 మంది మరణించగా, 116 మంది చిన్నారులతో సహా వెయ్యి మంది గాయపడ్డారని తెలిపారు. మరోవైపు బెలారస్‌ కూడా రష్యాతో జత కట్టి ఉక్రెయిన్‌కి ఊహించని ఝలక్‌ ఇచ్చింది. మాస్కో దాడితో ఉక్రెయిన్‌లోని రష్యా బలగాలు క్షీణించడంతో వారికి సాయంచేసేందుకు బెలారస్‌ తన దళాలలను పంపనుందని సమాచారం.

11. బంకర్‌లో ఓ తెలుగమ్మాయి కష్టాలు..
ఉక్రెయిన్‌లోని మైకోలివ్‌ ప్రాంతంలో చిక్కుకుపోయిన పీ అండ్‌ టీ కాలనీ వాసి మద్దెల గీతానంద కోసం ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అక్కడి పెట్రోమోలియా బ్లాక్‌ సీ నేషనల్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతున్న ఈమె ప్రస్తుతం బంకర్‌లో తలదాచుకుని, ప్రాణాలు అరచేత పట్టుకుని ఉన్నట్లు తండ్రి గంగారాం తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది జూన్‌లో ఉక్రెయిన్‌ ప్రభుత్వం నిర్వహించే పరీక్షకు గీత హాజరుకావాల్సి ఉంది. అయితే యుద్ధ మేఘాలు అలుముకోవడంతో నెల రోజుల క్రితమే ఆమెను తల్లిదండ్రులు తక్షణం తిరిగి వచ్చేయాల్సిందిగా పదేపదే కోరారు. కానీ యూనివర్సిటీ వర్గాలు యుద్ధం రాదని చెప్తూ గీతానందతో పాటు ఇతర విద్యార్థులనూ అడ్డుకున్నారు

12. పుతిన్‌ చాయిస్‌.. ఉక్రెయిన్‌ చర్చల కోసం బెలారస్‌ ఎందుకంటే..
బెలారస్‌ అధ్యక్షుడు, ఆ దేశాన్ని 28 ఏళ్లుగా ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న అలగ్జాండర్‌ లుకషెంకో రష్యాకు దాసోహమనడం ఉక్రెయిన్‌లో రక్తచరిత్రను రాస్తోంది. ఒకప్పుడు బెలారస్‌ రాజధాని మిన్‌స్క్‌ వేదికగా రష్యా, ఉక్రెయిన్‌ మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. 2014, 2015లో రష్యా. ఉక్రెయిన్‌ మధ్య మిన్‌స్క్‌ 1, 2 ఒప్పందాలు కూడా కుదిరాయి. అలాంటి గడ్డపై శాంతి చర్చల కోసం కాలు మోపేదే లేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెగేసి చెప్పడం వెనక చాలా కారణాలే ఉన్నాయి. బెలారస్‌ అధ్యక్షుడు లుకషెంకో వ్యవహార శైలిపై ఉక్రెయిన్‌లో అసంతృప్తి భగభగమంటోంది.రష్యా సేనలు ఉక్రెయిన్‌ చేరుకోవడానికి లుకషెంకో ఎంతో సహకారం అందించారు. తమ దేశ సార్వభౌమత్వాన్ని పణంగా పెట్టి మరీ రష్యా సేనలకు ఆశ్రయం కల్పించడం, సరిహద్దులు దాటించడం వంటి పనులు చేశారు. కొద్ది నెలలుగా దాదాపుగా 30 వేల రష్యా బలగాలు విన్యాసాల పేరుతో బెలారస్‌లోనే మకాం వేసి పుతిన్‌ ఆదేశాల కోసం ఎదురు చూశాయి. అందుకే అమెరికా, యూరప్‌ దేశాలు రష్యాతో పాటు బెలారస్‌పైనా ఆర్థిక ఆంక్షలు విధించాయి

13. రక్షణకు 113 బిలియన్‌ డాలర్లు కేటాయించిన జర్మనీ
రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకునే దిశగా జర్మనీ కీలక నిర్ణయం తీసుకుంది. సాయుధ దళాల కోసం ఏకంగా 113 బిలియన్‌ డాలర్లు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు చాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ ప్రకటించారు. దేశ స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రక్షణపై పెట్టుబడులను మరింతగా పెంచాల్సిన అవసరముందని ఆదివారం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో చెప్పారు.తాజా ప్రకటనతో రక్షణపై పెట్టుబడులు దేశ జీడీపీలో 2 శాతాన్ని మించాయి. ఉక్రెయిన్‌కు సాయంగా 500 స్టింగర్‌ మిసైళ్లు, 1,000 యాంటీ ట్యాంక్‌ వెపన్స్, ఇతర ఆయుధాలు, సామగ్రిని పంపుతున్నట్టు శనివారం రాత్రి జర్మనీ ప్రకటించడం తెలిసిందే. రష్యాపై ఉక్రెయిన్‌ దాడి యూరప్‌లో రక్షణ విధానాలను తిరగ రాస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జర్మనీ తాజా నిర్ణయమే ఇందుకు నిదర్శనమంటున్నారు. రక్షణపై సరైన మొత్తంలో నిధులు వెచ్చించడం లేదంటూ అమెరికా, నాటో దేశాలు కొంతకాలంగా జర్మనీని విమర్శిస్తూ వస్తున్నాయి

14. ఉక్రెయిన్‌ నుంచి ఇప్పటిదాకా 2,000 మంది భారత్‌కు..
ఉక్రెయిన్‌లో యుద్ధ సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 2,000 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చామని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధ్దన్‌ శ్రింగ్లా ఆదివారం చెప్పారు. మిగిలిన వారందరినీ త్వరగా రప్పించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. ఉక్రెయిన్, రష్యా రాయబారులతో వేర్వేరుగా మాట్లాడానని తెలిపారు.
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులకు తగిన రక్షణ కల్పించాలని కోరానని అన్నారు. ఉక్రెయిన్‌–హంగేరి, ఉక్రెయిన్‌–రొమేనియా సరిహద్దుల్లో ప్రస్తుతం ఎలాంటి ఆంక్షలు లేవని, భారతీయులు రోడ్డు మార్గం ద్వారా అక్కడికి చేరుకుంటున్నారని వివరించారు. పోలండ్‌ సరిహద్దు మాత్రం ఉక్రెయిన్‌ ప్రజలతో కిక్కిరిసిపోతోందని చెప్పారు. భారతీయులు అక్కడికి చేరుకోవడం ఇబ్బందికరంగా మారిందని వెల్లడించారు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో దాదాపు 2,000 మంది భారతీయులు ఉన్నారని, వారిలో చాలామంది యుద్ధ భయం అంతగా లేని దేశ దక్షిణ ప్రాంతానికి వెళ్తున్నారని తెలిపారు. అంతేకాదు ఈ రోజు ఉదయానికి మరో 289 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చామని కూడా వెల్లడించారు.

15. 3.68 లక్షలకు ఉక్రెయిన్‌ వలసలు: ఐరాస
రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ ప్రజల వలసలు వేగంగా పెరుగుతున్నాయని ఐరాస వలస విభాగం తెలిపింది. శనివారం అంచనా ప్రకారం కనీసం 1.50 లక్షల మంది ప్రజలు ఉక్రెయిన్‌ వీడి పోగా ఆదివారానికి ఈ సంఖ్య 3.68 లక్షలకు చేరుకున్నట్లు పేర్కొంది. వీరంతా పోలండ్, హంగరీ, రొమేనియా తదితర దేశాల్లో తలదాచుకుంటున్నట్లు తెలిపింది.ఉక్రెయిన్‌ వీడి వచ్చే వారితో పోలండ్‌ సరిహద్దుల్లో 14 కిలోమీటర్ల పొడవైన కార్ల క్యూ ఉందని వలస విభాగం ప్రతినిధి క్రిస్‌ మీజర్‌ ట్విట్టర్‌లో తెలిపారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారన్నారు. ఎముకలు కొరికే చలిలో వీరు రాత్రంతా కార్లలోనే జాగారం చేశారని చెప్పారు.

