Business

ఆగని పెట్రోల్ రేట్ల పెరుగుదల – TNI వాణిజ్య వార్తలు

ఆగని పెట్రోల్ రేట్ల పెరుగుదల – TNI వాణిజ్య వార్తలు

*ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు పెట్రో రేట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు పెట్రోల్ ధర 50 పైసలు, డీజిల్ రేటు 55 పైసలు పెరిగింది. గత ఆరు రోజుల్లో పెట్రో రేట్లు పెరగడం ఇది ఐదోసారి. ఈ కొత్త రేట్లతో ఢిల్లీలో పెట్రోలు లీటరు 99.11 రూపాయలకు చేరింది. డీజిల్ ధర 89,87కు చేరింది.
*ఐనాక్స్ లీజర్ లిమిటెడ్(బదిలీ కంపెనీ) విలీనానికి… తమ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని పీవీఆర్ లిమిటెడ్(బదిలీ సంస్థ) ఆదివారం తెలిపింది. ఐనాక్స్ బోర్డు కూడా విలీన పథకాన్ని ఆమోదించింది. ఆపరేషన్ ఒప్పందం) పథకం ప్రకారం ప్రతిపాదిత సమ్మేళనాన్ని ప్రభావితం చేసే విధానాన్ని, ప్రాతినిధ్యాలు, వారెంటీలు, సంబంధిత పార్టీల హక్కులు, బాధ్యతలను నిర్దేశిస్తుందని పీవీఆర్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. పీవీఆర్, ఐనాక్స్… రెండూ సినిమా ప్రదర్శన, ఆహారపానీయాలు, అనుబంధ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్న పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలు.
*లిథియం-అయాన్‌ బ్యాటరీలను తయారు చేస్తున్న సిగ్నీ.. హైదరాబాద్‌ సమీపంలో కొత్త తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందుకు రూ.300 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. దాదాపు ఏడాదికి 40 వేల బ్యాటరీల తయారీ సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. లిథియం-అయాన్‌ బ్యాటరీలను ఎలక్ట్రిక్‌ వాహనాల్లో, టెలికాం టవర్లు నిర్వహణ మొదలైన చోట్ల వినియోగిస్తున్నారు. విస్తరణ ప్రణాళికలకు అవసరమైన నిఽధుల కోసం 70 లక్షల నుంచి కోటి డాలర్లను రుణాలు, ఈక్విటీ రూపంలో సమకూర్చుకోవాలని సిగ్నీ యోచిస్తోంది.
*రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమర్థించారు. ఇది భారత ప్రభుత్వ పరిధిలో లేదని మంత్రి చెప్పారు. గత నాలుగు రోజుల్లో మూడుసార్లు ఇంధన ధరలను పెంచడాన్ని నియంత్రించలేమన్నారు.ముంబైలో జరిగిన ఓ శిఖరాగ్ర సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘భారతదేశంలో 80 శాతం చమురు దిగుమతి అవుతుంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లలో పెరిగాయి. దీని గురించి మేం ఏమీ చేయలేం’’ అని గడ్కరీ వివరించారు
*దేశంలో రోగులపై మరింత భారం పడనుంది.పారాసెటమాల్‌తో సహా 800 అత్యవసరమైన మందుల ధరలు ఏప్రిల్ నుంచి 10.7శాతం పెరగనున్నాయి. 2021 క్యాలండరు సంవత్సరానికి గాను మందుల టోకు ధరల సూచికను నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా ప్రకటించింది. మెజారిటీ సాధారణ జబ్బులకు చికిత్స చేయడానికి ఉపయోగించే నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్‌లో దాదాపు 800 షెడ్యూల్ చేసిన మందుల ధరలు ఏప్రిల్ 1 నుంచి 10.7 శాతం పెరగనున్నాయి.వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు కార్యాలయం అందించిన డేటా ఆధారంగా మందుల ధరలు పెంచినట్లు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నోటీసులో పేర్కొంది.
*భారత విమానయాన రంగం ప్రధానంగా మూడు సవాళ్లను ఎదుర్కొంటోందని బోయింగ్‌ కమర్షియల్‌ ఏరోప్లేన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (రీజినల్‌ మార్కెటింగ్‌) దేవ్‌ షుల్టే తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో విమానయాన ఇంధనం ధర 90 శాతం అధికంగా ఉంది. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో 70 శాతా న్ని విదేశీ కరెన్సీల్లో చెల్లించాల్సి వస్తోంది. తక్కువ దూరాల ప్రయాణ చార్జీలను పరిగణనలోకి తీసుకుంటే అతి తక్కువ సగటు చార్జీలు ఉన్నాయని చెప్పారు.