16. కల’ను రష్యా కూల్చేసింది, కానీ మా.. : ఉక్రెయిన్‌
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ ఇంకా ఆగలేదు. ఓవైపు చర్చల ప్రక్రియపై ఉత్కంఠ నెలకొనగా.. మరోవైపు రష్యా సైన్యం, ఉక్రెయిన్‌ సైన్యం-సాధారణ పౌరుల మధ్య హోరాహోరీ యుద్ధం నడుస్తోంది. ఈ తరుణంలో ప్రపంచంలోనే అతిపెద్ద విమానం మ్రియాను రష్యా కూల్చేసింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ ఎయిర్‌ఫీల్డ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద విమానం మ్రియాను రష్యా దళాలు కూల్చేసినట్లు ఉక్రెయిన్‌ ప్రభుత్వ అధికారిక ట్విటర్‌ హ్యాండిల్‌ నిన్న(ఆదివారం) రాత్రి ప్రకటించింది. మ్రియా అంటే అర్థం కల అని. దానిని కూల్చేశారు. కానీ, బలమైన, స్వేచ్ఛా, ప్రజాస్వామ్యయుతమైన ఉక్రెయిన్ కలను మాత్రం నెరవేరుస్తాం అని అందులో పేర్కొంది ఉక్రెయిన్‌. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో క్యూలెబా ధృవీకరించారు కూడా.ఇదిలా ఉంటే మ్రియా అంటే కల అనేకాదు.. స్ఫూర్తి అనే అర్థమూ వస్తుంది. అతిపెద్ద ఎయిర్‌లిఫ్ట్‌ కార్గో.. ఆంటోనోవ్‌ డిజైన్‌ బ్యూరో (Antonov An-124) 80వ దశకంలో(సోవియట్‌ యూనియన్‌లో ఉండగానే) డిజైన్‌ చేసింది. 1985లో ఏఎన్‌-225 సిద్ధం కాగా.. మూడేళ్ల తర్వాత కార్యకలాపాలను మొదలుపెట్టింది. నిజానికి అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన వాటిని మోసుకెళ్లేందుకు ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను రూపొందించారు. సుమారు 640 టన్నుల బరువును మోసే సామర్థ్యం ఉంది ఈ విమానానికి. రష్యా దళాలు ఉక్రెయిన్‌ హోస్టోమెల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న An-225 ధ్వంసం చేయగా.. శకలానికి సంబంధించిన శాటిలైట్‌ చిత్రాలు బయటకు వచ్చాయి

17. నగరాల్లో హోరాహోరీ..ఎదురొడ్డి పోరాడుతున్న ఉక్రెయిన్‌ బలగాలు
ఉక్రెయిన్‌పై దాడిలో రష్యా సేనలు కీలక పట్టణాల్లోకి చొచ్చుకువస్తున్నాయి. దీంతో చాలా నగరాల్లో రష్యా బలగాలకు, ఉక్రెయిన్‌ మిలటరీకి మధ్య హోరాహోరీ పోరాటం కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎయిర్‌ఫీల్డ్స్, ఇంధన నిల్వాగారాలపై దాడులు చేసిన రష్యా బలగాలు ఆదివారం నాటికి ఉక్రెయిన్‌లోని కీలక నౌకాశ్రయాలను స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు చర్చలకోసం బెలారస్‌కు బృందాన్ని పంపినట్లు రష్యా ప్రకటించింది. కానీ తమ దేశం నుంచి దాడులకు కేంద్రమైన బెలారస్‌లో చర్చలకు వెళ్లమని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు

18. ఓవైపు ఉక్రెయిన్‌లో యుద్ధం జ‌రుగుతుంటే.. ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న ర‌ష్య‌న్ వొడ్కా.. ఎందుకు?
ప్ర‌స్తుతం ఉక్రెయిన్‌లో ప‌రిస్థితి ఎలా ఉందో అంద‌రికీ తెలుసు. ప్ర‌పంచ‌మంతా ఉక్రెయిన్ వైపు చూస్తోంది. ర‌ష్యా చేస్తున్న అరాచ‌కానికి ఉక్రెయిన్ బ‌ల‌వుతోంది. ఇప్ప‌టికే ఉక్రెయిన్‌లోని ప‌లు న‌గ‌రాల‌ను ర‌ష్యా అక్ర‌మించుకుంది. చాలామంది ఉక్రెయిన్ వాసులు దేశాన్ని వీడుతున్నారు. ఈనేప‌థ్యంలో ర‌ష్య‌న్ వొడ్కా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దానికి కార‌ణం.. యూఎస్‌, కెనెడాలో ర‌ష్యాకు చెందిన ర‌ష్య‌న్ వొడ్కాను బ్యాన్ చేయ‌డ‌మే. అవును.. ఉక్రెయ‌న్‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌పంచ దేశాలు ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.ఈనేప‌థ్యంలో యూఎస్‌, కెనెడాలో పాపుల‌ర్ అయిన ర‌ష్య‌న్ వొడ్కాను బ్యాన్ చేశారు. ర‌ష్య‌న్ వొడ్కాను ఇక అమ్మం అంటూ లిక్వ‌ర్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఒంటారియో ప్ర‌క‌టించింది. ప్ర‌పంచంలోనే ఆల్కాహాల్ ఇంపోర్ట్‌లో ఎల్‌సీబీవో అది పెద్ద సంస్థ‌. కెనెడాలో ఉంది. అది ర‌ష్య‌న్ వొడ్కాను ఇక ర‌ష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోమ‌ని ప్ర‌క‌టించింది. దీంతో నెటిజ‌న్లు కూడా దానికి మ‌ద్ద‌తు ప‌లికారు. వొడ్కా మాత్ర‌మే కాదు.. ర‌ష్యా నుంచి వ‌చ్చే అన్ని గూడ్స్‌ను అన్ని దేశాల్లో బ్యాన్ చేయాలి. అప్పుడే ర‌ష్యా తిక్క కుదురుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో సోష‌ల్ మీడియాలో ర‌ష్య‌న్ వొడ్కా మీద పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది

19. ఉక్రెయిన్‌ నుంచి వచ్చే ఒక్కో విమానానికి గంటకు ఎంత ఖర్చవుతుందో తెలుసా..?
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు ఎయిర్ ఇండియా విమానాలను నడుపుతోంది. ఈ విమానాల నిర్వహణ ఖర్చు రూ. 1.10 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. విమానాల వ్యవధి బట్టి మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో నెలకొన్న నేపథ్యంలో పొరుగు దేశాల నుంచి డ్రీమ్‌లైనర్‌ బోయింగ్ 787 విమానంతో ఎయిర్ ఇండియా భారతీయులను స్వదేశానికి తరలిస్తున్నది

20. పుతిన్ ఆస్తులు ఎంత‌ ? ఎక్క‌డెక్క‌డ దాచిపెట్టారు?
వ్లాదిమిర్ పుతిన్ ఆస్తులు ఎంత‌ ? ఆయ‌న సంపాద‌న ఎంత‌ ? బిలియ‌నీరా.. మిలియ‌నీరా.. ఎక్క‌డ ఉన్నాయి ఆయ‌న ఆస్తులు? ఎవ‌రి పేరు మీద ఆ సంపాద దాచిపెట్టారు ? ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ఆస్తుల‌పై ఇప్పుడు ప్రపంచ దేశాలు న‌జ‌ర్ పెట్టాయి. ఆయ‌న ఆస్తుల్ని స్తంభింప‌చేయాల‌ని డిసైడ్ అయ్యాయి. ఇప్ప‌టికే అమెరికా ఆంక్ష‌లు విధించింది. పుతిన్ ఆస్తుల్ని సీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఆ డ‌ర్టీ మ‌నీని మేం కూడా సీజ్ చేస్తున్నామ‌ని బ్రిట‌న్ కూడా వెల్ల‌డించింది. ఇంత‌కీ పుతిన్‌కు విదేశాల్లో ఆస్తులు ఉన్నాయా ? ప్రపంచ‌దేశాలుకు వార్ టెన్ష‌న్ పుట్టించిన పుతిన్ ఆస్తుల‌పై ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. అధికారిక‌రంగా పుతిన్ ఆస్తులు త‌క్కువే. కానీ వంద బిలియ‌న్ల డాల‌ర్ల‌కుపైగా ఆయ‌న ఆస్తులు ఉంటాయ‌ని కొంద‌రు అంచ‌నా వేస్తున్నారు.ఉక్రెయిన్‌పై ఆక్ర‌మ‌ణ‌కు వెళ్లిన పుతిన్ ఆస్తుల్ని సీజ్ చేస్తున్న‌ట్లు కొన్ని ప‌శ్చ‌మ దేశాలు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. కానీ ఆయ‌న ఆస్తుల గురించి మాత్రం చాలా త‌క్కువే తెలుసు. పుతిన్ మిత్రుల అకౌంట్ల‌లో మాత్రం బిలియ‌న్ల డాల‌ర్లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. వారి పేరు మీద ల‌గ్జ‌రీ ప్రాప‌ర్టీలు కూడా ఉన్నాయి. మిత్రుల ఫ్యామిలీ మెంబ‌ర్స్‌పైనా క‌నక‌వ‌ర్షం కురుస్తోంద‌ని నిపుణులు చెబుతున్నారు. అధికారిక‌రంగా పుతిన్ ప్ర‌తి ఏడాది 1,40,000 డాల‌ర్లు ఆర్జిస్తున్నారు. ప‌బ్లిక్ పేప‌ర్స్ ప్ర‌కారం ఆయ‌న‌కు ఓ చిన్న అపార్ట్‌మెంట్ కూడా ఉంది. కానీ లెక్క‌లోలేని ఆస్తులు చెప్ప‌లేన‌న్ని ఉన్నాయట‌.బ్లాక్ సీ తీరం వ‌ద్ద ఉన్న పుతిన్ ప్యాలెస్ ఓ అద్భుతం. ఆ ఒక్క బిల్డింగ్ సుమారు బిలియ‌న్ డాల‌ర్లు ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఓన‌ర్‌షిప్‌లో ఆయ‌న పేరు లేకున్నా.. పుతిన్ ప్ర‌భుత్వ పనుల‌న్నీ అక్క‌డ సాగుతాయ‌ట‌. ఇంకా ర‌ష్యా అధ్య‌క్షుడికి వంద మిలియ‌న్ల డాల‌ర్లు ఖ‌రీదు చేసే ఓ నౌక ఉన్న‌ట్లు తెలుస్తోంది. మోనాకోలో ఆయ‌నకు సుమారు 4 మిలియ‌న్ల డాల‌ర్ల ఖ‌రీదైన అపార్ట్‌మెంట్ ఉంది. పుతిన్ ప్రేమికురాలి పేరిట ఆ బిల్డింగ్‌ను ఖ‌రీదు చేసిన‌ట్లు రికార్డులు చెబుతున్నాయి. మాజీ భార్య పేరిట ఫ్రాన్స్‌లోనూ అత్యంత విలాస‌వంత‌మైన భ‌వ‌నం ఉంద‌ట‌. పుతిన్ ఆస్తుల్ని సీజ్ చేయాల‌నుకున్న ప‌శ్చిమ దేశాలకు ఇప్పుడో పెద్ద చిక్కు వ‌చ్చింది. ఎందుకంటే ఏ ఒక్క ప్రాప‌ర్టీ కూడా నేరుగా పుతిన్ పేరుమీద లేవ‌ట‌. ఆంక్ష‌ల‌తో పుతిన్‌పై వ‌త్తిడి తేవాల‌నుకుంటున్న ప‌శ్చిమ దేశాలు.. ఆయ‌న ఆస్తుల్ని మాత్రం క‌నిపెట్ట‌లేక‌పోతున్నాయి. పుతిన్ అనుచ‌రులు కూడా ఆయ‌న సంప‌ద‌ను దాచిపెట్టిన తీరు కూడా ప‌శ్చిమ దేశాల‌ను అయోమ‌యానికి లోనుచేస్తోంది.

అమెరికా ట్రెజ‌రీ శాఖ త‌యారు చేసిన ఓ జాబితాలో పుతిన్ ఉన్నారు. వెనిజులా అధ్య‌క్షుడు నికోలస్ మాడురో, ఉత్త‌ర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్‌, సిరియా అధ్య‌క్షుడు బాష‌ర్ అల్ అస‌ద్‌, ర‌ష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌లు యూఎస్ ట్రెజ‌రీ శాఖ నిషేధిత జాబితాలో ఉన్నారు. అయితే పుతిన్ ఆస్తులు సుమారు 200 బిలియ‌న్ల డాల‌ర్ల‌కు పైగా ఉంటుంద‌ని అమెరికా ఫైనాన్షియ‌ర్ బ్రిల్ బ్రౌడ‌ర్ తెలిపారు. పుతిన్ ఆస్తులు సుమారు 125 బిలియ‌న్ల డాల‌ర్లు ఉంటుంద‌ని జార్జిటౌన్ వ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ ఆండ‌ర్స్ అస్లాండ్ ఓ పుస్త‌కంలో తెలిపారు. అయితే మిత్రులు, బంధువుల పేరిట విదేశాల్లో ఆ ఆస్తులు ఉన్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.న‌ల్ల స‌ముద్రం వ‌ద్ద ఉన్న పుతిన్ ప్యాలెస్‌లో మూవీ థియేట‌ర్‌, హుక్కా లాంజ్‌, పోల్ డ్యాన్సింగ్ స్టేజ్ ఉన్న‌ట్లు కొంద‌రు తెలిపారు. ర‌ష్యా ప్ర‌తిప‌క్ష‌నేత అలెక్సీ న‌వాల్ని చేసిన ఆరోప‌ణ‌ల‌ను కొట్టిపారేస్తూ.. పుతిన్ చాలా సాధార‌ణ జీవితం సాగిస్తార‌ని, ఆయ‌న‌కు ల‌గ్జ‌రీ అవ‌స‌రం లేద‌ని ఇటీవ‌ల ర‌ష్యా టీవీ ఛాన‌ల్ పేర్కొన్న‌ది.
Whats-App-Image-2022-02-2
21. రష్యా దాడిలో ప్రపంచపు అతిపెద్ద విమానం ధ్వంసం
రష్యా చేస్తున్న దాడులు ఉక్రెయిన్‌లో భారీ నష్టానికి కారణమవుతున్నాయి. తాజాగా రష్యా దాడిలో ఉక్రెయిన్‌లో ఉన్న ప్రపంచ అతిపెద్ద విమానం ఏఎన్225 ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి డిమిట్రో కులేబా ప్రకటించారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు సమీపంలోని హోస్టోమెల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం పార్క్ చేసి ఉండగా, రష్యా ప్రయోగించిన ఒక మిస్సైల్ విమానాన్ని తాకింది. దీంతో విమానం కొంతమేర ధ్వంసమైంది. కాగా, ఈ విమానం ఎంత వరకు ధ్వంసమైందో ఇప్పుడే చెప్పలేమని, సాంకేతిక బృందం విమానాన్ని పరిశీలిస్తోందని, ఆ తర్వాతే ఈ నష్టంపై ఒక అంచనాకు రాగలమని ఉక్రెయిన్ తెలిపింది. ఏఎన్ 225 విమానం పేరు ‘మ్రియా’. ఉక్రెయిన్ భాషలో దీనికి కల అని అర్థం. ఇది ఆరు ఇంజిన్లు కలిగిన కార్గో విమానం. ఉక్రెయిన్‌కు చెందిన ఆంటోనోవ్ అనే సంస్థ ఈ విమానాన్ని తయారు చేసింది. రష్యన్లు తమ కల (విమానం)ను ధ్వంసం చేయగలరేమో కానీ, స్వేచ్ఛగా, మరింత బలంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదగాలనుకునే తమ దేశపు కలను ధ్వంసం చేయలేరని డిమిట్రో తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.
Whats-App-Image-2022-02-1
22. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు కేంద్రమంత్రులు.. స్టూడెంట్స్ను త్వరగా తరలించేందుకే..
ఉక్రెయిన్- రష్యా యుద్ధం తీవ్రతరమవుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉక్రెయిన్లో చిక్కుకున్న వేలాది మంది భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియను వేగవంతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నలుగురు కేంద్ర మంత్రులను ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు పంపాలని నిర్ణయించింది..ఉక్రెయిన్- రష్యా యుద్ధం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను తరలించే ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర మంత్రులను ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు పంపించనుంది. ఈ మేరకు నలుగురు కేంద్ర మంత్రులు హర్దీప్సింగ్ పూరి, జ్యోతిరాధిత్య సింధి యా, కిరెణ్ రిజిజు, వీకే సింగ్ ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లనున్నారు.రొమేనియా, మోల్డోవా నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియను సింధియా చూసుకోనున్నారు. కిరెన్ రిజుజు స్లొవేకియా, హర్దీప్ సింగ్ హంగేరి, వీ కే సింగ్ పోలాండ్ వెళ్లనున్నారు.
Whats-App-Image-2022-02
23. రష్యా బలగాలకు తోడుగా బెలారస్ సైన్యం- ఉక్రెయిన్పై దాడి తీవ్రతరం!
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఐదో రోజుకు చేరింది. ఇరు దేశాల బలగాల మధ్య భీకర పోరు జరుగుతోంది. అయితే సోమవారం నుంచి రష్యా సేనలతో బెలారస్ సైన్యం కలిసే అవకాశం ఉందని అమెరికా తెలిపింది. రెండు దేశాలు కలిసి ఉక్రెయిన్పై దండయాత్రను మరింత తీవ్రతరం చేయవచ్చని పేర్కొంది. మరోవైపు యుద్ధంలో ఇప్పటివరకు 352మంది పౌరులు మరణించినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. వీరిలో 14మంది చిన్నారులు ఉన్నట్లు తెలిపింది. ఉక్రెయిన్‌, రష్యా మధ్య సైనిక పోరు భీకరంగా కొనసాగుతోంది. ఐదో రోజూ రష్యా దూసుకొస్తుండగా..ఉక్రెయిన్‌ ఎదురొడ్డి నిలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం రాజధాని నగరం కీవ్‌, ప్రధాన నగరమైన ఖర్కీవ్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఉక్రెయిన్ స్టేట్ సర్వీస్ ఆఫ్ స్పెషల్ కమ్యూనికేషన్స్‌ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ ఈ విషయాన్ని వెల్లడించిందని ఓ వార్త సంస్థ తెలిపింది. కీవ్‌లో వైమానిక దాడులకు సంబంధించి హెచ్చరికలు జారీ అయ్యాయని పేర్కొంది. అక్కడి ప్రజలు సమీపంలోని షెల్టర్‌లో ఆశ్రయం పొందాలని సూచనలు వచ్చినట్లు చెప్పింది. అలాగే చెర్నిహివ్‌లోని ఓ నివాస భవనంపై క్షిపణి దాడి జరిగింది. దాంతో రెండు అంతస్తులు మంటల్లో చిక్కుకున్నాయి. క్షతగాత్రుల వివరాలు మాత్రం తెలియరాలేదు.
Whats-App-Image-2022-02-3
hindu masters crossword